ఈసీ విప్లవాత్మక నిర్ణయాలు..!
తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఇటు రాజకీయ పార్టీలకు, అటు ఎన్నికల సంఘానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. అంతేకాదు దేశంలోనే సరికొత్త ప్రయోగాలకు తెలంగాణ రాష్ట్రం వేదిక కానుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ పలు ప్రతిపాదనలపై విస్తృతంగా సమాలోచనలు చేస్తోంది. దేశంలోనే ప్రప్రథమంగా ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సాధ్యాసాధ్యాలపై చర్చలు సాగిస్తోంది. ఒకవేళ ఈ వినూత్న ప్రయోగాలు సఫలమైతే భవిష్యత్తులో దేశమంతటా అమలు చేసేందుకు కూడా సంసిద్ధమవుతోంది.
సీసీ కెమెరాల ఏర్పాటు!?
తెలంగాణలో డిసెంబర్ ఏడో తేదీన జరగనున్న పోలింగ్‌కు అన్ని బూత్‌లలో సీసీ కెమెరాలు అమర్చాలని ఎలక్షన్ కమిషన్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల అభిప్రాయాలు సైతం సేకరించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల వినియోగం సాధ్యమవు తుందా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుంటే దేశంలోనే పోలింగ్ ప్రక్రియలో సీసీ కెమెరాలు వినియోగించిన తొలిరాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది.
ప్రయోజనాలు
సున్నితమైన, సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలను వినియోగించే ప్రక్రియను ఎన్నికల సంఘం అమలు చేస్తోంది.
తెలంగాణ సహా మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పలు విడతలుగా ఎన్నికలు జరగనుండగా, తెలంగాణలో మాత్రం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 2019 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలనే మలుపు తిప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వీటిని పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దశలవారీగా జరుగుతున్న సమీక్షల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు వినియోగించే అంశం చర్చకు వచ్చింది. దీన్ని అమలు చేయాలంటే భారీ వ్యయం అయ్యే పరిస్థితులు ఉన్నా అధికార యంత్రాంగానికి విధినిర్వహణ మరింత సులువు అవుతుందని ఈసీ అంచనా వేస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల నిబంధనల అమలు, రిగ్గింగ్ వంటి ఇతర అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సీసీ కెమెరాల ఏర్పాటుతో సాధ్యమవుతుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోనే తొలిసారి
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా సీసీ కెమెరాల వినియోగం ఒక్క తెలంగాణకే పరిమితం చేయాలన్న నిర్ణయం ఖరారైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో ఒకే విడతలో పోలింగ్ జరగనుండటం, ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే దాదాపు సర్వ సన్నద్ధం కావడం వల్ల పోలింగ్ తేదీ నాటికి ఈ ప్రతిపాదన అమలు చేయడానికి జాప్యం ఉండదని ఈసీ భావిస్తోంది. మరోవైపు పోలింగ్ తేదీ సమీపి స్తుండటం కూడా ఈ నిర్ణయాన్ని ఒకే రాష్ట్రానికి పరిమితం చేయాలన్న ఆలోచనకు కారణమని చెబుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.
పర్యవేక్షణ బాధ్యత పోలీసులదే
తెలంగాణలో మొత్తం 32 వేల 574 పోలింగ్ కేంద్రాలున్నాయి. అన్నింట్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాదాపు 48 కోట్ల 86 లక్షల రూపాయల మేరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ విద్యుత్తు సౌకర్యం ఉంది. కాబట్టి కెమెరాల అమరిక కష్టసాధ్యమేమీ కాదని అధికారులు కూడా చెబుతున్నారు. కెమెరాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కమాండ్ కంట్రోల్ రూంలతో అనుసంధానించి పర్యవేక్షించే యంత్రాంగం కూడా రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో టెండర్లు పిలిస్తే ఆలస్యమవుతందని నామినేషన్ పద్ధతిలోనే సీసీ కెమెరాలు కొనాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కెమెరాల నిర్వహణ, పర్యవేక్షణకు 32వేల మందికిపైగా సిబ్బంది అవసరమవుతారు. ఆ కోణంలోనూ సిబ్బంది సమీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్‌లు విజయవంతంగా అమలు చేస్తున్న పోలీసు శాఖ సిబ్బందిని వీటికోసం వినియోగించుకోనున్నారు. కెమెరాలు అమర్చడం దగ్గర్నుంచి, పోలింగ్ సరళి మొత్తాన్ని పర్యవేక్షించే బాధ్యతలు పోలీసులకే అప్పగించనున్నారు.
ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటో!
ఈ ఎన్నికల్లో ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలను కూడా ముద్రించనున్నారు. ఓటు వేసిన తర్వాత ఓటరు ఎవరికి ఓటు వేశాడో మూడు భాషల్లో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
మొత్తానికి సీసీ కెమెరాలు ఏర్పాటైతే పూర్తి స్థాయిలో నిఘా నీడన ఎన్నికలు జరిగిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రపుటల్లోకి ఎక్కుతుంది. అంతేకాకుండా ఈవీఎంలు పనిచేయడం లేదని, ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడిందనే ఆరోపణలకు, విమర్శలకు తెరపడనుంది.
– సప్తగిరి.జి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/ec-rajat-kumar/