సారు.. కారు.. బేజారు..
– తెలంగాణలో కమల వికాసం
– గులాబీ కోటలకు బీటలు
తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో అధికార పార్టీ
టీఆర్‌ఎస్‌కు భారతీయ జనతా పార్టీ భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో గులాబీ
పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న సంకేతాలు కనబరిచింది. లోక్‌సభ
ఎన్నికల్లో వెలువడిన ఫలితాలతో ఈ కొత్తశకానికి బీజం పడింది. కాంగ్రెస్
పార్టీ కూడా తనవంతు కోత పెట్టడంతో టీఆర్‌ఎస్‌కు ఊహించని దెబ్బ తగిలింది. 16
ఎంపీ సీట్లు తమకే దక్కుతా యని కేసీఆర్ పెట్టుకున్న ధీమా నిజం కాలేదు.
అత్యధిక స్థానాలను గెలుచుకొని చరిత్ర సష్టించాలన్న టీఆర్‌ఎస్
ప్రయత్నానికి బీజేపీ, కాంగ్రెస్‌లు బ్రేకులు వేశాయి. టీఆర్‌ఎస్ అత్యంత
కీలకంగా భావించే లోక్‌సభ స్థానాల్లో భాజపా పాగా వేసింది. చివరకు అధికార
పార్టీ 9 స్థానాలకే పరిమిత మయ్యింది. ఎంఐఎంకు వచ్చే ఒక్క సీటుకు తోడు..
తాము సాధించే 16 స్థానాలతో ఢిల్లీలో చక్రం తిప్పుతానని కేసీఆర్
బహిరంగంగానే ప్రకటించారు. కానీ.. ప్రజా తీర్పుతో ఆయన ఆశలు అడియాశలయ్యాయి.
గత యేడాది డిసెంబర్ మొదటివారంలో జరిగిన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరుగులేని విజయం సాధించింది.
మొత్తం 119 శాసనసభా స్థానాలకు గానూ ఆ పార్టీకి చెందిన 88 మంది ఎమ్మెల్యేలు
గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా అసెంబ్లీలో ఆ
పార్టీ బలం సెంచరీ దాటింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నాలుగు నెలలే కావడంతో
సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగుతుందని కేసీఆర్ బలంగా
విశ్వసించారు. కానీ.. ఆయన అంచనా తప్పింది. ప్రజాతీర్పులో ఎదురుదాడి
వ్యక్తమయ్యింది. దీంతో ఇన్నాళ్లుగా విజయకేతనం ఎగురవేస్తూ వస్తున్న
టీఆర్‌ఎస్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది.
రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలవబోతున్నా
మంటూ కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ధీమాగా చెప్పారు. కానీ..
ఓట్ల లెక్కింపు మొదలైన తొలి రౌండ్ నుంచే ఆ పార్టీకి ఎదురుగాలి వీచింది.
భారతీయ జనతాపార్టీ అభ్యర్థులు నాలుగు స్థానాల్లో మొదటి నుంచీ ఆధిక్యత
కొనసాగించారు. అటు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా మరో నాలుగు
స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అయితే లెక్కింపు పూర్తయ్యే సమయానికి బీజేపీ
నాలుగు స్థానాలను దక్కించుకోగా, కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో
గెలుపొందింది. ఈ మిశ్రమ ఫలితాలు గమనిస్తే టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో వ్యతిరేకత
మొదలైనట్లుగా స్పష్టమవుతోందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యా నిస్తున్నారు.
అయితే.. మొదటి నుంచీ ఆ పార్టీకి బలంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్
స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చను
లేవనెత్తింది.
కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా!
కరీంనగర్ లోక్‌సభ స్థానం తెలంగాణ రాష్ట్ర
సమితికి కంచుకోట. ఒక్కసారి మినహా కేసీఆర్.. ప్రతిసారీ ఆ స్థానం నుంచే
పోటీచేసి తెలంగాణ నినాదాన్ని పార్లమెంటులో వినిపించారు. తర్వాత పార్టీ
సీనియర్ నేత, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన బోయినపల్లి వినోద్
కుమార్‌కు ఆ స్థానం కేటాయించారు. 2014లో ఇక్కడి నుంచి గెలుపొందిన వినోద్ ఈ
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో 90 వేల ఓట్ల
తేడాతో ఘోర ఓటమి పాలయ్యారు.
ఇందూర్‌లో అర్వింద్ జయకేతనం
ఇక దేశవ్యాప్తంగా అందిరి దృష్టిని
ఆకర్షించిన నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ ఓటమి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు
మింగుడు పడటం లేదు. ఇక్కడ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కేసీఆర్
కుమార్తె కవితపై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజక వర్గంలో
పసుపు-ఎర్రజొన్న రైతుల సమస్యలు పరిష్కరించడంలో సిట్టింగ్ ఎంపీ కవిత
నిర్లక్ష్యం వహించారు. రైతు సమస్యలకు సంబంధించిన పోరాటాల్లో ఎప్పుడూ
ముందుండే అర్వింద్ తనను గెలిపిస్తే కేంద్రంలో పసుపు-ఎర్రజొన్న బోర్డు
ఏర్పాటు చేసేందుకు వందశాతం సహకరిస్తానని హామి ఇచ్చారు. అంతేకాకుండా ఈయన
గతంలో చెరకు రైతుల సమస్యల పరిష్కారం కోసం 150 కిలోమీటర్లు పాదయాత్ర కూడా
చేశారు. దీంతో మార్పు కోరుకుంటున్న ఇందూరు ఓటర్లు అర్వింద్ నాయకత్వానికే
పట్టం కట్టారు.
కారు స్పీడుకు బ్రేకులు
రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ
స్థానాల్లో టీఆర్‌ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం ఒక్క స్థానంలో
గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 11 స్థానాలు రాగా.. ఈ
ఎన్నికల్లో రెండు స్థానాలు తగ్గాయి. శాసనసభకు జరిగిన ఎన్నికల పోరులో
దెబ్బతిన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ స్థానాల్ని కైవసం
చేసుకొని ఊపిరి పీల్చుకుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీజేపీ
అనూహ్యంగా పుంజుకొని తెరాస కంచు కోటల్ని బద్దలుకొట్టింది. కరీంనగర్,
ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లలో కమలం వికసించింది. మెదక్,
నాగర్‌ర్నూలు, మహబూబ్ నగర్, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, ఖమ్మం,
పెద్దపల్లి, చేవెళ్ల నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేయగా..
మల్కాజ్‌గిరి, భువనగిరి, నల్గొండలో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది.
హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అన్ని
స్థానాల్లోనూ పోటీ చేసింది. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎంఐఎంతో
స్నేహపూర్వక పోటీ కాగా, మిగిలిన 16 స్థానాలను దక్కించుకోవడానికి
‘కారు..సారు..16’ నినాదంతో ముమ్మర ప్రచారం చేసింది. కానీ.. ఫలితాల్లో
దాదాపు సగానికే పరిమితమయ్యింది. ఆ పార్టీకి కంచుకోట లాంటి కరీంనగర్‌లో
సిట్టింగ్ ఎంపీ బి. వినోద్ కుమార్, నిజామాబాద్‌లో ప్రస్తుత ఎంపీ,
కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే భువనగిరి సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్,
ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్‌లు పరాజయం పాలయ్యారు. భాజపా చేతుల్లో ఓటమి
పాలు కావడం, కాంగ్రెస్‌లో ముఖ్య నాయకులు మూడు లోక్‌సభ స్థానాలు గెలవడం
తెరాస వర్గాలను విస్మయానికి గురిచేశాయి.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
మొత్తానికి ఆసక్తిని రేకెత్తించాయి. అనూహ్య రీతిలో వచ్చిన మిశ్రమ ఫలితాలు ఓ
వైపు విశ్లేషకులను కూడా విస్తుపోయేలా చేస్తే… మరికొన్ని అంశాలు
ప్రత్యేకంగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చను
లేవనెత్తాయి. ప్రధానంగా గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన విపక్షాలకు చెందిన ఐదుగురు నేతలు ఇప్పుడు
ఎంపీలుగా విజయం సాధించారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ పరిణామం సవాల్‌గా
మారింది. పైగా.. మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మట్టికరిపించడం
రాజకీయంగా కలకలం రేపింది. మరో స్థానంలోనూ పోటీలో సిట్టింగ్ ఎంపీకి బదులు
ఆయన బంధువును నిలబెట్టగా ఆ అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యారు.
ఫైర్‌బ్రాండ్
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో
సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్
కుమార్ భారీ మెజారిటీతో గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే
అసెంబ్లీ స్థానం నుంచి సంజయ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై స్వల్ప
ఓట్ల తేడాతో ఓడిపోగా.. ఈ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. ప్రజా
సమస్య లపై చురుగ్గా స్పందించడం.. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో
ఉండటం.. ఎటువంటి పరిస్థితులెదురైనా ఆత్మవిశాస్వసం కోల్పోకుండా ముందుకు
సాగడమే సంజయ్ గెలుపుకు కారణమని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
పార్లమెంట్‌కి తొలిసారిగా!
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి
విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి, ఇటీవల జరిగిన అసెంబ్లీ
ఎన్నికల్లో అంబర్‌పేట్ నియోజక వర్గం నుంచి పోటీచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి
చేతిలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సికింద్రాబాద్
నుంచి.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్
యాదవ్‌పై 51 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొం దారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా
గెలుపొందిన కిషన్‌రెడ్డి ఈసారి పార్లమెంట్‌లో అడుగుపెట్ట బోతున్నారు.
మరోవైపు.. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం
నుంచి గెలుపొందిన సోయం బాపూరావు టీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ
గోడెం నగేష్‌పై 50వేల పైచిలుకు మెజార్టీ సాధించారు. ఈయన గత అసెంబ్లీ
ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి
ఓటమి పాలయ్యారు.
అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్
నియోజక వర్గం నుంచి ఓటమి పాలైన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
రేవంత్‌రెడ్డి.. ఈ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి
టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై 6వేల ఓట్ల మెజారిటీతో
గెలుపొందారు.
శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్
పార్టీ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ఎన్నికల్లో భువనగిరి
లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ బూర
నర్సయ్యగౌడ్‌ను ఓడించారు.
ఈ ఎన్నికల్లో గెలుపొందిన విపక్షాల
అభ్యర్థులు అధికార తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన సిట్టింగ్ ఎంపీలను, ఆ
పార్టీ అభ్యర్థులను ఓడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం
సాధించిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్‌లను
కోల్పోవడం, కేవలం 10 స్థానాలతోనే సరిపెట్టుకోవడం.. పైగా.. అసెంబ్లీ
ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ల చేతుల్లోనే ఇప్పుడు తమపార్టీ ఎంపీ
అభ్యర్థులు ఓడిపోవడంపై గులాబీ పార్టీ సమీక్షించుకుంటోంది.
– సుజాత గోపగోని, 6302164068
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి