ఎన్నో సవాళ్లు!
తెలంగాణ
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ రెండో సారి పాలనా పగ్గాలు చేపట్టింది.
ఉద్యమకాలం నాటి కంటే కూడా ఓటర్లు అత్యధిక మెజారిటీని కట్ట బెట్టారు. ఈ
క్రమంలోనే ప్రజలు ఆ పార్టీ బాధ్యతను మరింత పెంచారు. 2014లో టీఆర్‌ఎస్ తన
మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వాటిలో చాలావరకు హామీలుగానే
మిగిలిపోయినా తెలంగాణ కొత్త రాష్ట్రం అని, తొలి నాలుగేళ్లే కావడంతో హామీలు
పూర్తిగా నెరవేర్చలేకపోయామని అధినాయకులు వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఇవ్వని
హామీలను నెరవేర్చగలిగామని ప్రచారం చేసుకున్నారు. పైగా 60 ఏండ్లు కొట్లాడి
తెచ్చుకున్న తెలంగాణపై అధికారాన్ని ఐదేళ్లలోనే తిరిగి ఢిల్లీకో, అమరావతికో
అప్పగిద్దామా? అని సూటిగా ప్రశ్నించారు.
పెండింగ్ హామీలు
ఈ ఎన్నికల్లో మొత్తం 24 అంశాల
మేనిఫెస్టోను టీఆర్‌ఎస్ విడుదల చేసింది. అయితే 2014లో ఇచ్చిన హామీలే
నెరవేర్చలేదు. ఇక కొత్త మేనిఫెస్టోపై ఎలా ముందుకెళ్తారన్న విమర్శలు అప్పుడే
వినిపిస్తున్నాయి.
తాగు, సాగునీటిపై ప్రధాన దష్టి
2014 మేనిఫెస్టోలో ప్రతి అసెంబ్లీ నియోజక
వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పుకున్నారు. అది కార్యరూపం
దాల్చలేదు. రెండో సారి గెలిచిన తర్వాత కేసీఆర్ ఆ లక్ష్యం నెరవేరుస్తా మని
మరోసారి హామీ ఇచ్చారు. కొత్తగా పది థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు
నిర్మిస్తామని, తద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తా
మన్నారు. అయితే పది విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరగలేదు. కానీ మిగులు
విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చారు. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య
ఆశించినంతగా అమల్లోకి రాలేదు. జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ
ఆస్పత్రులు, మండల స్థాయిలో 30 పడకల ఆస్పత్రుల నిర్మాణాలు హామీలుగానే
మిగిలాయి. పెన్షన్ల మొత్తం పెంచడం ప్రజల్లో సంతృప్తికి కారణమైంది.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై
విపక్షాలు, ప్రజల నుంచి విమర్శల దాడి జరుగుతోంది. ఒకటీ రెండు ప్రాంతాల్లో
కొన్ని ఇళ్లు నిర్మించి, వాటిని మాత్రమే చూపిస్తున్నారు. దీంతో
రాష్ట్రవ్యాప్తంగా ఈ హామీ ఎప్పటికి పూర్తవుతుందో అని లక్షల మంది
ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ బహిరంగ సభల్లో వెయ్యి మంది దాకా యువకులు
తెలంగాణ కోసం అమరు లయ్యారని స్వయంగా ప్రకటించినా అమరులను ఆదుకున్న సంఖ్య
400 దాటలేదు. అమరుల స్మతిచిహ్నం నిర్మాణ ప్రతిపాదన చర్చలోకే రాలేదు.
కార్యరూపం దాల్చనివే ఎక్కువ
ఎస్సీలకు మూడు ఎకరాల ప్రభుత్వ భూమి;
ఎస్టీలకు, మైనార్టీలకు 12శాతం; చట్టసభల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు ఓ
ప్రహసనంగానే మిగిలాయి. రాష్ట్రంలో ప్రత్యేక టెక్స్‌టైల్ జోన్, మహిళా
బ్యాంకులు, మహిళా పోలీస్‌స్టేషన్లు, మహిళా సంక్షేమబోర్డు ఏర్పాటు వంటి
హామీలు ప్రతిపాదన లకు కూడా నోచుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర
ప్రభుత్వ స్కేల్‌తో సమానంగా వేతనాలు, పెన్షన్లు ఇస్తామని, కాంట్రాక్టు
ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీ పక్కనబెడితే సీపీసీ విషయంలోనే
ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికుల జీతాలు
పెంచుతామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక, హామీల గురించి ప్రశ్నిస్తే
ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని హెచ్చ రించడం వివాదమైంది. మరోవైపు
జర్నలిస్టులకు ఇంటిస్థలాలు, ఇళ్లు, అందరికీ అక్రిడిటేషన్, హెల్త్
కార్డులు, జర్నలిస్టు భవన్ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. సింగరేణిలో
డిపెండెంట్ ఉద్యోగాలు కోర్టు జోక్యంతో అమలు చేయలేకపోయామన్నారు. మైనింగ్
యూనివర్సిటీ, కొత్తగా భూగర్భగనుల తవ్వకం కూడా అటకెక్కాయి. కాజిపేట్‌లో
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊగిసలాడుతూనే ఉంది. జిల్లాకేంద్రాల్లో
రింగ్‌రోడ్లు, హైదరాబాద్-జిల్లా కేంద్రాల మధ్య నాలుగులైన్ల రోడ్డు
నిర్మాణం, పుణె తరహాలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ మరిచిపోయారు. తెలంగాణ సినిమా
లకు ప్రోత్సాహం అంటూ, ఆంధ్రా సినిమాలను ప్రోత్స హిస్తూ తెలంగాణ సినిమాలను
చిన్నచూపు చూస్తున్నా రన్న విమర్శలు వినిపించాయి. మరో విమానాశ్రయం ఏర్పాటు
ప్రతిపాదనలోనూ కదలిక లేదు.
మిషన్ కాకతీయ ‘కమీషన్ కాకతీయ’గా
మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇంటింటికీ తాగునీటి నల్లా లక్ష్యంతో మొదలెట్టిన
మిషన్ భగీరథ ఇంకా పూర్తికాలేదు. మిషన్ భగీరథ పూర్తయితే తప్ప తదుపరి
ఎన్నికల్లో ఓట్లు అడగబోనన్న కేసీఆర్ ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లి ఆ
మాటను పక్కన బెట్టారు.
వెంటాడనున్న కొత్త మేనిఫెస్టో
ఇప్పుడు 2018లో హామీలు పరిశీలిస్తే
అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.2,016కు, వికలాంగుల పెన్షన్లను రూ.3,016కు
పెంచుతా మన్నారు. వద్ధాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏళ్లనుంచి 57 ఏళ్లకు
తగ్గిస్తామన్నారు. నిరుద్యోగు లకు నెలకు రూ.3,016 భతి చెల్లిస్తామన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తామని, సొంతస్థలం ఉన్న పేదలకు
ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తామని, రైతుబంధు కింద ఏడాదికి
ఎకరాకు అందిస్తున్న సాయం 8 నుంచి 10 వేలకు పెంచుతామని, లక్ష రూపాయల పంట
రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చట్టసభల్లో బీసీలకు 33%, మహిళలకు 33%
రిజర్వేషన్ అమలుకు పోరాటం కొనసాగిస్తామని 2014 హామీ రిపీట్ చేశారు.
రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర
వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రకులాల్లోని
పేదలకూ ప్రత్యేక పథకాలు అమల్లోకి తెస్తామని, ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్
చేస్తామని పేర్కొన్నారు. ప్రజలందరికీ అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు
నిర్వహిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణ చేస్తామని,
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్స రాలకు పెంచడంతో పాటు
ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని మరో మూడేళ్లు పెంచుతామనీ అన్నారు.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారికి
పట్టాలు, హైదరా బాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మరింత ముమ్మరం
చేస్తామని తాజా మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ చెప్పింది.
ఇప్పుడా ఛాన్స్ లేదు
మొదటి విడత అధికారంలో తెలంగాణ పసిగుడ్డు
అని చెప్పుకున్నారు. నిజంగానే కొత్తరాష్ట్రం సర్దుకోవడానికి,
కుదురుకోవడానికి సమయం పట్టింది. మొదటి ప్రభుత్వంలో పూర్తిస్థాయి అనుభవం
ఉండటంతో పాటు.. హామీలివ్వని వినూత్న పథకాలు కూడా ప్రవేశపెట్టడం, రెండోసారి
ఇచ్చిన హామీల స్థాయి అంతకుమించి ఉండటంతో రెండోసారి ప్రకటనలతో దాటవేసేందుకు,
చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు.
– సప్తగిరి.జి, 9885086126
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి