ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం
ఎన్నోయేళ్లపాటు ఎదురుచూసిన కల ఎట్టకేలకు సాకారమైంది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడనుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ఉభయసభల్లోనూ ఆమోదం లభించింది. చారిత్రాత్మక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదప్రక్రియ పూర్తయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సభాపరంగా సంపూర్ణమైంది. మూజువాణి ఓటుతో పెద్దల సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి సంతకం ఒక్కటే మిగిలింది. నోటిఫికేషన్ వెలువడటమే ఆలస్యం. అప్పాయింట్‌మెంట్ డే రాగానే.. ఆరోజు నుంచి తెలుగుజాతికి రెండు రాష్ట్రాలు. పది జిల్లాల తెలంగాణ. పదమూడు జిల్లాల సరికొత్త ఆంధ్రప్రదేశ్.
బిల్లులో సవరణలపై బీజేపీ పట్టుబట్టడంతో సందిగ్ధంలో పడ్డ బిల్లు.. గురువారం ఎట్టకేలకు పెద్దల సభ ఆమోదం పొందింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదరడంతో బీజేపీ బిల్లుకు సహకరించింది. సీమాంధ్ర కోణంలో బీజేపీ చేసిన కొన్ని ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక కేటగిరీ హోదా ప్రకటించింది. ప్రధాని మన్మోహన్ ఈమేరకు స్వయంగా రాజ్యసభలో ప్రకటన చేశారు. రాష్ట్రవిభజన తర్వాత తొలియేడాది రెవెన్యూలోటు ఏర్పడితే కేంద్రమే భరిస్తుంది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడిరాజధానిగా ఉంటుంది.ఆసమయంలో శాంతిభద్రతలు గవర్నర్ అదుపులో ఉంటాయి. బిల్లుపై విపక్షాల సవరణలన్నీ వీగిపోయాయి.
ఉభయసభల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఇవ్వబోయే అప్పాయింట్‌మెంట్ డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదాయ వనరులు, ఆస్తులు, ఆప్పులు, ఉద్యోగుల పంపిణీ వంటివన్నీ పూర్తయ్యేందుకు కావాల్సిన సమయం చూసుకొని అప్పాయింట్‌డే నిర్ణయిస్తారు. ఇప్పటికిప్పుడు విభజన అమల్లోకి వస్తే రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగాకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున ఉమ్మడిరాష్ట్రంలోనే ఎన్నికలు నిర్వహించి ఆతర్వాత ఆప్పాయింట్‌డే ప్రకటిస్తారని తెలుస్తోంది.