29, నవంబర్ 2018, గురువారం

తెలంగాణలో ముందస్తు ముసురు



తెలంగాణలో ముందస్తు ముసురుకేసీఆర్‌ సవాల్ - విపక్షాల వార్నింగ్ 


తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి ముసురుకుంది. రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు రేపో, మాపో అన్నంతగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఫలితంగా రాజధాని హైదరాబాద్‌ మొదలుకొని.. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల దాకా అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. దీంతో.. సమీకరణాలు కూడా శరవేగంగా మారుతున్నాయి.

ప్రతిపక్షాలకు ముందస్తుకు సిద్ధమా ? అంటూ గతంలో సవాల్‌ విసిరిన కేసీఆర్‌ మాటలను అప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు గడువుకు ముందే ఎన్నికలకు వెళ్తారన్న వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. త్వరలో నాలుగు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికలతో పాటే.. తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించేందుకు కేసీఆర్‌ ఉవ్విళ్లూరుతున్నారు.

విపక్షాలను బురిడీ కొట్టించే ప్లాన్‌ :
ముందస్తు ఎన్నికల విషయంలో విపక్షాలను బురిడీ కొట్టించేలా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ తేరుకునేలోగానే.. నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ బలం పుంజుకోవచ్చునని కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేదు. దీనికి తోడు కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, నేతల మధ్య అనైక్యత అన్నీ తమకు గ్రౌండ్ లో కలిసొస్తాయనే ప్రగాఢ విశ్వాసంతో కెసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

శంఖారావంగా ప్రగతి నివేదన సభ :
మరోవైపు.. ప్రజల్లో రైతుబంధు పథకం, రైతు భీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వంటి అభివృద్ధి పథకాలే కాకుండా కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా వంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఫీల్‌గుడ్ వాతావరణం ఉన్నట్లు అంతర్గత సర్వేలు చెబుతున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపి ఎన్నికలకు సన్నధ్దం చేయడానికే  హైదరాబాద్‌లో ప్రగతి నివేదన సభను వాహకంగా వాడుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ సభను ఎన్నికల శంఖారావ సభగా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు.

ముందస్తు సందేశాలు :
పార్టీ ముఖ్యుల సమావేశంలో కేసీఆర్‌ ముందస్తు సంకేతాలు ఇవ్వకముందే.. సాంకేతిక అంశాల సర్దుబాటుపై ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆశోక్‌ లావాసాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  రాజీవ్ శర్మ కలిశారు. ఇటు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పలుసార్లు గవర్నర్‌ నరసింహన్‌ను పదే పదే కలుస్తున్నారు. వారంలోనే రెండుసార్లు రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌తో సమావేశం కావడం కూడా ఎన్నికల వేడికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అటు.. ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలంగాణలో ముందస్తు ఖాయమన్న సందేశాలను ఇస్తున్నాయి.

సర్వసన్నద్ధమంటున్న ప్రతిపక్షాలు :
అయితే.. కేసీఆర్‌ స‌వాల్‌ను ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా స్వీకరించాయి. తామూ సర్వ సన్నద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు చేశారు ఆయా పార్టీల నేతలు. అంతేకాదు.. గతంలో ముందస్తుకు వెళ్లిన చంద్రబాబు గతి ఏమయ్యిందో కేసీఆర్‌కు అదే గతి తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో కూర్చొని పగటి కలలు కంటున్నారు తప్ప.. క్షేత్రస్థాయిలో జనం సమస్యలు, ఓటర్ల మనోభావాలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

  ఇందుల భాగంగానే.. కాంగ్రెస్ పార్టీ ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసే పనిలో పడింది. పార్టీ ముఖ్య నేతలతో ఎమర్జెన్సీ మీట్‌ నిర్వహించిన రాష్ట్ర పెద్దలు, ఢిల్లీ దూతలు.. ముఖ్యనేతలు, కేడర్‌కు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల వ్యూహాలు, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనికి ముందు రాహుల్ గాంధీ దృష్టికి ముందస్తు అంశాన్ని తీసుకెళ్లారు ఆ పార్టీ నేతలు. దీంతో.. అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేయాలని రాహుల్‌ ఆదేశించడంతో ఈ దిశగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చర్యలు చేపట్టారు.

ఇక.. మోదీ చరిష్మా దేశవ్యాప్తంగా దూసుకుపోతున్న తరుణంలో.. రాష్ట్ర బీజేపీ కూడా అప్రమత్తమైంది. కేసీఆర్‌ వైఫల్యాలే తమ ఆయుధాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జాతీయస్థాయిలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ బలం ఏమాత్రం తగ్గలేదని.. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి.. ముందస్తులో కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ముందస్తుకు మార్గం :
అసలు కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా.. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు తెరతీసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. భారీగా ప్రజాధనం వృథా కాకుండా ఉంటుందని లెక్కలతో సహా నిపుణులు తేల్చి చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం అన్నిరాష్ట్రాల, అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలు కూడా తీసుకుంది. అయితే.. ఇప్పటికి మాత్రం ఆ ప్రతిపాదన మూలన పడింది. దీంతో.. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమమైందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

- సప్తగిరి.జి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి