2, జులై 2016, శనివారం

విశ్వమంతా ఒక్కటైన వేళ...

సరిహద్దులు చెరిగిపోయిన సమయం
ఆసనమేసిన యావత్ ప్రపంచం

                                                                                               - హంసిని సహస్ర సాత్విక



యోగా కోసం సరిహద్దులు చెరిగిపోయాయి. విశ్వమంతా ఒక్కటైంది. భారత ప్రధాని నరేంద్రమోదీ చొరవతో ప్రపంచస్థాయిలో పండుగ జరుపుకుంది. అంతర్జాతీయ వేదికలపై ఆసన విన్యాసాలు చేసింది. యావత్ ప్రపంచం ఆసనమేసింది. కోట్లాది మంది వీధుల్లోకి వచ్చి క్రమశిక్షణతో ఆసనాలు వేయడం కన్నుల పండువ అయ్యింది. గత యేడాదే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించగా.. ఈసారి రెండో యేడాది మరింత ఉత్సాహంగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాలకు గాను లిబియా, యెమెన్‌ మినహా అన్ని దేశాలు యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాయి. వీటిలో అరబ్ దేశాలు కూడా ఉండటం నిజంగా విశేషం. భారతీయ చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉన్న యోగా.. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి హాట్ ఫేవరేట్ అయ్యింది. ప్రాణాలను నిలబెట్టేదే కాదు.. నిత్యయన్వనాన్ని తెచ్చిపెట్టేది కూడా యోగా.

మోదీ ప్రతిపాదన.. ఐరాస ప్రకటన :
-----------------------------------
2014 సెప్టెంబర్ 27 ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ యోగా ప్రాధాన్యతను వివరిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆవశ్యకతను వివరించారు. అంతేకాదు.. జూన్‌ 21నే యోగా దినంగా ఎందుకు జరుపుకోవాలన్న దానిపైనా మోదీ స్పష్టత ఇచ్చారు. ఉత్తరార్థగోళంలో నమోదయ్యే అతిపెద్ద రోజు జూన్‌ 21. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆ తేదీకి ప్రాధాన్యత ఉంది. అందువల్లే యోగా దినోత్సవం ఆరోజు జరుపుకుంటే బాగుంటుందని ప్రతిపాదించారు. తదుపరి యేడాదే ఐక్యరాజ్యసమితి ఈమేరకు ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజాన్ని యోగా వేదికపైకి తీసుకొచ్చింది. ఈయేడాది.. ''అభివృద్ధి ల‌క్ష్యాలు సాధించాలంటే ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌నం అవ‌స‌రం'' న్న నినాదంతో యోగా దినోత్సవాన్ని నిర్వహించింది ఐక్యరాజ్యసమితి.


ఢిల్లీలో ప్రణబ్‌, చండీగఢ్‌లో మోదీ...
---------------------------------------
ఐక్యరాజ్యసమితి యోగా వేడుకల్లో 139 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు జగ్గీ వాసుదేవ్ యోగాసనాలు వేయించారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. యోగా ఒక రోజు లాంఛనం కాకూడదని.. యోగా దైనందిన జీవతంలో భాగం కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. ఇక.. చండీగఢ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో 30వేల మంది యోగా చేశారు. నరేంద్రమోదీ వందరకాల యోగాసనాలు ప్రదర్శించారు. యోగాకు ఒక మతం లేదని, యోగా వల్ల జీవితంలో క్రమశిక్షణ అలవాటు చేసుకునే వీలు కలుగుతుందని మోదీ గుర్తు చేశారు. ఇహలోక సుఖం కోసం ప్రతీ ఒక్కరూ యోగాను ప్రాక్టీస్ చేయాలని ఆయన సూచించారు. ఫరీదాబాద్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్.. యోగాసనాలు వేసి జనాన్ని ప్రోత్సహించారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ యోగా చేశారు. భారత సైన్యం, సరిహద్దు భద్రతాధళాలు కూడా యోగాలో భాగస్వాములయ్యాయి. భారత యుద్ద నౌక ఐఎన్ఎస్ విరాట్ సిబ్బంది కూడా యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా 391 వర్శిటీలు, 16 వేల కాలేజీలు, 12 వేల పాఠశాలల్లో యోగా దినోత్సవం నిర్వహించారు. మనదేశంలోనే లక్షకు పైగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమాల్లో 36 మిలియన్ల మంది యోగాసనాలు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్ల జనం యోగాసనాలు వేసినట్లు భావిస్తున్నారు. భారతదేశానికి చెందిన 173 సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యోగా కార్యక్రమాల్లో ప్రజలచేత ఆసనాలు వేయించాయి.

గర్భిణీల యోగా రికార్డు :
--------------------------
గుజరాత్ లోని రాజ్ కోట్ లో రెండువేల మంది గర్భిణీ మహిళలు ఏకకాలంలో యోగా చేయడం ద్వారా యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. యోగా చేస్తున్న వాళ్లకే కాదు.. కడుపులోని బిడ్డకూ ఆరోగ్యకరమే అని ప్రబోధించారు. అంతేకాదు.. సుఖప్రసవానికి కూడా యోగా దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. మరోవైపు.. హైదరాబాద్ లోనూ వందమంది గర్భిణీలు యోగాసనాలు వేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.

యోగా పోస్టల్ స్టాంప్ :
------------------------
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సూర్య నమస్కారాలతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

విశ్వవిద్యాలయాల్లో యోగా కోర్సులు :
-------------------------------------------
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతియేడాదీ అట్టహాసంగా జరుగుతున్నందున.. ఇదే స్ఫూర్తితో దేశంలోని విశ్వవిద్యాలయాల్లో యోగాను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. యోగా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్ని నిర్వహించాలంటూ యూజీసీని ఆదేశించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది.

- హంసిని సహస్ర సాత్విక


(Published in LOKAHITHAM Monthly Magazine)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి