తెలంగాణలో బీజేపీకి గత వైభవం
భారీగా పెరిగిన ఓట్ల శాతం
తెలంగాణలో
తమకు తిరుగేలేదనుకుంటున్న టీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల తర్వాత
ఆత్మపరిశీలనలో పడింది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదనుకున్న భారతీయ
జనతాపార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అధికార టీఆర్‌ఎస్‌కు వెన్నులో వణుకు
పుట్టించే స్థాయికి ఎగబాకింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏకపక్షంగా
ఏలుతున్న టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని తేల్చి చెప్పేసింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
సంఖ్యాపరంగా చూస్తే మిగతా పార్టీలకంటే
టీఆర్‌ఎస్ ఎక్కువ స్థానాలు గెలిచినా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను,
విపక్షాలు గెలిచిన స్థానాలను బట్టి గులాబీ పార్టీకి ఒకరకంగా చావుతప్పి
కన్నులొట్టబోయిన విధంగానే చెబుతున్నారు విశ్లేషకులు. తెలంగాణలోని మొత్తం 17
లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయ దుందుభి మోగించింది.
కాంగ్రెస్ మూడు స్థానాలు గెలుచుకుంది. విపక్షాలకు ఒక్కసీటు కూడా రాదని
కేసీఆర్ బల్లగుద్దిమరీ చెప్పినా టీఆర్‌ఎస్ 9 స్థానాలకే పరిమితమైంది.
ఎంఐఎం పాతబస్తీలో తన సీటును కాపాడుకుంది. అయితే.. భారతీయ జనతాపార్టీ
గెలుచుకున్న స్థానాలు సామాన్యమైనవి కాదు. టీఆర్‌ఎస్‌కి కంచుకోటలు.
ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాలు టీఆర్‌ఎస్ ఉనికికే
అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటారు. కేసీఆర్ హ్యాట్రిక్ సాధించిన
స్థానం కరీంనగర్ కాగా, ఆయన కూతురు ప్రాతినిథ్యం వహించిన స్థానం
నిజామాబాద్. ఒకరకంగా తెలంగాణ రాష్ట్రసమితి నాయకత్వం రాష్ట్రంలోని మిగతా
స్థానాలకన్నా ఈ రెండు నియోజకవర్గాలపైనే ప్రత్యేకంగా దష్టిపెట్టింది. తమ
అభ్యర్థులను గెలిపించుకునేందుకు చివరిదాకా ప్రయత్నాలు చేశారు. కానీ.. వాళ్ల
వ్యూహాలు అక్కడ బెడసికొట్టాయి.
కరీంనగర్ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్
ఓడిపోయింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అత్యధిక మెజారిటీతో విజయం
సాధించారు. ఇది టీఆర్‌ఎస్ పార్టీతో పాటు కేసీఆర్‌కు, కేటీఆర్‌కు పెద్ద
షాక్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ లోక్‌సభ స్థానం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సెగ్మెంట్. కేసీఆర్‌కు ఎంపీగా
హ్యాట్రిక్ విక్టరీ అందించింది కరీంనగర్. తెలంగాణ ఉద్యమ సమయంలో 2001,
2006, 2008లో మూడు సార్లు కరీంనగర్ స్థానం నుంచే కేసీఆర్ ఎంపీగా విజయం
సాధించారు. 2014లో బోయినపల్లి వినోద్‌కుమార్ ఈ స్థానం నుంచి గెలుపొందారు.
ఈసారి కూడా వినోద్ గెలుస్తాడని అంతా భావించారు. అంతేకాదు..
వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే కేంద్రంలో మంత్రిపదవి కూడా దక్కుతుందని
స్వయంగా కేసీఆర్ ప్రచారం చేశారు. కానీ.. ఓటర్లు మాత్రం వారికి షాకిచ్చారు.
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు భారీ ఆధిక్యం కట్టబెట్టి సంచలన తీర్పు
ఇచ్చారు.
ఇక నిజామాబాద్ నియోజకవర్గం.. కేసీఆర్
కుమార్తె కవిత 2014లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. కేసీఆర్ కుమార్తెగా
పార్టీలో, నియోజక వర్గంలో కవితకు ప్రత్యేక స్థానం ఉంది. తన లోక్‌సభ
పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమెకు పట్టు ఉంది. జగిత్యాలలో
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా ఓడించడం, నిజామాబాద్
జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిపించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారని
చెబుతారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి
ఎన్నికవడం కవితకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఆమె
ఓడిపోవడం షాక్‌కు గురిచేసింది. వాస్తవానికి నిజామాబాద్ నియోజక వర్గంలో
ప్రధానంగా పసుపు రైతులు ఎంపీ కవిత తీరు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరి పట్ల
ఆగ్రహంతో
ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో,
కనీసం కేంద్రాన్ని ఒప్పించడంలో సఫలం కాలేకపోతున్నారన్న ఆలోచనలో ఉన్నారు.
దీంతో ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి రైతులు భారీ సంఖ్యలో పోటీచేశారు. 176 మంది
రైతులతో కలిపి మొత్తం 185 మంది అభ్యర్థులు నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో
పోటీ చేశారు. ఈ పరిణామాలు టీఆర్‌ఎస్ అధినాయ కత్వాన్ని కాస్త కలవరపాటుకు
గురిచేశాయి. దీంతో.. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసినప్పుడు సహచరుడు,
మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లాలో మంచి పట్టున్న మండవ వెంకటేశ్వర్‌రావును
కేసీఆర్ కలిశారు. స్వయంగా ముఖ్యమంత్రి మండవ ఇంటికి వెళ్లి టీఆర్‌ఎస్‌లోకి
ఆహ్వానించారు. సామాజిక సమీకరణాలు కవిత గెలుపుకు దోహదపడతాయన్న వ్యూహంతోనే
కేసీఆర్ అనూహ్యంగా ఈ ప్లాన్ అమలు చేశారు. కానీ.. ఆయన ఆలోచన తప్పింది.
కవిత ఓటమి పాలయ్యింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ భారీ
మెజార్టీతో విజయం సాధించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
ఎమ్మెల్యేలుగా పోటీచేసిన బీజేపీ నేతల కన్నా ఎక్కువ ఓట్లు సాధించి కూడా
కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఓడిపోయారు. రెండో స్థానానికి పరిమిత మయ్యారు.
ఈసారి ఎంపీ ఎన్నికల్లో గెలిచి ముందు వరుసలో నిలిచారు. ఇప్పుడు కూడా
తెలంగాణలో నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల్లో ఎక్కువ
మెజార్టీ వచ్చింది బండి సంజయ్‌కే కావడం విశేషం. టీఆర్‌ఎస్ అభ్యర్థి
బోయినపల్లి వినోద్ కుమార్‌పై సంజయ్ 89 వేల 508 ఓట్ల మెజార్టీతో
గెలుపొందారు. నిజామాబాద్ నుంచి గెలిచిన ధర్మపురి అర్వింద్‌కు 70 వేల 875
ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్‌రెడ్డికి
62 వేల 114 ఓట్ల మెజార్టీ.. ఆదిలాబాద్ నుంచి విజయం సాధించిన సోయం బాపూరావు
58 వేల 560 ఓట్ల మెజార్టీ సాధించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఏడుశాతం
ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి పోలైన 14 లక్షల 50 వేల 456
ఓట్లలో హైదరాబాద్ గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్‌కు 61 వేల 854 ఓట్లు
రాగా.. అంబర్ పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన కిషన్‌రెడ్డికి 60 వేల 542
ఓట్లు వచ్చాయి. కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్‌కి 66 వేల 9
ఓట్లు పోలయ్యాయి. అలా అప్పుడు కూడా బీజేపీలోనే టాప్‌గా నిలిచారు బండి
సంజయ్. కరీంనగర్ జిల్లా బీజేపీకి కొత్త జవసత్వాలు నింపిన నాయకుడిగా ఈయనకి
పేరుంది. కార్యకర్తల్లో భరోసా నింపుతూ, తాను ఉన్నానంటూ ధైర్యం చెబుతూ
పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే
సంజయ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. యూత్, హిందూత్వం,
బీజేపీ వాదం, గతంలో ఓడిపోయారన్న సానుభూతి, వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్.. ఇవే
బండి సంజయ్ ప్లస్ పాయింట్స్‌గా బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఆయన
వ్యక్తిగత ఇమేజ్ కారణంగా… ఎన్నడూ బీజేపీ వైపు చూడని ఇతర పార్టీల ఓటు
బ్యాంక్ ఈసారి కమలం వైపు తిరిగిందని కొంతమంది చెప్పు కుంటున్నారు.
20శాతానికి చేరిన బీజేపీ ఓటు బ్యాంక్
తెలంగాణలో బీజేపీకి ఓట్లు శాతం భారీగా
పెరిగింది. ఒకప్పుడు 4 శాతంగా ఉన్న ఓటింగ్ ఇప్పుడు ఏకంగా 19శాతానికి
ఎగబాకింది. ప్రత్యమ్నాయ శక్తిగా బీజేపీ తెలంగాణలో ఎదుగుతోందన్న సంకేతాలకు
ఇదే నిదర్శనమని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. గత డిసెంబర్‌లో జరిగిన
అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో చూస్తే.. బీజేపీ అభ్యర్థులకు 7శాతం ఓట్లు
పోలయ్యాయి. అప్పుడు ఒకేఒక్క ఎమ్మెల్యే సీటును బీజేపీ గెలుచుకుంది. కానీ..
ఇప్పుడు ఓట్లతో పాటు.. సీట్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో
బీజేపీ అభ్యర్థులకు 19.45శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ
118 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క గోషామహల్‌లోనే గెలిచింది. 105 స్థానాల్లో
డిపాజిట్లు కోల్పోయింది. 14,94,554 ఓట్లు (7%) సాధించింది. లోక్‌సభ
ఎన్నికల్లో ఈ ఓట్లు శాతం ఏకంగా 19.45కి ఎగబాకింది. 17 లోక్‌సభ
నియోజకవర్గాల్లో 33,43,808 ఓట్లు సాధించింది. 4 స్థానాల్లో గెలిచింది.
కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి,
ఆదిలాబాద్, చేవెళ్ల, మెదక్ నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకుంది. ఇక
మజ్లిస్ కంచుకోటగా ఉన్న హైదరాబాద్ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలవగా,
పెద్దపల్లి, భువనగిరి, మెదక్, నల్లగొండ, ఖమ్మం, మల్కాజిగిరి, జహీరాబాద్,
వరంగల్, మహబూబాబాద్, చేవెళ్లలో మూడో స్థానంలో నిలిచింది.
కేటీఆర్ ప్లాఫ్ – హరీష్ సక్సెస్!
లోక్‌సభ ఎన్నికల్లో కేటీఆర్ అట్టర్
ఫ్లాప్ అయ్యారన్న వాదనలు సొంత పార్టీలోనే వినిపిస్తు న్నాయి. పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన లోక్‌సభ
ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులందరినీ గెలిపించుకుంటానని ప్రకటించా రాయన. కానీ..
కేటీఆర్ బాధ్యత తీసుకున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు చిత్తుగా
ఓడిపోయారు. ఆయన స్వంత నియోజకవర్గం సిరిసిల్ల ఉన్న కరీంనగర్ లోక్‌సభ సీటును
సైతం గెలవలేకపోవడం షాక్ ఇచ్చింది. మరోవైపు.. హరీష్‌రావును పార్టీలో
పక్కనబెట్టారు. ప్రాధాన్యం పూర్తిగా తగ్గించారు. కానీ.. తాను ఇంచార్జీగా
ఉన్న మెదక్ ఎంపీ అభ్యర్థిని 3 లక్షల పైచిలుకు మెజారిటీతో ఆయన గెలిపించు
కున్నారు. ఈ పరిణామాలు హరీష్ సక్సెస్.. కేటీఆర్ ఫెయిల్ అని పార్టీలో
చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు తన మామ కేసీఆర్‌కు కుడిభుజంగా ఉంటూ
తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన హరీష్‌రావు పార్టీని బలోపేతం చేయడంలో
కీలక భూమిక పోషించారు. కేసీఆర్ అప్పగించిన అన్ని బాధ్యతలను సమర్థంగా
నిర్వర్తించి పార్టీలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందారు. పార్టీకి
కీలకమైన ఉపఎన్నికలు, నియోజకవర్గాల బాధ్యతలను తీసుకున్న హరీష్ అన్నింటా
సక్సెస్ అయ్యారు. అయితే, గత కొన్ని రోజులుగా.. ముఖ్యంగా టీఆర్‌ఎస్
రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్టీలో హరీష్ ప్రాధాన్యం తగ్గుతూ
వస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు బాధ్యతలు ఇవ్వడం,
హరీష్‌రావుకు మంత్రి పదవి సైతం ఇవ్వకపోవడంతో ఆయన సిద్ధిపేటకే పరిమితం
అయ్యారు. ఇదే సమయంలో కేటీఆర్ ప్రాధాన్యం పార్టీలో బాగా పెరిగింది. అయితే ఈ
ఎన్నికలు మాత్రం ఆయనకు షాక్ ఇచ్చాయి. సారు.. కారు.. పదహారు నినాదంతో
వెళ్లి 16 సీట్లూ టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు కేటీఆర్.
కానీ, ఆయనకు మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. 16 గెలుస్తారనుకుంటే కేవలం 9
స్థానాలకే టీఆర్‌ఎస్ పరిమితం అయ్యింది. ఓ సమయంలో ఆయన సరదాగా హరీష్‌రావుకు
మెదక్‌లో ఎక్కువ మెజారిటీ వస్తుందా? కరీంనగర్‌లో వస్తుందా? చూసుకుందామని
సవాల్ చేశారు. కరీంనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి చిత్తుగా ఓడిపోతే.. మెదక్
టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తంగా కేసీఆర్
కూతురు కవిత, కుమారుడు కేటీఆర్‌కు లోక్‌సభ ఫలితాలు చేదు అనుభవాన్ని
మిగల్చగా హరీష్‌రావు సక్సెస్ రేటును మరింతపెంచాయి.
– సుజాత గోపగోని, 6302164068
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి