కొలువుదీరిన తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణలో
ఎట్టకేలకు నూతన అసెంబ్లీ కొలువుదీరింది. ముందస్తు ఎన్నికల ఫలితాలు
వెలువడిన 40 రోజుల తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రొటెంస్పీకర్‌గా నియమితుడైన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఈ నెల 17వ తేదీన
సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిగా
ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళా ఎమ్మేల్యేలు, తర్వాత మిగతా వారు
ప్రమాణం చేశారు. అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో
114 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం రోజున అసెంబ్లీకి హాజరు
కాని వారిలో రాజాసింగ్, అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం
కృష్ణారావు, సండ్ర వెంకటవీరయ్య.. ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒకే
ఒక అభ్యర్థి రాజాసింగ్ మొదట ప్రకటించినట్లుగానే.. ఎంఐఎం పార్టీకి చెందిన
ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి హాజరు కాలేదు.
స్పీకర్‌గా పోచారం ఏకగ్రీవం
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ రెండో
స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా
ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకారం తొలిరోజు సభ్యుల ప్రమాణ
స్వీకారం తర్వాత స్పీకర్‌గా పోచారం నామినేషన్ దాఖలు చేశారు. మొదటినుంచి
ఊహించినట్లే విపక్షాలు స్పీకర్ అభ్యర్థిని పోటీలో నిలబెట్టలేదు. అసెంబ్లీ
మొత్తం బలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 19మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా
గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ
నుంచి రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు
గెలుపొందారు. వీరిని మినహాయిస్తే ఎంఐఎం పార్టీతో కలిపి మిగతా బలం మొత్తం
టీఆర్‌ఎస్ వైపే ఉంది. దీంతో ఏ పార్టీ కూడా స్పీకర్ అభ్యర్థిని నిలబెట్టే
ప్రయత్నం చేయలేదు. చేసినా ఎలాగూ గెలిచే అవకాశం ఉండదు. అంతేకాకుండా అసెంబ్లీ
సమావేశాల ముందురోజు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విపక్షాల ముఖ్యనేతలకు
ఫోన్ చేసి స్పీకర్ పదవి ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి
చేశారు. ముఖ్యమంత్రి ఫోన్ చేసిన సమయంలో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల
నాయకులు ఆయన ప్రతిపాదనకు ఓకే చెప్పారు. టీపీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్
కుమార్ రెడ్డి మాత్రం సీఎల్‌పీ సమా వేశంలో మిగతా నేతల అభిప్రాయం తెలుసు కొని
నిర్ణయం తీసు కుంటామని బదు లిచ్చారు. అప్పుడలా చెప్పినా వాస్తవ పరిస్థితి
అనుకూలంగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించ లేదు.
దీంతో సమావేశాలు మొదలైన రెండో రోజు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్‌గా
ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించిన ప్రొటెం స్పీకర్ సభ అత్యున్నత
స్థానంలో ఆయనను కూర్చోబెట్టారు.
అయితే స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారన్న
అంశంపై నామినేషన్ దాఖలు చేసేదాకా టీఆర్‌ఎస్ గోప్యంగా ఉంచింది. కనీసం
నామినేషన్ వేయడానికి ముందు కూడా ప్రకటించలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి
తరఫున నామినేషన్ దాఖలు కావడంతో స్పీకర్‌గా సీఎం కేసీఆర్ ఆయనను ఎంపిక
చేసినట్లు అందరికీ క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు సభకు
వెళ్లేముందుగానే పోచారం అభ్యర్థిత్వం ఖారారైనట్లే అని అందరూ ఒక అంచనాకు
వచ్చారు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్లేముందు గన్‌పార్క్ దగ్గర అమరవీరుల
స్థూపానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ వెంట పోచారం కూడా
ఉన్నారు. ప్రగతిభవన్ నుంచే కేసీఆర్‌తో కలిసి ఆయన గన్‌పార్క్ వద్దకు
వచ్చారు. దీంతో స్పీకర్ ఆయనే అన్న ఆలోచన బలపడింది. నామినేషన్ దాఖలు చేసే
సమయానికి పూర్తి స్పష్టత వచ్చింది.
ఒంటరి పోరు!
భారతీయ
జనతా పార్టీ తరఫున గోషా మహల్ స్థానం నుంచి గెలుపొందిన ఒకే ఒక ఎమ్మెల్యే
రాజాసింగ్. రాష్ట్రమంతా వీచిన సెంటిమెంట్ గాలిలో బీజేపీ ఉన్న ఐదు
స్థానాలను కూడా కాపాడుకోలేక పోగా గోషామహల్ నుంచి రాజాసింగ్ గెలవడమే ఒక
సంచలనం అయ్యింది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం విషయంలో ఆయన చేసిన బహిరంగ
ప్రకటన మరింత సంచలనం సృష్టించింది.
గులాబీ
బాస్ తమ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ అభ్యర్థి ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు
ప్రొటెం స్పీకర్‌గా అవకాశం కల్పించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన
ముంతాజ్ ఖాన్ సీనియర్ నాయకులని, అలాగే మొదటినుంచి మిత్రులుగా వ్యవహరి
స్తున్నందున ఎంఐఎం పార్టీని కూడా సంతృప్తి పరిచాలని కేసీఆర్ భావించారు.
అయితే ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేతను నియమించ డాన్ని రాజాసింగ్ తీవ్రంగా
తప్పుపట్టారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్
చేశారు. ఎంఐఎం నేత ప్రొటెం స్పీకర్‌గా ఉన్నంత కాలం తాను అసెంబ్లీలో అడుగు
పెట్టబోనని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రమాణ స్వీకారం కూడా చేయబోనని
తేల్చిచెప్పారు. అదే మాటమీద నిలబడ్డ రాజాసింగ్ తన పంతం నెగ్గించుకున్నారు.
ప్రొటెం స్పీకర్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన రోజు అందుబాటు లోనే
ఉన్నా అసెంబ్లీకి హాజరు కాలేదు. మరుసటి రోజు పోచారం శ్రీనివాసరెడ్డి
స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఛాంబర్‌లోనే హిందీలో దైవసాక్షిగా
ప్రమాణం చేశారు. ఆ రోజు మీడియా పాయింట్ వద్ద రాజాసింగ్ మాట్లాడుతూ ధర్మం
పట్ల, దేశం పట్ల నమ్మకం లేని ఎంఐఎం నేత ప్రొటెం స్పీకర్‌గా ఉన్నందునే తాను
మొదటినాడు ప్రమాణ స్వీకారం చేయడానికి రాలేదని, ఇందులో రాజకీయ కోణాలేవీ
లేవని స్పష్టం చేశారు. ‘భారత్ మాతాకీ జై అనడానికి సిగ్గుపడే పార్టీకి
చెందిన వారు ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ఎలా ప్రమాణ స్వీకారం చెయ్యాలి?’ అని
ప్రశ్నించారు. ’15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల మంది హిందువులను
చంపేస్తామని ఎంఐఎం పార్టీ నేతలన్నారు. అది హిందువులను గౌరవించని పార్టీ.
బంగారు తెలంగాణ కలను సాకారం చేయాలంటే కేసీఆర్ అందరి మనోభావాలను పరిగణలోకి
తీసుకోవాలి. వ్యక్తులకు విలువ ఇవ్వని పార్టీ నేత ముందు ప్రమాణస్వీకారం
చేయలేను’ అని వెల్లడించారు. తాను తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతు
తెలుపుతున్నారని, దీన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని ప్రభుత్వానికి
చురకలంటించారు.
అంతేకాకుండా
గవర్నర్ ప్రసంగంపై ధన్య వాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరుగుగుతున్న
సమయంలోనూ రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. ఇటు టీఆర్‌ఎస్.. అటు
మజ్లిస్ పార్టీలకూ ఝలక్ ఇచ్చేలా మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం రాజకీయ
ప్రసంగంలా ఉందని భావించారు. ముఖ్య మంత్రిగా ఎవరుంటే వాళ్ల కాళ్లు పట్టుకునే
పార్టీలున్నా యని చెప్పారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే లాగి
పడేస్తారని మజ్లిస్‌ని ఉద్దేశించి అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగును
కూల్చి కొత్తది కట్టాలని చెప్పారు. ఆరోగ్య రంగంలో కేంద్రం నిధుల వాటా ఎంత
ఉందో చెప్పాలని ప్రశ్నించారు.
విపక్షాల తూటాలు
శాసన సభలో విపక్షాల విమర్శల తూటాలు
అప్పుడే మొదలయ్యాయి. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో జాప్యంపై
నిలదీసిన విపక్షాలు ఇప్పుడు కేబినెట్ ఏర్పాటుపై బాణం ఎక్కుపెట్టాయి.
ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు దాటిపోయినా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదని
కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం
రద్దుతో అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. గవర్నర్ స్పీచ్ కేసీఆర్
ఎన్నికల స్పీచ్‌లా ఉందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి ‘మీ’
గవర్నర్ అని ఆయన సంబోంధించారు. దానిని కేసీఆర్ తప్పుపడుతూ మీ కాదు.. మన
గవర్నర్ అనాలని సూచించారు. దానికి గండ్ర సమాధానమిస్తూ గవర్నర్ ప్రసంగంలో
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అని రాశారని గుర్తు చేశారు. అందుకే అలా మాట్లాడినట్లు
తెలిపారు. ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులు కూడా
కాలేదు.. అప్పుడే విమర్శలు ప్రారంభించారని, ఇది వారి విజ్ఞతకే
వదిలేస్తున్నానన్నారు.
నాటకీయంగా సీఎల్పీ ప్రకటన
సీఎల్పీ నాయకుడి విషయంలోనూ కాస్త సందిగ్ధం
కాంగ్రెస్ నేతలను టెన్షన్‌కు గురిచేసింది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన
రెండోరోజు సీఎల్పీ నాయకుడిగా మల్లు భట్టివిక్రమార్కను నియమిస్తూ కాంగ్రెస్
అధిష్టానం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు పలువురు నేతలు ఈ పదవికి
పోటీ పడ్డారు. ఎవరికి వారే పీఠం తమదే అంటూ ధీమా వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో
హైదరాబాద్‌లో తేల్చాల్సిన సీఎల్పీ నాయకుడి నిర్ణయాన్ని ఢిల్లీకి
వదిలేశారు. ఏకంగా ఏఐసీసీ ప్రతినిధులు వచ్చి ఎమ్మెల్యేలను సమన్వయం చేసేందుకు
ప్రయత్నిం చినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చివరకు పలు సమీకరణాలు
విశ్లేషించిన అధిష్టానం మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా
ప్రకటించింది.
నిరవధిక వాయిదా
తెలంగాణ రెండో అసెంబ్లీ తొలివిడత సమా
వేశాలు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. నాలుగోరోజు ఆదివారమైనప్పటికీ గవర్నర్
ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చించారు. ఇచ్చిన ప్రతి
హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం
చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి కేసీఆర్ సభలో
సమాధానమిచ్చారు. తాము ప్రజాసంక్షేమానికి సంబంధించి ఇచ్చిన హామీలపై ఆందోళన
అవసరం లేదన్నారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో లేని 76 అంశాలను అమలు
చేసినట్లు గుర్తుచేశారు. సీఎం ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానానికి సభ
ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.
– సప్తగిరి.జి, 9885086126
http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/ts-assembly/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి