దక్షిణాది కుంభమేళాగా వినుతికెక్కిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హోరు రెండేళ్లకోసారి తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. యేడాది విడిచి యేడాది జరిగే మేడారం జాతర ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధానంగా మూడు రోజుల పాటు సాగే ఈ జాతరలో విపరీతమైన జనం రద్దీ కారణంగా జాతర రోజులకు ముందు నెలరోజులు, తర్వాత నెలరోజులు మేడారం రోడ్లన్నీ జనసంద్రంగా మారుతాయి. ఇక జాతర కొనసాగే మూడు రోజుల్లో అయితే.. ఇసుక వేస్తే రాలని జనంతో మేడారం జన దిగ్భంధమవుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా చెప్పుకునే ఈ గిరిజన జాతరపై జనంలో ఉన్న విశ్వాసం, ప్రాముఖ్యతను గుర్తించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 1996లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
వన దేవతలు
----------
వరంగల్ జిల్లాలోని అత్యంత మారుమూల గ్రామం మేడారం. వరంగల్ జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవులు, కొండలమధ్య మేడారం నెలవై ఉంది. సాధారణ రోజుల్లో అటువైపు జనం వెళ్లే పరిస్థితి ఉండదు. కానీ జాతర సమయంలో మాత్రం ఒక్కసారిగా భూమి ఈనిందా అన్నట్లు జనం.. మేడారంలో కనిపిస్తారు. వనంలో వెలిసిన దేవతా మూర్తులు సమ్మక్క-సారలమ్మ. అందుకే వీరిని వనదేవతలుగా పిలుస్తారు. ఇది వనదేవతల జాతర, ప్రకృతితో మమేకమైన జాతర.. మేడారం జాతర. విగ్రహాలు లేకుండా సాగే ఈ జాతరలో కేవలం గద్దెలకు మాత్రమే జనం మొక్కులు అప్పగిస్తారు. ఈ జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవాళ్లు. 1940 తర్వాత యేడాదికేడాది జనం భారీగా పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరుపుకోవడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలను ఏర్పాటు చేశారు. జాతర జరిగే మూడు రోజుల్లో అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను చిలుకలగుట్ట నుంచి గిరిజన కోయ పూజారులు కిందికి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. తిరిగి కుంకుమ భరిణెలను గద్దెలపై నుంచి తరలించడంతో జాతర ముగుస్తుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాంధవులుగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. భారతదేశ వ్యాప్తంగా వనదేవతలుగా పూజలందుకుంటున్న సమ్మక్క, సారలమ్మల జాతర.. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. కోటిమందికి పైగా భక్తులు తరలివచ్చే మహాజాతర మేడారం.
మేడారం చరిత్ర
-------------
వరంగల్ జిల్లాకు చెందిన మేడారం జాతరకు కరీంనగర్ జిల్లాతో సంబంధం ఉంది. ఈ జాతరకు మూల అమ్మవారైన సమ్మక్క పుట్టిల్లు కరీంనగర్ జిల్లా. జగిత్యాల సమీపంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కూతురు సమ్మక్క. తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు మేడరాజు తనకూతురు సమ్మక్కను ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. కాకతీయుల దండయాత్రను తట్టుకోలేని మేడరాజు.. మేడారం పారిపోయి తలదాచుకుంటాడు. అదే సమయంలో కాకతీయుల సామంతుడిగా ఉన్న మేడారం పాలకుడు కోయరాజు పగిడిద్దరాజు.. కరువు కాటకాల కారణంగా కాకతీయులకు కప్పము కట్టలేకపోతాడు. ఇటు కప్పం కట్టక పోవడం.. అటు మేడరాజుకు ఆశ్రయం కల్పించడంపై ఆగ్రహోదగ్రుడైన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తుతాడు. సంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగమ్మ, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభిస్తారు. వీరోచితంగా సాగిన యుద్ధంలో కాకతీయ సేనల ధాటికి తాళలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు చనిపోతారు. తమ వాళ్లందరూ చనిపోయారని, యుద్ధంలో తాము ఓడిపోయామన్న వార్త విన్న జంపన్న అవమానం తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటినుంచి సంపెంగవాగు.. జంపన్నవాగుగా ప్రసిద్ధిచెందింది. మరోవైపు.. సమ్మక్క.. యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయులను ముప్పు తిప్పలు పెడుతుంది. భారీగా తరలివచ్చిన కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడిన సమ్మక్క.. తీవ్రంగా గాయపడి రక్తపు ధారతలతోనే యుద్ధభూమి నుంచి తప్పుకొని చిలుకలగుట్ట వైపు వెళ్తూ.. దారి మధ్యలోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ.. ఆ ప్రాంతంలో ఓ పుట్ట దగ్గర పసుపు, కుంకుమ ఉన్న భరిణె దొరికింది. దాన్ని సమ్మక్కగా భావించిన అనుచరులు.. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అప్పటినుంచి ప్రతి రెండేళ్లకోసారి.. మాఘ శుద్ధ పూర్ణిమ రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు.
నాలుగు రోజుల వైభవం - తనివి తీరని జనం
---------------
ఈయేడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేడారం జాతర కోలాహలంగా సాగనుంది. జాతర మొదటిరోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. రెండోరోజున చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చి ప్రతిష్టిస్తారు. మూడోరోజున అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై పూజలందుకుంటారు. భక్తుల మొక్కులు స్వీకరిస్తారు. నాలుగోరోజు.. సాయంత్రం ఆవాహన పలికి దేవేరులనిద్దరినీ.. తిరిగి యుద్ధస్థానంలో చేరుస్తారు. అమ్మవార్లు గద్దెపై ప్రతిష్టించే సమయంలో పూజారులు, భక్తులు పూనకంతో ఊగిపోతారు. భక్తి పారవశ్యంలోనృత్యాలు చేస్తారు. వంశపారం పర్యంగా వస్తున్న గిరిజనులే ఈ జాతరలో పూజారులుగా ఉంటారు. మేడారం జాతర సమయంలో ప్రభుత్వ జిల్లా యంత్రాంగం మొత్తం వారం రోజుల పాటు.. జిల్లా కేంద్రాన్ని వదిలి మేడారం తరలివెళ్లడం ఈ జాతరకు ఉన్న ప్రాధాన్యతను ప్రస్ఫుటిస్తుంది.
నిలువెత్తు బంగారం - అమ్మవార్లకు ప్రియం
-------------
మేడారం జాతరకు మాత్రమే ప్రత్యేక మైనది బంగారం. బెల్లంను సమ్మక్క జాతరలో బంగారంగా పిలుస్తారు. భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించడం మేడారం జాతరలో ఆనవాయితీ. కోరికలు తీరిన వాళ్లు.. అమ్మవార్లకు మొక్కుకున్న వాళ్లు.. నిలువెత్తు బంగారం పంచిపెడతారు. అందుకే మేడారం జాతరలో బంగారం (బెల్లం) గుట్టలు గుట్టలుగా అవసరమవుతుంది. జాతర జరిగినన్ని రోజులు తాడ్వాయి అటవీప్రాంతమంతా సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మారుమోగిపోతుంది. లక్షలాది వాహనాలు, కోట్ల సంఖ్యలో జనంతో పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడుతాయి. శివసత్తుల పూనకాలు, భక్తుల మొక్కులతో మేడారం పులకించిపోతుంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతుంది. సమ్మక్కకు యాటమొక్కు, సారలమ్మకు సుంకువడ్లు సమర్పించడం గిరిజనుల ఆనవాయితీ. ధాన్యం పండించే గిరిజనులు సారలమ్మకు ముందుగా సుంకువడ్లు సమర్పించాకే ధాన్యాన్ని అమ్ముకోవడం ఆనవాయితీ.
తెలంగాణ వచ్చాక తొలిజాతర
--------------------
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ మేడారం జాతరను ప్రభుత్వం.. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈయేడాది మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం.. అమ్మవార్ల గద్దెలకుకోట్ల రూపాయలను ఖర్చుచేస్తోంది. ఈసారి జాతరకు ఆధునిక సొబగులు అద్దుతున్నారు. భక్తుల సహకారంతో సమ్మక్క-సారలమ్మ గద్దెలపై గ్రానైట్‌తో ఫ్లోరింగ్ చేశారు. మేడారం వెళ్లే దారులను నాలుగు లైన్ల రోడ్లుగా తీర్చిదిద్దారు. అంతేకాదు.. ఈరోడ్లలోనూ.. వచ్చే రోడ్లు, వెళ్లే రోడ్లు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కోటిమందికి పైగా భక్తులు జాతరకు తరలివస్తారన్న అంచనాలతో స్నాన ఘట్టాలు, బారికేడ్లు, క్యూలైన్లు, తాత్కాలిక షెడ్లు నిర్మించడంతో పాటు.. మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్ సదుపాయాలు కల్పించారు. ఆసక్తి కలిగిన భక్తులు హెలికాప్టర్‌లో కూడా జాతరకు వెళ్లివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతరకు తరలివెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ నెలరోజుల ముందు నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నాలుగు వేల బస్సులను మేడారానికి మళ్లిస్తున్నారు. అంతేకాదు.. బృందాలుగా వెళ్లే భక్తులకోసం ఆర్టీసీ బస్సులను అద్దెకు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేశారు. బస్సు పూర్తిగా నిండే జనం ఉంటే.. ఆ కాలనీ నుంచే బస్సులను నడిపించడమూ కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. లెక్కప్రకారం జాతర ఇంకా ప్రారంభం కాకున్నా.. నెలరోజుల ముందు నుంచే మేడారానికి భక్తజనం తాకిడి భారీగా ఉంటోంది. నిత్యం 50 వేలకు తగ్గకుండా జనం వనదేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
తెలుగువారికే కాదు.. ఇతర రాష్ట్రాల ప్రజలకూ ఇలవేల్పులు
---------------------------------------
సమ్మక్క, సారలమ్మలు ఒక్క మేడారం అటవీప్రాంత గిరిజనులకు, తెలుగు ప్రజలకే కాదు.. దేశంలోని చాలా రాష్ట్రాలలోని జనం సమ్మక్క-సారలమ్మలను దైవాలుగా పూజిస్తారు. జాతర జరిగే సమయంలో అందుకే మేడారం జనసంద్రమవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా జనం అత్యధిక సంఖ్యలో తరలివస్తారు. ఒక్క హిందువులే కాదు.. ఇతర మతాల వారూ మేడారం జాతరకు తరలిరావడం అమ్మవార్ల మహత్మ్యానికి ప్రతీకగా చెప్పవచ్చు.
ఆధునిక సొబగులు
-------------
ఎంతో ఘనత కలిగిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కూడా ఆధునికతను సంతరించుకుంటోంది. భక్తుల తాకిడి పెరిగిన కొద్దీ, ఏర్పాట్లు, హంగులు, ఆర్భాటాలు ఎక్కువవుతున్నాయి. ఫలితంగా అడవిలో కొలువైన మేడారం సమ్మక్క, సారలమ్మలు మరికొద్ది రోజుల్లోనే ఆ అటవీ వాతావరణం నుంచి జనారణ్యం, అధునాతన కాలనీ మధ్య కొలువైనట్లు దర్శనమిస్తారనడంలో అతిశయోక్తి లేదు. దశాబ్దం క్రితం మేడారంలో పరిస్థితి, వాతావరణం, తాజా పరిస్థితికి భారీ తేడాను ప్రతిఒక్కరూ గమనించవచ్చు.
- సప్తగిరి గోపగోని
98850 86126.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి