ఎట్టకేలకు మంత్రివర్గం
తెలంగాణలో
ఎట్టకేలకు మంత్రివర్గం కొలువు దీరింది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా
ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 68 రోజులకు కేబినెట్ ప్రమాణస్వీకారం చేసింది.
మంత్రివర్గ విస్తరణలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం
చేశారు. ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో నిర్వహించిన
కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం
చేయించారు. ఈ పదిమందిలో నలుగురు మాజీ మంత్రులు కాగా, ఆరుగురికి కొత్తగా
మంత్రి పదవులు దక్కాయి.
పాత, కొత్తల మేళవింపు!
నిర్మల్ ఎమ్మెల్యే, మాజీ దేవాదాయ,
గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి; సనత్‌నగర్ ఎమ్మెల్యే,
మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్; సూర్యాపేట
ఎమ్మెల్యే, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి; హుజురాబాద్
ఎమ్మెల్యే, మాజీ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌లు రెండోసారి మంత్రులుగా
ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, పాలకుర్తి ఎమ్మెల్యే
ఎర్రబెల్లి దయాకరరావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్,
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర
మల్లారెడ్డి మొదటిసారి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
శాఖలు
ప్రమాణస్వీకారం చేసిన రోజే నూతన మంత్రులకు
శాఖలు కేటాయించారు. ఈటల రాజేందర్‌కు వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చారు. ఎర్రబెల్లి
దయాకర్‌రావుకు పంచాయతీరాజ్ శాఖను అప్పగించారు. కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమ
శాఖ, చామకూర మల్లారెడ్డికి కార్మికశాఖ; శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్,
క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం శాఖలు కేటాయించారు. వేముల
ప్రశాంత్‌రెడ్డికి రోడ్లు భవనాలు, రవాణాశాఖ; తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు
పశుసంవర్థక శాఖ; నిరంజన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ; ఇంద్రకరణ్‌రెడ్డికి అటవీ,
న్యాయ, దేవాదాయశాఖ; జగదీష్‌రెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. ఇప్పటికే
మహమూద్‌అలీ హోంశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇక.. సీఎం కేసీఆర్ దగ్గరే
ఇరిగేషన్, ఆర్థిక శాఖ సహా మంత్రులకు కేటాయించని కీలక శాఖలన్నీ ఉన్నాయి.
మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య
మంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ
మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ కార్యక్ర
మానికి మొత్తం 1200 మంది అతిథులకు ఆహ్వానాలు పంపించారు. కొత్తగా మంత్రులుగా
ఎంపిక చేసినవారికి ఆ విషయాన్ని సీఎం స్వయంగా ఫోన్ చేసి చెప్పారు.
కేటీఆర్ కూడా అందరికీ అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం
మంత్రులందరూ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌తో కలిసి గ్రూప్ ఫోటో
దిగారు.
తాజా విస్తరణలో భాగంగా కొత్తగా ప్రమాణ
స్వీకారం చేసిన 10 మందితో కలిపి సీఎం కేసీఆర్‌తో సహా తెలంగాణ మంత్రివర్గ
సభ్యుల సంఖ్య రెండు నుంచి 12 మందికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం
తర్వాత 2018 డిసెంబరు 13వ తేదీన సీఎం కేసీఆర్, మంత్రి మహమూద్ అలీ ప్రమాణ
స్వీకారం చేశారు. తర్వాత 68 రోజులకు ఇప్పుడు కేబినెట్ విస్తరణ జరిగింది.
మంత్రివర్గ కూర్పుపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా కసరత్తు చేశారు.
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్
నుంచి ఒకరికి, హైదరాబాద్ నుంచి ఒకరికి, రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరికి,
నల్గొండ నుంచి ఒకరికి, కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి, మహబూబ్ నగర్
జిల్లా నుంచి ఇద్దరికి, వరంగల్ జిల్లా నుంచి ఒకరికి, నిజామాబాద్ నుంచి
ఒకరికి మంత్రి పదవులు దక్కాయి. ఈ మంత్రివర్గ విస్తరణలో ఖమ్మం జిల్లాకు
అవకాశం దక్కలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఉమ్మడి మెదక్ జిల్లా
నుంచి ఆయన ప్రాతినిథ్యం ఉంది.
మరోవైపు
కేబినెట్ విస్తరణలో భాగంగా ఈసారి కూడా మహిళలకు స్థానం లభించలేదు.
షెడ్యూల్డు తెగలకు చెందిన వారికీ మంత్రివర్గంలో ప్రాతినిథ్యం
లేకుండాపోయింది. అయితే ఈ విషయంలో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు,
మహిళా ఎమ్మెల్యేలు ఆచితూచి స్పందించారు. అన్ని కోణాల్లో ఆలోచించి ఉత్తమమైన
కేబినెట్‌ను కేసీఆర్ రూపొందించారని అవకాశం లభించని ఓ మాజీ మంత్రి
అభిప్రాయపడ్డారు. కొత్తగా ప్రమాణం చేసిన ఓ మంత్రి ప్రజల మేలు కోసమే తాము
పని చేస్తామని.. తమకు కులం అవసరం లేదని సర్దిచెప్పారు. ఇక కేబినెట్‌లో
రెండోసారి కూడా మహిళలకు ప్రాధాన్యం దక్కకపోవడంపై టీఆర్‌ఎస్‌కు మహిళా ఓటు
బ్యాంక్ ఎప్పుడూ ఉంటుందని దాటవేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లు
గెలిచే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కసరత్తు చేసి ఈ కేబినెట్‌ను
రూపొందించారని, వచ్చే విస్తరణలో మహిళలకు తప్పకుండా అవకాశం ఉండొచ్చని ఓ
మహిళా ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విస్తరణపై స్పందించిన నేతలంతా
ఎక్కడా నోరు జారకుండా బ్యాలెన్స్‌గా వ్యవహరించడం కేసీఆర్‌పై ఉన్న భరోసాకు,
భయానికి అద్దం పట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లక్కీ నెంబర్!
కేసీఆర్‌కు లక్కీ నంబర్‌లు, ముహూర్తాలను
కచ్చితంగా ఫాలో అవుతారన్న పేరుంది. లక్కీ నెంబర్ పరంగా ఆ సెంటిమెంట్‌ను
ఇప్పుడు మరోసారి ఫాలో అయ్యారు. ఈ మంత్రివర్గ విస్తరణలోనూ కేసీఆర్ గతంలో
కొనసాగించిన సాంప్రదాయాన్నే అనుసరించారు. గత ప్రభుత్వంలో మొదట కేబినెట్
మంత్రులు 12 మంది ఉండేవారు. ఈసారి కూడా సీఎంతో కలిపి ఆ సంఖ్య 12కు చేరింది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత, 2014లో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో సీఎం
కేసీఆర్‌తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. టీఆర్‌ఎస్
రెండోసారి అధికారం లోకి వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్
అలీ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా తొలి విడత విస్తరణలో 10 మందిని
మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ప్రసుత్తం కేబినెట్‌లో మంత్రుల సంఖ్య
సీఎంతో కలిపి మొత్తం 12కు చేరింది.
హరీశ్‌కు ఝలక్!
తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ తర్వాత
స్థానాల్లో ఉన్న ప్రధాన నాయకులిద్దరికీ తాజా మంత్రివర్గ విస్తరణలో చోటు
దక్కలేదు. వారిలో ఒకరు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కాగా.. మరొకరు కేసీఆర్
మేనల్లుడు హరీశ్‌రావు. ఈ అంశం సహజం గానే తెలంగాణ రాజకీయాల్లో హాట్
టాపిక్‌గా మారింది. కేటీఆర్‌కు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
బాధ్యతలు అప్పగించి నెంబర్ టూ స్థానాన్ని భర్తీచేశారు కేసీఆర్. దీంతో
ఆయనకు మంత్రి పదవి ఇవ్వకున్నా పెద్దగా అభ్యంతరాలేమీ రాలేదు. కానీ పార్టీ
ఆవిర్భావం నుంచీ ఓ ఇరుసుగా పనిచేస్తున్న హరీశ్‌కు మాత్రం ఈ కేబినెట్
విస్తరణలో మొండిచేయి చూపడం సర్వత్రా చర్చకు దారి తీసింది. పైగా మొదటి
మంత్రివర్గంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా రాత్రింబవళ్లూ శ్రమించిన
అనుభవానికి మీడియానే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. అనేక సార్లు కేసీఆర్
ప్రశంసలు కూడా దక్కేలా చేసింది. కానీ ఇప్పుడు ఆయనకు మంత్రివర్గంలో చోటు
కల్పించక పోవడం అనూహ్య పరిణామమే. హరీశ్‌కు పార్టీలో, ప్రభుత్వంలో
ప్రాధాన్యం పూర్తిగా తగ్గిస్తున్నారన్న ప్రచారానికి ఈ పరిణామం మరోసారి
ఊతమిచ్చింది.
అధికారమంతా కేసీఆర్ వద్దే కేంద్రీకృతమై
ఉండటంతో ఆయన అధికారాన్ని పార్టీలోనే కాదు.. విపక్షాలు కూడా నేరుగా
ప్రశ్నించే పరిస్థితి లేదు. మరోవైపు కేసీఆర్‌కు హరీశ్‌రావు ఎదురు తిరుగు
తారన్న భయం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీలో గుసగుసలు
వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్‌కు పార్టీలో ఉన్నతస్థానం కల్పించి,
హరీశ్‌కు మాత్రం ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేయడం ఆ పార్టీలోనే అంతర్గత
మథనానికి కారణమైంది.
తనదైన శైలిలో స్పందించిన హరీశ్‌రావు
రాజ్‌భవన్‌కు మంత్రుల ప్రమాణ స్వీకారోత్స
వానికి వచ్చిన హరీశ్‌రావు.. తనకేమీ అసంతృప్తి లేదని మీడియాతో చెప్పారు.
సోషల్ మీడియాలో తనకు మద్దతుగా సాగుతున్న పోస్టులు, ప్రచారానికి తనకు
సంబంధం లేదన్నారు. పైగా తన పేరిట అలా ఎవరైనా గ్రూపులు ఏర్పాటు చేసి తనకు
మంత్రిపదవి ఇవ్వనందుకు పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే ఆ
ప్రయత్నాన్ని విరమించు కోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. తాను టీఆర్‌ఎస్‌లో
క్రమశిక్షణ కలిగిన సైనికుడినని, కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా ఓ
సైనికుడిలా, కార్యకర్తగా నెరవేరుస్తా నని స్పష్టం చేశారు. అయితే హరీశ్
మీడియా ముందు మాట్లాడుతున్న సమయంలో ఆయన ముఖంలో అంతకుముందు ఉండే చురుకుదనం,
ఉత్తేజం పెద్దగా కనిపించలేదు.
ముందే లీక్‌చేసిన రేవంత్!
కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయడానికి
ఒకరోజు ముందే కాంగ్రెస్‌పార్టీ నేత రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
చేశారు. అవి తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. హరీశ్‌రావుతో సహా
ముగ్గురు కీలక మంత్రులకు తాజా కేబినెట్‌లో బెర్తులు కేటాయించలేదని బాంబు
పేల్చారాయన. అసమర్థు లకు బెర్తులు దక్కుతున్నాయని, కొందరు సమర్థులను
పక్కనబెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి మీడియాతో
ఇష్టాగోష్టిగా చేసిన వ్యాఖ్యలు నిజం కావడం కూడా పెద్ద చర్చకు దారితీసింది.న
– సప్తగిరి.జి, 9885086126
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి