26, జూన్ 2019, బుధవారం

అధ్యక్షా.. ఇదేం న్యాయం ?

అధ్యక్షా..! ఇదేం న్యాయం…!?

అధ్యక్షా..! ఇదేం న్యాయం…!?
అసెంబ్లీ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు తమకు రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారాలను, బాధ్యతలను స్వేచ్ఛగా వినియోగించుకోలేక పోతున్నారా? ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న అధికార పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? రబ్బర్‌ స్టాంపుల్లా స్పీకర్లు, మండలి చైర్మన్లు మారిపోయారా? అనే ప్రశ్నలు కొన్ని సంవత్సరాలుగా ప్రజాస్వామిక వాదులను, రాజకీయ నాయకులను వేధిస్తున్నాయి. ఇవే నిజమన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీలను బట్టి స్పీకర్లు, మండలి చైర్మన్ల నిర్ణయాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పారదర్శకంగా కాకుండా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత దోహదం చేశాయి. పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచి పదవీకాలం మధ్యలోనే మరో పార్టీలోకి ఫిరాయించే వారిపై ఫిర్యాదు అందిన 3 నెలల్లోగా అనర్హత వేటు వేయాలి. చట్టసభలకు చైర్మన్‌గా, స్పీకర్‌గా వ్యవహరించే వారు ఫిరాయింపుల వ్యవహారంపై అందే ఫిర్యాదులను 3 నెలలకు మించి పెండింగ్‌లో ఉంచకూడదని చట్టమే చెబుతోంది.’ అని వెంకయ్య గుర్తుచేశారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు అందిన వెంటనే అనర్హత వేటు వేయడం ద్వారా తాను ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టానని ఉపరాష్ట్రపతి చెప్పడం.. ఏవో కొన్ని రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉందన్న వాదనలకు బలం చేకూరినట్లయ్యింది. అయితే అదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫిరాయింపుల విషయమై నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ఉపరాష్ట్రపతి దష్టికి తీసుకువచ్చారు. రాజ్యసభ చైర్మన్‌ హోదాలో చట్టంలో పేర్కొన్న మేరకు తాను నిబంధనల ప్రకారం నడుచుకున్నానని, లోక్‌సభ స్పీకర్‌, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు వారి విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇంతకుమించి దీనిపై తానేమీ మాట్లాడనని చెప్పారు. ఈ వ్యాఖ్యానం కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టింది.
మండలి చరిత్రలోనే తొలిసారి అనర్హత వేటు
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందగానే ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు పడింది. టీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన రాములు నాయక్‌, భూపతి రెడ్డి, యాదవరెడ్డి, కొండా మురళిలు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎన్నికల అనంతరం ఈ నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి జనార్దన్‌లు మండలి చైర్మన్‌కు పిటిషన్‌ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ సభ్యులై ఉండి కాంగ్రెస్‌ తరపున ఎన్నికల్లో ప్రచారం చేసినందున పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌లో కోరారు. ఆ పిటిషన్లను స్వీకరించిన చైర్మన్‌ స్వామిగౌడ్‌ వివరణ కోరుతూ వెంటనే నలుగురు ఎమ్మెల్సీలకూ నోటీసులు జారీ చేశారు. వరంగల్‌ స్థానిక సంస్థల కోటా కింద ఎన్నికైన కొండా మురళి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని వెంటనే స్వామిగౌడ్‌ ఆమోదించారు.
యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములు నాయక్‌లు తమ అడ్వకేట్ల ద్వారా నోటీసులపై వివరణ, వాదనలు వినిపించారు. తాను గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయినందున జారీ అయిన నోటీసులు చెల్లవంటూ రాములు నాయక్‌ తన వాదన వినిపించగా, కాంగ్రెస్‌ శాసనసభా పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం అయినట్లుగా ప్రకటించిన నేపథ్యంలో ఫిరాయింపు ప్రశ్నే ఉత్పన్నం కాదంటూ యాదవరెడ్డి, భూపతిరెడ్డిలు వాదనలు వినిపించారు. అయితే ఎమ్మెల్సీల వివరణ, వాదనలు విన్న మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ రాజ్యాంగం పదో షెడ్యూల్‌లోని రెండో పేరాను, తెలంగాణ శాసన మండలి ఆరవ నిబంధనను అనుసరించి వీరిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని తెలియజేస్తూ శాసన మండలి కార్యాలయం వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2006లో శాసనమండలి పునరుద్ధరణ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయడం చోటు చేసుకోలేదు. తొలిసారిగా ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది.
నలుగురు ఎమ్మెల్సీలపై టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేయడంతో వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్‌ తమ పార్టీ నుంచి ఎన్నికై టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలు ఎంఎస్‌ ప్రభాకర్‌, కూసుకుంట్ల దామోదర్‌రెడ్డిల పైనా అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. నాలుగు రోజులు గడవకముందే పార్టీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, కూసుకుంట్ల దామోదర్‌ రెడ్డి, ఎంఎస్‌ ప్రభాకర్‌, సంతోష్‌ కుమార్‌లు మండలిలో కాంగ్రెస్‌ శాసన సభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లుగా చైర్మన్‌కు లేఖ ఇచ్చారు. దాన్ని పరిశీలించిన ఆయన విలీనాన్ని గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విపక్షాల విమర్శలు
వాస్తవానికి మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ తనకు వచ్చిన ఫిర్యాదులు, విన్నపాలను తక్కువకాలంలోనే పరిష్కరించారు. మండలి చైర్మన్‌ పదవీ బాధ్యతను నెరవేర్చారు. అయితే అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలు కావడంతో వెంట వెంటనే నిర్ణయాలు జరిగిపోయాయన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే, శాసనమండలిలో గతంలో పలు పార్టీల నేతలు ఫిరాయింపులపై కోకొల్లలుగా ఫిర్యాదులు చేశారు. కానీ వాటిని అప్పట్లో అంతగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఏకంగా ఈ వ్యవహారం హైకోర్టుకే వెళ్లిందంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థమవు తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కోర్టులు ఆదేశించినా…?
2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ సమయంలోనే తెలుగుదేశం, కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి జంప్‌ చేశారు. కానీ తమ పదవులకు రాజీనామాలు చేయలేదు. దీనిపై ఆయా పార్టీల బాధ్యులు.. ఇటు అసెంబ్లీ స్పీకర్‌, అటు శాసనమండలి చైర్మన్లకు పలుసార్లు ఫిర్యాదులు చేశారు. కానీ ఆ ఫిర్యాదులు పెండింగ్‌లోనే పడిపోయాయి. స్పీకర్‌, మండలి చైర్మన్‌ల వ్యవహారశైలిపై విసుగు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీ నేతలు 2015లోనే సాక్షాత్తూ హైకోర్టు తలుపు తట్టారు. ఒక పార్టీనుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి ఫిరాయించడమే కాకుండా పార్టీ విప్‌లను ఉల్లంఘించారని, వీరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి విచారణా చేపట్టకుండా పెండింగ్‌లో ఉంచారని, వాటిపై సత్వర విచారణ చేసి తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించాలని ఆయా పిటిషనర్ల తరఫు న్యాయ వాదులు కోరారు. ఇటువంటి సందర్భాల్లో గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను వారు ఉటంకించారు. దీంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హతపై స్పీకర్‌ వద్ద, మండలి చైర్మన్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించడానికి ఇంకెంత కాలం పడుతుందో తెలుసుకుని కోర్టుకు తెలపాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తెలంగాణ ఏజీని కూడా ఆదేశించింది.

కాంగ్రెస్‌ శాసన మండలి పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని చైర్మన్‌ స్వామిగౌడ్‌కి ఎమ్మెల్సీలు ఆకుల లలిత, దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌, సంతోష్‌ కుమార్‌ వినతిపత్రం అందచేసినప్పటి చిత్రం (ఫైల్‌ ఫోటో)
మరోవైపు.. తాజాగా కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ మండలి చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నట్లే.. 2016లోనూ తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదులను పరిష్కరించ కుండా విలీన నిర్ణయం ప్రకటించడం చట్టసమ్మతం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. పార్టీలే విలీన మవుతాయని, పార్టీ, శాసనసభాపక్షం వేర్వేరు కాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిందని గుర్తు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులను తేల్చాలని హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలు కూడా జారీ చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం ఫిరాయింపు ఫిర్యాదులను పరిష్కరించేందుకు క్వాజీ జ్యుడీషియల్‌ అధికారాలతో స్పీకర్‌కు ట్రైబ్యునల్‌ చైర్మన్‌ హోదా ఇచ్చారని, ఆ అధికారాలతో అనర్హతపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని స్పష్టం చేశారు. బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం హౌస్‌ను నిర్వహించడం, నియంత్రించడం వంటివి స్పీకర్‌ అధీనంలో ఉంటాయని, ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవని స్పష్టం చేశారు. అనర్హతపై ఇచ్చిన ఫిర్యాదులు ట్రైబ్యునల్‌ చైర్మన్‌ హోదాలో ఉన్న స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉండగా వాటిపై న్యాయసమీక్ష చేయడానికి వీల్లేదని తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ ఆ సమయంలో వాదించారు. అయితే, ఆ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అటు.. సుప్రీంకోర్టు కూడా 2016లో పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హత విషయంలో స్పీకర్‌ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్లను అధికార పార్టీలో చేర్చుకోవడమే కాదు.. కొందరికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం అలజడికి కారణమవుతోంది. అసెంబ్లీ స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్లింది. అయినా నిర్ణయం తీసుకోవడంలో మాత్రం తాత్సారం తప్పడం లేదు. అంతేకాదు.. పార్టీ ఫిరాయించిన వాళ్లకు మంత్రి పదవులు కూడా ఇవ్వడం ఏంటంటూ రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అంతటితోనూ ఆగలేదు.. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌.. తన ప్రతినిధి బందంతో ఏకంగా రాష్ట్రపతినే కలిసి ఫిరాయింపుల పిటిషన్లు స్పీకర్‌ పరిగణలోకి తీసుకొని.. అనర్హత వేటు వేసే నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తేవాలంటూ విజ్ఞప్తి చేశారు. అయినా ఆ ప్రయత్నం కూడా వథా అయ్యింది.
గత అనుభవాలు, జరుగుతున్న పరిణామాలతో ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోంది. తమకున్న విచక్షణాధికారాలను అసెంబ్లీ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు.. తమకు ఆ పదవులు కట్టబెట్టిన రాజకీయ పార్టీల ప్రయోజనాల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యల తర్వాత బలపడుతోంది. ఫిరాయింపుల ఫిర్యాదులను కనీసం పరిశీలించకుండానే.. ఐదేళ్ల పాలనా కాలాన్ని కూడా గట్టెక్కించవచ్చన్న పరిస్థితులు కళ్లముందే గోచరిస్తున్నాయి. పార్టీలు ఫిరాయించిన వాళ్లకు ఏకంగా మంత్రిపదవులు ఇవ్వడం, వాళ్ల కాలపరిమితి ముగిసేదాకా అనర్హత ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోకపోవడం, కనీసం విచారణ కూడా చేపట్టకపోవడం విపక్షాలకు ఓ అస్త్రంగా మారింది. ఇప్పటికైనా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయాలతో స్పీకర్లు, మండలి చైర్మన్లు ఫిరాయింపుల ఫైల్స్‌ దుమ్ము దులుపుతారో లేదో చూడాలి!
– సప్తగిరి.జి, 9885086126

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి