చిన్నారులను ఆదరిస్తామనేది ముసుగు మాత్రమే... అనాథ శరణాలయం అనేది కేవలం బోర్డుకే పరిమితం. చిల్లర వేషాలతో చెలరేగిపోతున్న ముష్టియా. మన కళ్లు మనల్నే మోసం చేసేలా.. నయవంచక నాటకాలతో చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్న కంత్రీగాడి స్టోరీ.
సమాజాన్ని ఉద్ధరిస్తామంటారు...
సేవ చేస్తున్నామంటూ ఊదరగొడతారు...
అరచేతిలో స్వర్గం చూపిస్తారు...
తెర వెనుక వేరే తతంగం నడిపిస్తారు...
సమాజాన్ని ఉద్ధరిస్తామంటూ కొందరు బయల్దేరతారు. సమాజం కోసమే సేవ చేస్తున్నామంటూ ప్రచారంతో ఊదరగొడతారు. ఎదుటివాళ్లకు తాము చేస్తున్న ఘనకార్యాన్ని చెబుతూ అరచేతిలో స్వర్గం చూపిస్తారు. కానీ.. తెర వెనుక వేరే తతంగం నడిపిస్తారు.
సర్వసాధారణమైన వ్యవహారాలు
అవసరాలు, పరిస్థితులను బేరీజు వేసుకొని రంగంలోకి దిగుతారు
కొంత కాలంగా ఇలాంటి వ్యవహారాలు సర్వ సాధారణమైపోయాయి. సమాజం అవసరాలను, గ్రామాల స్థాయిలో పరిస్థితులను, పేదలు, అనాథలు, అమాయకుల అవసరాలను బేరీజు వేసుకుంటూ రంగంలోకి దిగుతారు.
అనాథలు, వృద్ధుల ఆశ్రమాలు చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌లంటారు
నిబంధనలు తెలియవు
మార్గదర్శకాలతో వాళ్లకు పనిలేదు
పిల్లలనే అస్త్రాలుగా వాడుకుంటారు
అనాథలు, వృద్ధుల ఆశ్రమాలంటూ.. చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌లంటూ కలరింగ్ ఇస్తారు. ఎవరి దృష్టీ పడని ప్రాంతాలు ఎంచుకొని బోర్డులు పెడతారు. అసలు నిబంధనలంటే వాళ్లకు తెలియవు. ఇలాంటి కేంద్రాలు ఎలా నిర్వహించాలో మార్గదర్శకాలతో పనిలేదు. వాటి పేరు చెప్పుకొని తమ పబ్బం గడుపుకుంటారు. చైల్డ్ హోమ్‌ల నిర్వాహకులు.. పిల్లలనే అస్త్రాలుగా వాడుకుంటారు. వెలుగులోకి వస్తే తప్ప.. ఎవరికీ కనిపించని ఓ మాఫియా తరహా వ్యవహారమిది.
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో చిన్నారుల భిక్షాటన
కనిపించిన వారినల్లా డబ్బులడుగుతున్నారు
హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ జంక్షన్‌లో నలుగురు చిన్నారులను గుర్తించారు పోలీసులు. ఇద్దరు బాలురు, మరో ఇద్దరు బాలికలు భిక్షాటన చేస్తున్నారు. చేతిలో హుండీలు పట్టుకొని కనిపించిన వారినల్లా డబ్బులడుగుతున్నారు. అంత చిన్న వయసులో వీళ్లకు ఇదేం పరిస్థితి అని చలించిపోయారు. దగ్గరికెళ్లి వాళ్ల గురించి వివరాలు ఆరా తీశారు.
అనాథాశ్రమానికి చెందినవాళ్లమన్నారు
భిక్షాటన చేయాలని ఆశ్రమ నిర్వాహకుడి ఆదేశం
తాము ఓ అనాథాశ్రమానికి చెందిన వాళ్లమని చెప్పారా చిన్నారులు. తమ ఆశ్రమం నిర్వాహకుడి ఆదేశాల మేరకు ఇక్కడ భిక్షాటన చేస్తున్నామని చెప్పారు. దీంతో.. తీగలాగిన పోలీసులు డొంకంతా కదిలించారు.
హైదరాబాద్‌లో రోజూ చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
భిక్షాటన అనేది సామాన్యమైన విషయం కాదు. హైదరాబాద్‌లో కేవలం భిక్షాటనపైనే రోజూ కోట్ల రూపాయలు చేతులు మారతాయన్న విషయం తెలిసిందే. దాన్ని ఆసరాగా తీసుకున్న ఆశ్రమ నిర్వాహకుడు చిన్నారులనే పావులుగా వాడుకున్నాడు. సాధారణంగా అసాంఘిక కార్యకలాపాలు ముదిరితే మాఫియా అనడం పరిపాటి.. మరి భిక్షాటనకూ ఓ సినిమాలో ఒక పేరు పెట్టారు.
చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం
బ్రహ్మపుత్ర అనాధాశ్రమంలో తనిఖీలు
నిర్వాహకుడు ఖమ్మం జిల్లా వాసి జేమ్స్
భిక్షాటన చేస్తున్న చిన్నారులిచ్చిన వివరాలతో చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారమిచ్చారు పోలీసులు. మెదక్ జిల్లా పటాన్ చెరు మండలం అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బ్రహ్మపుత్ర అనాథాశ్రమంలో తనిఖీలు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన జేమ్స్ అనే వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో ఉన్న 19మంది చిన్నారులను రెస్క్యూహోమ్‌కు తరలించారు.
ప్రభుత్వ అనుమతి లేకుండానే జేమ్స్ అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చైల్డ్‌లైన్ అధికారులు తెలిపారు. చిన్నారులను పాఠశాలకు పంపకుండా వారితో భిక్షాటన చేయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. జేమ్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. బ్రహ్మపుత్ర అనాథాశ్రమం పేరిట ఇలాంటి తతంగం చాలా రోజుల నుంచి జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి