తెలంగాణ కల సాకారమవుతోందన్న ఆనందం ఆప్రాంత నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విభజన ప్రక్రియ కీలక దశకు చేరడంతో ఢిల్లీ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే.. హస్తినలోనే మకాం వేసిన కేసీఆర్ కొత్త అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు హైదరాబాద్ ను యూటీ చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వెల్లడించారు. ఇదే అంశంపై తనతో జైరామ్ రమేష్ చర్చలు జరిపినట్లు కేసీఆర్ తమ పార్టీ నేతలు, జేఏసీ నేతలతో చెప్పారు. తెలంగాణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతుందని.. అలాగే ఆమోదం కూడా పొందుతుందని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ విలీనంపై కూడా చర్చలు జరుగుతున్నాయన్న కేసీఆర్.. ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ ఇస్తే దేనికైనా సిద్ధమని కాంగ్రెస్ ముఖ్యనేతలకు చెప్పానన్నారు.
అటు.. రాష్ట్ర విభజన వద్దంటూ ఢిల్లీలో మహాధర్నా చేపట్టిన ఏపీ ఎన్జీవోలు రాంలీలా మైదాన్‌లో మకాం వేశారు. రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకొని తీరతామని మహాధర్నాకు వచ్చిన నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇక లగడపాటి రాజగోపాల్ వేదికపై మాట్లాడలేక కన్నీరు పెట్టుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఏపీఎన్జీవో నాయకుడు గుండెపోటుతో మరణించాడు.
ఇక.. ఏపీ భవన్ మాత్రం ఇరుప్రాంతాల నేతల మోహరింపుతో గంభీరంగా మారింది. ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. ఆలోచనలకు పదును పెడుతున్నారు. అయితే.. ఏం జరుగుతుందనేది ఇవాళ మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా క్షణక్షణం ఉత్కంఠ. ఉద్వేగ భరితమే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి