29, నవంబర్ 2018, గురువారం

రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్



రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్

రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్
ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా, గత ఎన్నికల్లో ఊహించని రీతిలో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ 2019లో మాత్రం స్పెషల్‌ యాక్షన్‌ ప్లాన్‌తో బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు టిపిసిసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ నేతత్వంలోని సర్వే టీమ్‌ రిపోర్ట్‌తో నేతల కదలికలపై, పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చారని సమాచారం. టిపిసిసిలో బిసి నేతలకు పెద్దపీట వేసి గులాబి పార్టీకి చెక్‌ పెట్టేందుకు సిద్ధమవుతోందని ఢిల్లీ నుంచి లీకులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికలకు రథ సారధ్యం వహించేది ఎవరన్న దానిపైనా పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కులాల వారీగా ఓట్లను విభజిస్తూ, టిఆర్‌ఎస్‌ ముందుకు సాగుతుండటంతో కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దలు సైతం బిసి కార్డుతో ముందుకు సాగేందుకు రెడీ అయ్యారు. వర్గపోరుతో గాంధీ భవన్‌, హైదరాబాద్‌కే పరిమితమవుతున్న నేతలను నియోజకవర్గ బాట పట్టేలా ప్లానింగ్‌ చేస్తున్నారు. పదికి పైగా సిఎం అభ్యర్థులమంటూ చెప్పుకునే కాంగ్రెస్‌లో నేతలను సమన్వయం చేస్తూ ముందుకు సాగేలా రాహుల్‌ టీమ్‌ కసరత్తు చేస్తోందని సమాచారం. యువరక్తం పేరిట ముందుకు సాగితే తెలంగాణలో సీనియర్‌ నేతల అలకలతో అసలుకే ఎసరు వస్తుందన్న భయంతో.. బిసి కార్డును తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రచార కమిటీలో యువకులకు భాగస్వామ్యం కల్పించేలా పలువురి పేర్లు పరిశీలించి నట్లు తెలుస్తోంది.
119 నియోజకవర్గాల్లో 50 మంది అభ్యర్థుల లిస్టును ఉత్తమ్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ఎన్నికలకు ఆరునెలల ముందుగానే ప్రకటిస్తే ఫలితాలు మెరుగవుతాయన్న ప్రతిపాదనను ఎఐసిసి ముందుంచినట్లు చెబుతున్నారు. మరోవైపు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌పై సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి కోమటిరెడ్డి అయితే బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు నేతలు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అటు రేవంత్‌రెడ్డి ప్రచార కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నా, ఉత్తమ్‌ చెక్‌ పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రులను ప్రచార కమిటీలోకి తీసుకొని జిల్లాల బాధ్యతలు అప్పగించాలని రాహుల్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్‌ కెప్టెన్సీలో ఎన్నికలకు వెళ్తే సీనియర్లు సహకరిస్తారా లేదా అన్న అంశంపై రాహుల్‌గాంధీ టీమ్‌ ఆరా తీసిందని, ఆ రిపోర్ట్‌ రాహుల్‌కు చేరడంతో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని సమాచారం. అయితే ఎన్నికల ఆర్థిక అవసరాలను సీనియర్‌ నేతలు ఎంతవరకు భరిస్తారన్న దానిపైనా నేతల నుంచి ఢిల్లీ దూతలు ఆరా తీశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి ఎన్నికల రథ సారథ్యం చివరకు జానాకు దక్కనుందని చెప్పుకుంటున్నారు. జానా వర్గంలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ కీలకంగా మారనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. కెసిఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆసక్తికర విధానంతో ముందుకెళుతోంది. ప్రజల్లో పెద్ద ఇమేజ్‌ను బిల్డప్‌ చేసుకున్న కెసిఆర్‌ను ఢీకొట్టేందుకు కీలక అంశాలను ఎంచుకుంది. అందుకు కెసిఆర్‌ నోటి మాటలనే ఆయుధాలుగా ఎంచుకుంది. గత ఎన్నికల సమయంలో కెసిఆర్‌ ఇచ్చిన హామీల్లో ఏవి నెరవేరలేదు, వేటిని అస్సలు పట్టించుకోనేలేదనే అంశాలను తీసుకుని వాటినే ఆయుధాలుగా చేసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఎస్‌.సి., ఎస్‌.టి.ల విషయంలో కెసిఆర్‌ సీఎం కాకముందు అన్న ఒక మాటను పట్టుకుంది.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఎస్‌.సి.ని సిఎం చేస్తానని మొదట్లో చెప్పిన కెసిఆర్‌ మాట తప్పారంటూ దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్‌పై సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు, మాజీ లోక్‌సభ స్పీకర్‌ అయిన మీరా కుమార్‌ ఎస్‌.సి., ఎస్‌.టి. వ్యతిరేకి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎస్‌.సి., ఎస్‌.టి. నాయకురాలు కూడా కావడంతో అవి ఎస్‌.సి., ఎస్‌.టి. వర్గానికి నేరుగా తగులుతా యని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఎస్‌.సి., ఎస్‌.టి. వ్యక్తిని సిఎంగా చేస్తానని చెప్పిన కెసిఆర్‌ మాట తప్పి తానే ఎందుకు సిఎం అయ్యారని మీరా కుమార్‌ ప్రశ్నించారు.
దీనికి టిఆర్‌ఎస్‌ నుంచి సమాధానం లేదు. సమాధానం చెప్పడం కూడా కొద్దిగా కష్టమే. ఇక కాంగ్రెస్‌ కెసిఆర్‌పై ప్రయోగిస్తున్న రెండో ఆయుధం మైనార్టీలు. దీనికి కూడా మూలాన్ని ఎన్నికల హామీల నుంచే తీసుకున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తానని చెప్పిన కెసిఆర్‌ ఎందుకు మాట నిలబెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది ముస్లింలను మోసం చేయడమేనని అంటున్నారు. దీంతో పాటు మరో అంశాన్ని కూడా కాంగ్రెస్‌ చెబుతోంది. బిజెపితో టిఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందాన్ని చేసుకుందని, అలాంటి టిఆర్‌ఎస్‌తో ఎంఐఎం పొత్తు కొనసాగిస్తున్నదని విమర్శించారు.
ఇలా ఈ రెండు ప్రధానాంశాలతో కెసిఆర్‌పై కాంగ్రెస్‌ దాడి చేస్తోంది. అయితే కాంగ్రెస్‌ ఎక్కువగా ఆధారపడుతోంది మాత్రం తాను రైతులకిచ్చిన రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామనే హామీ పైనే. అంతపెద్ద మొత్తంలో రైతుకు రుణమాఫీ రాష్ట్రవ్యాప్తంగా ఎలా సాధ్యం చేస్తారని, వాస్తవంగా సాధ్యమవ్వదని టిఆర్‌ఎస్‌ అంటోంది. ఈ హామీ తమకు ఓట్లు రాబడుతుందని భావిస్తున్న కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వారికి రుణ పరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.
ఈ విధంగా ఎస్‌.సి., ఎస్‌.టి.లు, ముస్లింలు, రైతులే లక్ష్యంగా కాంగ్రెస్‌ ముందుకెళుతోంది. ఈ వ్యూహాలు వచ్చే ఎన్నికల్లో టి-కాంగ్రెస్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.
– సప్తగిరి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి