తెలంగాణలో కొత్త పార్టీ
తెలంగాణ ఏర్పడ్డాక కెసిఆర్ ప్రభుత్వంలో కోదండరాం భాగస్వాములవుతారని అందరూ అనుకున్నారు. కాని ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. అయితే కొంతకాలం నిశ్శబ్ధంగా ఉన్న కోదండరాం గత సంవత్సరం నుంచి టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పత్యక్ష విమర్శలకు దిగారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచు కోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో ఓ రకంగా ప్రభుత్వానికి, పొలిటికల్ జెఏసికి మధ్య పెద్ద యుద్ధమే కొనసాగింది. మొదట విపక్ష పార్టీలతో కలిసి గళం వినిపించిన ప్రొఫెసర్ ఇప్పుడు ఏకంగా కొత్తపార్టీనే ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ రెండో తేదీన ‘తెలంగాణ జన సమితి’ పార్టీ ఆవిర్భవించింది. ఇదే నెల 29వ తేదీన పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కొన్ని నెలలుగా రాజకీయ పార్టీ గురించి సీరియస్‌గా కసరత్తు చేసిన కోదండరాం చివరకు తన సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలో పార్టీ పేరు, లక్ష్యాలు, ఆశయాలు, కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణలో ఏకవ్యక్తి నిరంకుశ పాలన సాగు తోందని, ఆ పాలనను కూకటివేళ్లతో తొలగించేందుకే కొత్తపార్టీని స్థాపించామన్నారు. తెలంగాణ అభివద్ధి, సామాజిక న్యాయ సాధనే ‘తెలంగాణ జన సమితి’ లక్ష్యమని కోదండరాం చెప్పారు. తాను కొత్త పార్టీని స్థాపించినప్పటికీ టిజెఎసి మాత్రం యథాతథంగా కొనసాగుతుందని కోదండరాం వెల్లడించారు.
హైదరాబాద్‌లో ప్రగతిభవన్ గడీ బద్దలు కొడతామని, తమ శక్తితో రాజకీయ మార్పును తీసుకొస్తామని కోదండరాం అన్నారు. ఏప్రిల్ నాలుగో తేదీన పార్టీ జెండా, గుర్తు వివరాలను ప్రకటించి అనంతరం ఆయన మాట్లాడుతూ సైకిల్‌పై ఊరూరా తిరిగి దళిత వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కాన్షీరాం దేశ రాజకీయాల్లో పెను విప్లవాన్ని తీసుకొచ్చారని తెలిపారు. చీపురుతో బయల్దేరిన ఆమ్‌ఆద్మీ పార్టీ సామాన్యులను ఎన్నికల్లో నిలబెట్టి బలవంతులైన రాజకీయ నాయకులను ఓడించిందన్నారు. తాము కూడా బలమైన శక్తిగా మారతామని సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, ఇతర అమరవీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు సాగుతామని తెలియజేశారు. అనంతరం ఆవిర్భావ సభ నిర్వహణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సన్నాహక కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి సన్నాహక కమిటీలోని సభ్యులు, 11 సబ్ కమిటీలు సభ నిర్వహణ కోసం కార్యాచరణను ప్రారంభిం చాయి. జిల్లా స్థాయిల్లో ఏప్రిల్ ఐదో తేదీ నుంచి సదస్సులు, సమావేశాలు, ర్యాలీలు చేపడతామని కోదండరాం తెలిపారు.
పాలపిట్ట, ఆకుపచ్చ రంగులతో తెలంగాణ జన సమితి పార్టీ జెండాను రూపొందించారు. మధ్యలో నీలివర్ణపు తెలంగాణ పటం, ఆ మధ్యలో అమరుల స్థూపాన్ని ఉంచారు. స్థూపం చుట్టూ జనం తిరుగు తున్నట్లుగా జెండాను రూపొందించారు. జెండాలోని అంశాలను కోదండరాం ఒక్కొక్కటీ వివరించారు. విజయానికి సంకేతంగా పాలపిట్ట రంగు, అభివద్ధి, వ్యవసాయానికి చిహ్నంగా ఆకుపచ్చ రంగును తమ పార్టీ జెండాలో ఉపయోగించామన్నారు. దళిత వాదానికి ప్రతీకగా నీలివర్ణంలో తెలంగాణ పటాన్ని ముద్రించామన్నారు. అమరవీరుల స్థూపంపై ఉండే మల్లెపువ్వును పతాకం మధ్యలో పొందుపర్చా మన్నారు. దాని చుట్టూ తిరుగుతున్నది సంఘటితమైన తెలంగాణ ప్రజలని, మధ్యలో ఉన్న ఎరుపురంగు అమరుల ఆకాంక్షలకు ప్రతిరూపమని కోదండరాం వర్ణించారు.
స్థానిక సంస్థల్లో పోటీ చేస్తుందా ?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘తెలంగాణ జన సమితి’ పోటీ చేసే ఆలోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో ఒంటరిగానే తమ పార్టీ పోటీ చేస్తుందని కోదండరాం ప్రకటించిన నేపథ్యంలో దానికి ముందు పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 29న జరిగే బహిరంగ సభలో చాలా మంది ప్రముఖులు, ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరతారని కోదండరాం స్వయంగా తెలిపారు. దీంతో ఇప్పటికే కెసిఆర్‌కు కొరకరాని కొయ్యగా మారిన కోదండరాం ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టడంతో ఇద్దరి మధ్య ప్రత్యక్ష పోరు మొదలైందంటున్నారు విశ్లేషకులు.
కత్తి మీద సామేనా ?
టిజెఏసి ఛైర్మన్‌గా ఉద్యమానికి అన్ని వర్గాల్నీ కోదండరాం ఏకం చేయగలిగినా అప్పటి పరిస్థితులు వేరు. రాజకీయంగా ఓ కొత్తపార్టీ ప్రజల్లో నిలదొక్కు కోవడం, అందరి మనసులూ గెలుచుకుని మనుగడ సాగించడం అంత తేలికేమీ కాదన్నది విశ్లేషకుల మాట. ప్రజల్లోకి పార్టీ అజెండా తీసుకెళ్లటం, ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవటం మామూలు విషయం కాదు. మిగిలిన రాజకీయ పక్షాలన్నింటినీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకం చేయడం కూడా అంత సులువేం కాదు. ఈ సవాళ్లన్నిటినీ కోదండరాం అధిగమిస్తారా? లేదా ? అన్న ప్రశ్న కూడా విశ్లేషకుల్లో తలెత్తుతోంది. పైగా రాజకీయంగా కాకలుదీరిన కెసిఆర్ రాజకీయ వ్యూహం ముందు కోదండరాం పాచికలు పారతాయా? అన్న ప్రశ్న కూడా అప్పుడే మొదలైంది. అయితే కోదండరాంతో అధికార పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా టచ్‌లో ఉన్నారని తెలంగాణ జన సమితి వైపు నుంచి ప్రచారం మొదలైంది. అయినా కెసిఆర్‌కి వ్యతిరేకంగా మంత్రులు ఆయనతో విభేదించి బయటికొచ్చే పరిస్థితులు ఉన్నాయా ? అన్న చర్చ కూడా జరుగుతోంది. అటు ప్రధాన ప్రతిపక్షంతో తెలంగాణ జన సమితి కలిసి పనిచేస్తేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుంది. లేదంటే టిఆర్‌ఎస్ నెత్తినే పాలు పోసినట్లవుతుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర
ఇదిలా ఉంటే అటు కాంగ్రెస్ ఈ నెల ఒకటో తేదీ నుంచి రెండో విడత బస్సుయాత్ర మొదలెట్టింది. మొదటి విడతలో ఫిబ్రవరి 26న చేవెళ్లలో చేపట్టిన బస్సుయాత్ర మార్చి 3న హుజూరాబాద్‌లో ముగిసింది. మధ్యలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండో విడత యాత్ర చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మొదలైన ఈ బస్సుయాత్ర ఈ నెల పదో తేదీ వరకు సాగింది. వరంగల్‌లో యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ యాత్రలో సిఎం కెసిఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలు విమర్శలకు పదును పెట్టారు. 2, 3 రోజుల విరామం తర్వాత మరో విడత బస్సుయాత్రను చేపట్టనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
– సప్తగిరి
Link : http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80/ (