26, జూన్ 2019, బుధవారం

ముహూర్తం కుదిరింది

ముహూర్తం కుదిరింది..

ముహూర్తం కుదిరింది..
నాలుగో తేదీ దాటితే మంచి ముహూ ర్తాలు లేవు.. కేటీఆర్‌ రాష్ట్ర మంతటా ఓ రౌండ్‌ చుట్టేసి రావాలి.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడంపై ఓ స్పష్టత రావాలి.. ఇంతలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఇంకేముంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరడం మరో నెలరోజుల వరకూ వాయిదా పడొచ్చు… లాంటి ప్రచారాలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా షికార్లు కొట్టాయి. జాతకాలు, జ్యోతిష్యాలు, ముహూర్తాలు ఎక్కువగా విశ్వసించే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పట్లో ఈ ఆలోచన చేయబోరని అంతా అనుకున్నారు. కానీ అన్నింటికీ ముహూర్తం కుదిరింది. అనుకోని రీతిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో సందిగ్ధానికి తెరపడింది.
ఎన్నికల ఫలితాలు వెలువడి నెల దాటిపోయినా ఇంత వరకూ అసెంబ్లీని సమావేశ పరచడం లేదనే విమర్శలు పెరుగుతోండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పైగా తిథిని చూసుకొని మరీ తేదీలు ఖరారు చేసినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఉత్తరాయన పుణ్యకాలంలో ఏకాదశి తిథిని ఎంచుకొని అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి సీఎం కార్యాలయం ముహూర్తం నిర్ణయించిందంటున్నారు.
ప్రొటెం స్పీకర్‌గా అహ్మద్‌ ఖాన్‌
జనవరి 17వ తేదీ నుంచి తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి 20వ తేదీ వరకు జరుగుతాయి. కొత్త శాసన సభకు ప్రొటెం స్పీకర్‌గా చార్మినార్‌ నుంచి మజ్లిస్‌ పార్టీ తరపున గెలిచిన ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ వ్యవహ రించనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 16వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆయనతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 17న ఉదయం పదకొండున్నర గంటలకు ప్రొటెం స్పీకర్‌ అధ్యక్షతన అసెంబ్లీ సమా వేశమవుతుంది. నాలుగు రోజుల పాటు శాసనససభ సమావేశాలు కొనసాగుతాయి.
ఎంఐఎం ఎమ్మేల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించినందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సీఎం కేసీఆర్‌కు ధన్య వాదాలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు.
మరోవైపు అహ్మద్‌ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత, గోషామహల్‌ శాసన సభ్యుడు రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. హిందూమతాన్ని వ్యతిరేకించే, దేశభక్తి లేని ఎంఐఎం పార్టీ నేత ప్రొటెం స్పీకర్‌గా కొనసాగడానికి వీల్లేదని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాను శాసన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానని ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌
17వ తేదీన అసెంబ్లీ సమావేశాలు మొదలవు తాయి. మధ్యాహ్నం జూబ్లీహాల్‌లో ఎమ్మెల్యేలకు విందు ఇస్తారు. అదే రోజు స్పీకర్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ వంటి తతంగం ముగిస్తారు. 18వ తేదీన కొత్త స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. 19వ తేదీన గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 20వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీని వాయిదా వేస్తారు.
దశమి..ఏకాదశి..
కేసీఆర్‌తో పాటు హోంమంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. మంచి రోజు చూసుకొని శాసన సభ సమావేశాలు ప్రారంభిస్తామని సీఎం ఆ సందర్భంగా చెప్పారు. దీనికి అనుగుణం గానే ఆయన తాజాగా తిథులు చూసుకొని తేదీలను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం దశమి రోజున, శాసన సభ సమావేశాలు ఏకాదశి రోజున మొదలయ్యేలా ముహూర్తం ఖరారు చేశారు.
దుబాయ్‌ పర్యటన రద్దు!
ఇన్నాళ్లు కనీసం ప్రస్తావన లేని అసెంబ్లీ సమా వేశాల గురించి ఉన్నట్టుండి నిర్ణయం తీసుకోవడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తోంది. కేసీఆర్‌ ఈ నెల 6వ తేదీన దుబాయ్‌ టూర్‌కు ప్లాన్‌ చేసుకున్నారు. 13వ తేదీ వరకు అంటే, ఎనిమిది రోజుల సుదీర్ఘ పర్యటన సిద్ధమైంది. కానీ అకస్మాత్తుగా ఆ పర్యటనను రద్దు చేసుకొని వెంటనే అసెంబ్లీ సమావేశాల ముహూర్తాన్ని ఖరారు చేశారు.
ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకపోవడం, కనీసం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా నిర్వహించకపోవడం వంటి విమర్శలు అన్ని వర్గాల నుంచి ఎదురైన నేపథ్యంలో కేసీఆర్‌ దుబాయ్‌ పర్యటనకు వెళ్లి మరో వారం రోజుల పాటు ఉండి వస్తే అప్పటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి మొదలవుతుంది. అసెంబ్లీ సమావేశాల నోటిఫి కేషన్‌కు, నిర్వహణకు పెద్దగా సమయం లభించదు. పైగా ఇటీవల రాష్ట్ర పాలన గాలికొదిలి జాతీయ స్థాయి పర్యటనలు చేయడంపైనా కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ పర్యటనలు పెట్టుకుంటే ప్రజలకు వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని కేసీఆర్‌ ఆలోచించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్‌ దుబాయ్‌ పర్యటన వెనుక చాలా రాజకీయ అంశాలున్నాయని కొంతమంది భావిస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణ
మరోవైపు మంత్రివర్గ విస్తరణపైనా పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఉంటుందా? లేదా? అన్నదానిపైన స్పష్టత లేదు. గతంలో ప్రగతి భవన్‌ నుంచి మీడియాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల పద్దెనిమిదో తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్‌ కూడా పంచాయతీ ఎన్నికల లోపే పదవుల పంపకం ఉంటుందని ప్రకటించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ కూడా ఈ సమావేశాల్లోనే పూర్తవుతుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ ఆలోచనకు బలం చేకూరుస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ పరిశీలిస్తే 18వ తేదీన ఒక్కరోజు మాత్రమే సమయం దొరుకుతుంది. ఆ రోజే మంత్రివర్గ విస్తరణకు అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అయితే 16వ తేదీన కూడా ఇందుకు అవకాశాలు లేకపోలేదని మరో వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో 16 లేదా 18 తేదీల్లో కేబినేట్‌ విస్తరణ ఖాయంగా ఉంటుందని చెబుతున్నారు.
ఎందరో ఆశావహులు?
మంత్రివర్గ విస్తరణ రెండు దఫాలుగా ఉంటుందని కేసీఆర్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి దశలో ఎనిమిది మందికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. అదే రోజు పార్లమెంటరీ కార్యదర్శులను కూడా ఎంపిక చేయనున్నారు. వీరిలో కొందరికి తొలి విడతలో, మరికొందరికి మలివిడతలో అవకాశం కల్పించాలని గులాబీ బాస్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మొదటినుంచి అన్ని అంశాల్లోనూ ప్రామా ణికంగా తీసుకుంటోన్న ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం నుంచి మినహా మిగతా అన్ని జిల్లాల నుంచి ప్రాతినిథ్యం ఉండే అవకాశ ముంది. కేటీఆర్‌, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, ఈటెల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర రావు, రెడ్యా నాయక్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, బాల్క సుమన్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, లక్ష్మారెడ్డి, రేఖా నాయక్‌, కొప్పుల ఈశ్వర్‌, ఆరూరి రమేష్‌, వినయ భాస్కర్‌, పట్నం నరేందర్‌ రెడ్డి, తదితర ఆశావహుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
రవంత్‌కు చెక్‌
కాంగ్రెస్‌ నేత, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిపై కొడంగల్‌లో భారీ మెజారిటీతో గెలిచిన పట్నం నరేందర్‌ రెడ్డికి కేబినెట్‌లో స్థానం కల్పించాలని.. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి రేవంత్‌ ప్రాధాన్యత, జనంలో ఆదరణ పూర్తిగా తగ్గించేలా ప్లాన్‌ చేసినట్లు గుసగుసలు వినపడుతున్నాయి.
సభాపతి ఎవరు!?
స్పీకర్‌ పదవికి ఇంతవరకు ఎవరినీ ఖరారు చేయలేదు. సభాపతి స్థానంలో ఎవరిని కూర్చో బెట్టాలన్న విషయం ఇంకా తేల్చుకోలేదని టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్‌ ప్రధానంగా దష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, మాజీ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రెడ్యా నాయక్‌ తదితరుల పేర్లను స్పీకర్‌ పదవికి పరిశీలిస్తున్నారని సమాచారం.
అయితే సీఎంతో సమానంగా ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తోన్న ధర్మపురి శాసన సభ్యుడు కొప్పుల ఈశ్వర్‌కు మొదటి శాసన సభలోనే స్పీకర్‌గా అవకాశం ఇస్తామని కేసీఆర్‌ ఆఫర్‌ చేసినా ఆయన సున్నితంగా తిరస్కరించారన్న ప్రచారం. ఈ నేపథ్యంలో ఈసారి కొప్పులను మళ్లీ సభాపతి పదవికి ప్రతిపాదిస్తారా? లేదంటే కేబినెట్‌లోకి తీసుకుంటారా? అన్న విషయంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోంది.
– సప్తగిరి.జి, 9885086126


 https://www.blogger.com/blogger.g?blogID=5786711020450708235#editor/target=post;postID=5573888794942707835

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి