ప్రత్యేక
రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
అయితే.. రాష్ట్ర ఏర్పాటుతో సంబంధం లేని అతిపెద్ద సమస్య
ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. అదే
అన్నదాత ఆత్మహత్య సమస్య. ’కర్ణుడి చావుకు కారణాలనేకం’ అన్నట్లు తెంగాణలో రైతు అకాల మరణాలకు
కారణాలు క్యూ కడుతున్నాయి. వాటిని
గుర్తించడం, అధిగమించడం కష్టసాధ్యమే అయినా.. పక్కా ప్రణాళికతో ప్రయత్నిస్తే
అసాధ్యమేమీ కాదు. రైతుల ఆత్మహత్యలు
గతంలోనూ ప్రభుత్వాలకు సవాల్ విసిరిన
సందర్భాున్నాయి. అయితే.. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న మరణాల సంఖ్య మరీ
ఎక్కువగా ఉంటోంది. రైతు ఆత్మహత్యలే కాదు..
కళ్లముందు కనిపిస్తున్న పరిస్థితులు, భవిష్యత్తుపై భయాన్ని పెంచడం మూలంగా గుండెపోటుతో మరణిస్తున్న వాళ్ల సంఖ్య కూడా
నమోదవుతోంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరినీ ఓ సందేహం తొలుస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలోకన్నా.. తెలంగాణ స్వయం పాలిత రాష్ట్రం
సమృద్ధిగా ఉంటుందనుకుంటే గతంలో కన్నా తీవ్ర
ప్రతికూల పరిస్థితులు నెలకొనడం ఇటు రైతులను, అటు
విశ్లేషకులను ఆవేదనకు గురిచేస్తోంది. మరోవైపు.. కేసీఆర్ ప్రకటనలు, హామీలు,
ప్రణాళికలు ఏవీ రైతుకు భరోసా
ఇచ్చేందుకు దోహదపడటంలేదు భూగర్భ జలాలు అడుగంటడం, వరుణుడు
కరుణించకపోవడం, నాసిరకం విత్తనాలు వంటి సమస్యకు తోడు..
రైతు రుణమాఫీ పథకం కూడా గందరగోళంగా
తయారవడం అన్నదాతకు శరాఘాతంగా పరిణమించింది. ఇప్పటివరకు రైతుల రుణమాఫీ ఓ
మిస్టరీ గానే మారింది. పెట్టుబడులు
భారీగా పెరిగిపోవడం, పంటకు ప్రతికూల పరిస్థితులు
నెలకొనడం అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా అకాల మరణాలు, ఆత్మహత్యలు
చోటు చేసుకుంటున్నాయి.
ఆత్మహత్య
నివారణకు ఏమేం చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్న
ప్రభుత్వం..చనిపోయిన రైతు కుటుంబాలకు 6లక్షల
రూపాయల ఎక్స్గ్రేషియా
ప్రకటించింది. అయినా.. ఆత్మహత్యలు ఆగడం లేదు. వ్యవసాయాన్నే
నమ్ముకున్న రైతులు.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో వ్యవసాయమే దండగ అనే పరిస్థితులు
నెలకొన్నాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ప్రత్యేక
దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు
దీనిపై విస్తృతంగా చర్చించాల్సి ఉంది. ఆత్మహత్యల
నివారణకు పెద్ద ఎత్తున ప్రచారం
చేయడంతో పాటు.. ఓ నిధిని ఏర్పాటుచేస్తే
ఆర్థికంగా తోడ్పాటుగా ఉంటుంది. అలాగే. ఆత్మహత్యలపై ప్రభుత్వం పూర్థిస్థాయిలో విచారణ కమిటీ వేసి కారణాలను
విశ్లేషించాల్సి ఉంది. రైతు వ్యవసాయాన్నే
నమ్ముకుంటున్నారా... వారి కుటుంబ, ఆర్థిక,
రాజకీయ పరిస్థితు ఏమిటన్న వాటిపై సమగ్ర విచారణ జరిపించాల్సి
ఉంది. చనిపోయిన వారి కుటుంబనేపథ్యం, ఆత్మహత్యకు
దారితీసిన పరిస్థితులపైనా అధ్యయనం చేయాల్సి ఉంది. తెలంగాణ తేవడమొక్కటే
తమ లక్ష్యమన్నట్టుగా.. ఆ లక్ష్యాన్ని సాధించామన్నట్టుగా..
ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం కూడా సరైంది కాదు.
మరోవైపు.. ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటికేదో సానుభూతి ప్రకటించి మమ అనిపించుకోవడం, తర్వాత
ఆ అంశాన్ని పూర్తిగా మర్చిపోవడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో శాశ్వతమైన పరిష్కారం కనుగొనే దిశగా ఆలోచించాల్సిన అవసరం
ఉంది. అదే సమయంలో రైతన్నకు
ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసాను
కూడా కలిగించాల్సి ఉంది. తెలంగాణను సస్యశ్యామలంగా
మార్చే విధంగా బుర్రకు పదును పెట్టాల్సిన అవసరం
ఉంది.
- హంసిని
సహస్ర సాత్విక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి