26, జూన్ 2019, బుధవారం

వీడని ఉత్కంఠ..

వీడని ఉత్కంఠ..

వీడని ఉత్కంఠ..
  • ఎ మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా..!
మరోసారి మీడియా అంచనా గురి తప్పింది.. అంచనా అనేకన్నా.. తెలంగాణ మంత్రివర్గంపై కేసీఆర్‌ మార్క్‌ లీకేజీ సక్సెస్‌ అయ్యింది. మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న వాళ్లకు మరోసారి శృంగ భంగమైంది. తిథులు, ముహూర్తాల పేరిట కేసీఆర్‌ కార్యాచరణ ఇంకోసారి ముందుకు జరిగింది. ఫలితంగా ఈనెల 10వ తేదీ వసంతపంచమి నాడు కూడా కేబినెట్‌ విస్తరణ ఓ పుకారుగా గడిచి పోయింది.
రికార్డు బద్దలుకొట్టారు!
వాస్తవానికి తెలంగాణలో రెండోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలు దాటింది. ప్రభుత్వ సారథిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆయనకు తోడుగా ఒకే ఒక్క మంత్రి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహమూద్‌ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరో 16 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నా.. కేసీఆర్‌ మాత్రం ఆశావహులను తీవ్ర ఉత్కంఠలో పడేస్తున్నారు. మంత్రివర్గం ఇప్పట్లో ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? ఎవరెవరికి కేబినెట్‌లో బెర్త్‌ కేటాయించే అవకాశం ఉంది? వంటి అంశాలపైనా కనీసం స్పష్టత లేదు. చూచాయగా కూడా పార్టీలోని ఇతర ప్రముఖుల తోనో, ప్రభుత్వంలోని ముఖ్యులతోనో కూడా కేసీఆర్‌ ఈ అంశాలను చర్చించడం లేదని సన్నిహితులే చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గం లేకుండా రెండు నెలలు దాటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎంగా కేసీఆర్‌ ఉమ్మడి రాష్ట్ర చరిత్రను కూడా బద్దలు కొట్టారు. గతంలో ఎన్టీ రామారావుకు 31 రోజుల పాటు కేబినెట్‌ లేకుండా ప్రభుత్వాన్ని నడిపించిన చరిత్ర ఉంది. ఇప్పుడు కేసీఆర్‌ ఆ రికార్డును కూడా దాటేశారు.
ఉత్తుత్తి ప్రచారమే..
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగు తోంది. ఇప్పటికి పలుమార్లు మంత్రివర్గ విస్తరణ అంటూ ప్రచారం జరిగినా అలాంటి దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు తాజాగా ఈ నెల 10వ తేదీన ఆదివారం పంచమి.. మంచి మూహూర్తం కావడంతో ఆనాడు మంత్రివర్గ కూర్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. ఒకటీ, రెండూ కాదు.. తెలంగాణలోని ప్రధాన మీడియా అంతా ఈ ముహూర్తంపై కథనాలు వండి పారేశాయి. కేసీఆర్‌ నమ్మే తిథులు, ముహూర్తాలు కలిసివచ్చాయని లెక్కలు కూడా వేశారు నిపుణులు. కానీ అదంతా ‘తూచ్‌’ అని మరోసారి తేలిపోయింది.
ఎంపిక దశలోనే..!?
మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నకొద్దీ అభ్యర్థుల ఎంపికపై టీఆర్‌ఎస్‌ అధినేత సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారన్న వాదనలు మొదట్లో వినిపించాయి. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలకు ఉన్న పట్టు, పార్టీ అధిష్టానం పట్ల అతనికున్న విధేయత, మంత్రిగా తన శాఖను సమర్థంగా నిర్వహించే అంశం వంటివి కేసీఆర్‌ బేరీజు వేస్తున్నారని కూడా ప్రచారం సాగింది. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి.. పాత, కొత్త కలయికతో అందరికీ తగిన ప్రాధాన్యం కల్పించడం కోసమే కేసీఆర్‌ క్యాబినెట్‌ విస్తరణ ఆలస్యం చేస్తున్నారన్న వాదన వినిపించింది. ముఖ్య మంతి, హోంమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత సుమారు నెలరోజులదాకా పార్టీ శ్రేణుల్లో ఇదేతరహా చర్చ జరిగింది. కానీ.. కాలం గడుస్తున్న కొద్దీ విస్తరణ మరింత ఆలస్యం అవుతుండటం ఆశావాహులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
సహజంగానే కేసీఆర్‌ వ్యవహార తీరు.. ఆయన వ్యూహాలు ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈనెల 10వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. అందులో ఆరు నుంచి ఎనిమిది మందికి స్థానం కల్పిస్తారని మీడియా, సోషల్‌ మీడియా కోడై కూసినా.. చివరికి అంతా ఉత్తుత్తి ప్రచారంగా తేలిపోయింది. కానీ.. కేసీఆర్‌ నుంచి ఏ క్షణం పిలుపు వచ్చినా అందు బాటులో ఉండేందుకు సీనియర్లు, మంత్రివర్గంలో బెర్త్‌ ఆశించిన వాళ్లంతా కొద్దిరోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. సెల్‌ మోగితే చాలు కేసీఆర్‌ పిలుపే అనుకొని సంతోషంతో ఉలికిపాటుకు గురవుతున్నారు!
ప్రతిపక్షాల ఘాటు విమర్శలు
ఒకే ఒక మంత్రితో పాలన సాగిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌ తీరుపై ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. విస్తరణ ఇంకా ఆలస్యం అయితే ప్రతిపక్షాలు ఈ విమర్శలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. ఓ దశలో ఎర్రవల్లిలో చండీయాగం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగింది. యాగం ముగిసింది మాకు ఇక ఆమాత్య యోగమేనని చాలా మంది ఆశావహులు సంతోష పడ్డారు. అందుకోసం ముహూర్తాలు, తేదీలు, తిథులపైనా చర్చసాగింది. కేసీఆర్‌ అదష్ట సంఖ్య ఆరు కావటంతో ఆ తేదీనే క్యాబినెట్‌ విస్తరణ చేస్తారని ప్రచారం చేసుకున్నారు. ఫిబ్రవరి నెల ఆదివారం.. పదోతేదీన పంచమి తిథి.. మాఘ మాసం.. మంచి రోజని, ఆ రోజున కూడా కేబినెట్‌ విస్తరణ ఉండొచ్చని అంతా భావించారు.
తొలివిడత అసెంబ్లీ సమావేశాలు జనవరి 20వ తేదీన ముగిశాయి. ఆ మరుసటి రోజు నుంచి సీఎం తన వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ యాగానికి పార్టీ ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించారు. కొందరు మాత్రం యాగానికి ఒక రోజు వెళ్లి వస్తే, పదవుల రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్న చాలా మంది యాగంతోనైనా తమకు కేసీఆర్‌ను కలిసే యోగం దక్కుతుందన్న ఆశతో.. ఐదు రోజులూ యాగానికి వెళ్లొచ్చారు. కేసీఆర్‌ దష్టిలో పడడానికి పలువురు పోటీ పడ్డారు. తాము నమస్కారం చేస్తే ఆయన ప్రతి నమస్కారం చేశారని, తమతో చేయి కలిపారని వారిలో పలువురు సంబరపడ్డారు. ఇందులో పలువురు తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లోనే చర్చ జరిగింది. సీఎం పిలిస్తే తప్ప ప్రగతి భవన్‌కు వెళ్లే అవకాశం లేని చాలా మందికి యాగం.. ఆయన్ను కలిసే యోగాన్ని తెచ్చిపెట్టిందని చెప్పుకొన్నారు.
కేటీఆర్‌తో పైరవీలు !
మరోవైపు.. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం రాని వాళ్లు, కలిసినా తమ మనోగతాన్ని వెల్లడించే వీలు చిక్కని ఆశావహ నేతలు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వద్దకు క్యూ కట్టారు. వారంతా బేగంపేటలోని కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంతో పాటు తెలంగాణ భవన్‌లో ఆయన్ను కలిశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకమైన తర్వాత కేటీఆర్‌ మధ్యలో ఒకటి, రెండు సందర్భాల్లో మినహా నిత్యం తెలంగాణ భవన్‌కు వచ్చారు. అయితే ఆశావహుల తాకిడి రోజురోజుకూ పెరుగు తుండడంతో ఆయన కొంత కాలంగా పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. చివరగా జనవరి 26వ తేదీన తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్‌ అప్పటి నుంచి భవన్‌కు దూరంగా ఉంటున్నారు. కేబినెట్‌ విస్తరణ, ఎమ్మెల్సీ పదవుల పంపిణీ పూర్తయ్యే వరకు ఆయన రాకపోవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పదవులు ఆశించే నేతలు గడిచిన కొన్ని రోజులుగా ఏదో ఒక సాకుతో ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను పలకరించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
సమయం ముంచుకొస్తున్న వేళ!
మరోవైపు ఈనెల 25వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇప్పటిదాకా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కొలువు దీరకపోవడం బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సిన ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా ఖాళీగానే ఉండటంతో సభలో బడ్జెట్‌ ఎవరు ప్రవేశ పెడతారన్న మీమాంస అందరిలోనూ నెలకొంది. బడ్జెట్‌ సమావేశాలలోగా కొత్త కేబినెట్‌ నియామకం పూర్తవుతుందని ఆశావహులు మరో ముహూర్తం కేసి ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ.. మరో తరహా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్క హోంశాఖ మినహా అన్ని మంత్రిత్వ శాఖలు తన వద్దే ఉన్నందున ఈసారి బడ్జెట్‌ను సీఎం కేసీఆరే ప్రవేశపెడతారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
సాధ్యమేనా?
ఆర్థికశాఖ సహా మిగతా శాఖలన్నీ కేసీఆర్‌ వద్దే ఉన్నందున విస్తరణ తర్వాత ఆ శాఖను ఎవరికైనా ఇస్తే వాళ్లు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. లేకపోతే ఈసారి ముఖ్యమంత్రే బడ్జెట్‌ను ప్రవేశపెడతారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడితే, శాసన మండలిలో మహమూద్‌ అలీ ప్రవేశపెడతారు.
ముఖ్యమంత్రులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆనవాయితీ గతంలోనూ ఉంది. సీఎంగా ఉంటూనే ఆర్థికశాఖ మంత్రిగా కె.రోశయ్య బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించవచ్చని భావిస్తున్నారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మార్చి ఒకటో తేదీలోపు ఈ బిల్లు చట్ట రూపం పొంది తీరాలి. దాంతో, ఆ లోపే బడ్జెట్‌ సమావేశాలు ఉంటాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, బడ్జెట్‌ పుస్తకాలను ఇప్పటి వరకు ముద్రించలేదు. ఈ విషయంపై ఆర్థికశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. బడ్జెట్‌కు 15-20 రోజుల ముందుగానే పుస్తకాల ముద్రణకు అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ.. ఇప్పటివరకు ఆ ఉత్తర్వులు వెలువడలేదు.
– సప్తగిరి.జి, 9885086126

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి