31, ఆగస్టు 2014, ఆదివారం

సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన వార్త


ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన వార్త


తెలుగు యూనివర్సిటీ స్నాతకోత్సవ దృశ్యాలు


తెలుగు యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో ఎం.ఫిల్ పట్టా పొందిన సందర్భం

తెలుగు యూనివర్సిటీ నుంచి ఎం.ఫిల్ జర్నలిజంలో పట్టా పొందిన అపూర్వ క్షణాలు





23, ఆగస్టు 2014, శనివారం

తెలంగాణ తొలి ప్రభుత్వ పయనమెటు?
















     దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వంలోని ప్రతినిధుల వ్యవహార శైలి గందరగోళంగా తయారైంది. ఎన్నో ఆశలతో ఏర్పాటైన కొత్త రాష్ట్రంలో ఆదిలోనే చోటు చేసుకుంటున్న పరిణామాలు మేధావులను, సామాన్య ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి.

    తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ పార్టీగా తనదైన ముద్రను వేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమీక్షలు, నిర్ణయాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ వివాదాలను తట్టి లేపుతున్నట్లు కనిపిస్తోంది.

    ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.సి.ఆర్. పలు సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. పనిలో పనిగా క్రిస్టియన్లకూ 3 శాతం రిజర్వేషన్ సదుపాయం కల్పించేలా కృషి చేస్తామని కొత్త హామీ ఇచ్చారు.

     కొంతకాలంగా అధికారంలోకి వస్తున్న నేతలు మెజార్టీ వర్గీయుల సంక్షేమం కంటే మైనార్టీలను ఆకట్టుకునే చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మైనార్టీల ప్రగతికి పాటుపడటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ అదేపనిగా సాధ్యం కాని ప్రయత్నాలు చేయడమే అభ్యంతరాలకు కారణమవుతున్నాయి. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తానంటూ మాటిచ్చేశారు. దానిమీద కసరత్తు కూడా చేశారు. అయితే, న్యాయస్థానం ఆ ప్రతిపాదనపై మొట్టికాయ వేసి, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు సరికాదని తేల్చి చెప్పింది. అయినా మరోసారి కె.సి.ఆర్. ముస్లింలకు, క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పిస్తానంటూ హామీలిస్తున్నారు.  మైనార్టీల మెప్పు పొందేందుకు రిజర్వేషన్లు మినహా మరో అవకాశం లేదా అన్న పశ్న ఉదయిస్తోంది.

    మైనార్టీలకు మేలు చేయాలంటే రిజర్వేషన్లు ఒక్కటే వాహకం కాదు. వారి సంక్షేమం కోసం మిగతా ఎన్నో రకాలుగా పాటుపడే అవకాశం ఉంది. మనసుంటే మార్గం ఉంటుందన్నట్లు వేరే మార్గాల్లో మైనార్టీ వర్గాల ఉన్నతికి, వారిలో జీవన ప్రమాణాల పెంపునకు శ్రమించవచ్చు. ఇక తెలంగాణ చరిత్రను తిరగేస్తే ఎవరి కారణంగా ఇక్కడి ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారో, ఇబ్బందులు పడ్డారో తెలుస్తుంది. వాటిని నెమరేసుకుంటే రిజర్వేషన్ల నిర్ణయం సమీక్షించుకునే పరిస్థితి వస్తుంది.

    ఇక ఈ టి.ఆర్.ఎస్. నేతల ప్రసంగాలు ప్రజలను భయపెట్టేలా, ఆలోచింపచేసేలా ఉంటున్నాయి. అసలు మనం భారత పౌరులమే కాదని సాక్షాత్తూ తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగుతున్న ఓ మంత్రి అన్న వ్యాఖ్యలు బాధపెట్టక మానవు. అలాగే తెలంగాణ అనేది రాష్ట్రం కాదు - ఇదొక ప్రత్యేక దేశం అని కె.సి.ఆర్. కుమార్తె, టి.ఆర్.ఎస్. ఎంపి కవిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలను గమనిస్తే అవి యాదృచ్ఛికమా, ముందస్తు వ్యూహమా లేక ప్రజలను గందరగోళంలో పడేయడమే లక్ష్యమా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో తమకోసం పోరాడిన ఉద్యమపార్టీ అధికారంలోకి రావాలని మన:స్ఫూర్తిగా టీ.ఆర్.ఎస్.కు పట్టం కట్టారు. కాని ప్రజల అభీష్టాల మేరకు నడుచుకుంటున్నామా? ఏదైనా సిద్ధాంతాల ప్రభావం ఉన్నదా? మెజార్టీ ప్రజల మెప్పుకోరే కార్యకలాపాలే నిర్వహిస్తున్నామా? అన్న అంశాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది.



20, ఆగస్టు 2014, బుధవారం

భారీగా నమోదైన తెలంగాణ జనాభా



              తెలంగాణలో కుటుంబాల సంఖ్య ఒక కోటి ఐదు లక్షలుగా నమోదైంది. జనాభా ఐదుకోట్లకు పైగానే ఉంటుందని తేలుతోంది. 2011 జనాభా లెక్కలను మించి కుటుంబాలు నమోదయ్యాయి. సమగ్ర కుటుంబ సర్వే.. రాష్ట్రంలోని కుటుంబాల లెక్కని పక్కా చేసింది. మొత్తం 1,05,76,922 కుటుంబాలను నమోదు చేసింది. 2011 జనగణనను అధిగమించి.. ఐదు కోట్లకు పైగా జనాభాను లెక్కలేసి చూపించింది. తెలంగాణలో 2011 గణాంకాల ప్రకారం 86.85 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ మూడేళ్లలో 19 లక్షలకు పైగా కుటుంబాలు పెరిగినట్టు సమగ్ర సర్వేలో తేలింది. హైదరాబాద్‌ను కలుపుకొని తెలంగాణ జిల్లాలన్నింటా ఇంకా  2 లక్షల 30 వేల 655 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది.  ఇక సర్వే ద్వారా సేకరించిన డేటా ఎంట్రీ కోసం జీహెచ్‌ఎంసీ మినహా తొమ్మిది జిల్లాల్లో 17 వేల 140 కంప్యూటర్‌లను వినియోగించుకోనున్నారు. 381 కేంద్రాల్లో డేటా ఎంట్రీ జరగనుంది.  అయితే.. హైదరాబాద్‌లో మాత్రం సర్వే లెక్క తప్పింది. 2011 జనాభాలెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 15,24,392 కుటుంబాలు నివసిస్తున్నాయి. జనాభాపరంగా 68,09,970 మంది ఉన్నట్టు జనగణన తేల్చింది. కానీ.. సమగ్రసర్వే పూర్తయితే హైదరాబాద్‌లో కుటుంబాల సంఖ్య 22,28,818కు చేరుకునే అవకాశం ఉంది. నగర జనాభా కోటి దాటుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి.

19, ఆగస్టు 2014, మంగళవారం

తెలంగాణలో సమగ్ర సర్వే సక్సెస్‌... సూపర్‌ హిట్‌! హైదరాబాద్‌లో లెక్క తప్పిన అంచనాలు










    తెలంగాణ సమగ్ర సర్వే విజయవంతమైంది..! జిల్లాల్లో ప్రజలు 95శాతానికి పైగా వివరాలు నమోదు చేసుకున్నారు.. ఎన్యుమరేటర్లకు సమాచారం ఇచ్చేందుకు ప్రజలందరూ ఆసక్తి చూపించారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా జిల్లాల్లో ఎన్ రోల్ మెంట్  భారీగా నమోదైంది. ఉదయం నుంచి రాత్రి వరకూ సర్వే కొనసాగింది. దేశ విదేశాల నుంచి సొంత పల్లెలకు తరలివచ్చిన జనం తమ వివరాలు నమోదు చేసుకున్నారు. మంగళవారం తెలంగాణ మొత్తం సర్వేమయమైంది. అందరి సహకారంతో గొప్ప అద్భుతం ఆవిష్కృతమైందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని చెప్పారు. సర్వే వివరాల ఆధారంగానే భవిష్యత్ పథకాలు రూపొందిస్తామని తెలిపారు. మరోవైపు.. ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

    సర్వే ద్వారా  ఇటు హైదరాబాద్‌లో, మొత్తం తెలంగాణలో జనాభా భారీగా పెరిగిందన్న విషయం వెల్లడైంది. ఇప్పటిదాకా 70  నుంచి 80లక్షల జనాభా ఉంటుందనుకుంటున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ జనాభా కోటి 20 లక్షల దాకా ఉండొచ్చని సమగ్ర సర్వే ద్వారా వెల్లడవుతోంది. అలాగే.. మొత్తం తెలంగాణ రాష్ట్రం జనాభా నాలుగున్నర కోట్లుగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

    రాష్ట్రంలోని దాదాపు కోటి కుటుంబాల వివరాలు ఒక్కరోజే నమోదు చేశారు. సర్వే సమాచారాన్ని వారం రోజుల్లో కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించే వెబ్‌సైట్లో వివరాలు ఉంచుతారు. సెప్టెంబర్‌ ఆరోతేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    అయితే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాత్రం అర్థరాత్రి దాటాక కూడా వివరాల నమోదు కొనసాగింది. ఉదయం నుంచి ఎన్యూమరేటర్లకోసం ఎదురుచూసిన జనం.. వాళ్లు కనిపించగానే ఆయా ప్రాంతాల్లో తమ వివరాలన్నీ నమోదు చేసుకునేదాకా ఎన్యూమరేటర్లను కదలనీయలేదు. దీంతో.. అర్థరాత్రి అయినా ఎన్యుమరేటర్లు అందరి వివరాలు నమోదు చేసుకోక తప్పలేదు.

18, ఆగస్టు 2014, సోమవారం

సకల జనుల సర్వే.. సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ మొత్తం సర్వేమయం







    సమగ్ర కుటుంబ సర్వే. తెలంగాణలోని పల్లెపల్లెనా.. ఇంటింటా ఇదే ముచ్చట! ఏ నలుగురు  కలిసినా.. ఇదే మాట! తెలంగాణ సర్కార్‌  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్వేకు సర్వం సిద్ధమైంది. పల్లె లోగిళ్లు  కొత్త కళ  సంతరించుకున్నాయి. సుమారు కోటి కుటుంబాలను సర్వే చేసేందుకు 4లక్షల మంది ఎన్యుమరేటర్లు సిద్ధమయ్యారు.  సర్వేకోసం రాష్ట్రంలో, దేశంలో ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణవాసులంతా అష్టకష్టాలు పడి మరీ సొంత ఊళ్లకు చేరుకున్నారు.  రైళ్లు,  బస్సులు సర్వే జనంతో కిటకిటలాడాయి.

    ఆదిలాబాద్‌ జిల్లాలో 747 లక్షల కుటుంబాల సర్వేకు 30వేల మంది ఎన్యుమరేటర్లు పనిచేస్తున్నారు.  మెదక్‌ జిల్లాలో 7.56లక్షల కుటుంబాల వివరాలు నమోదు చేసేందుకు 30వేల మంది ఎన్యుమరేటర్లను నియమించారు.  వరంగల్‌ జిల్లాలోని 10.15లక్షల కుటుంబాల సర్వేకోసం 43వేల మంది ఎన్యుమరేటర్లు, కరీంనగర్‌ జిల్లాలోని 9.86  లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు 34వేల మంది ఎన్యుమరేటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే  మహబూబ్‌నగర్‌ జిల్లాలో 9.74 లక్షల కుటుంబాల నమోదుకు 39వేల మంది ఎన్యుమరేటర్లు, నిజామాబాద్‌ జిల్లాలోని  7.5లక్షల కుటుంబాల సమాచార సేకరణకు 28వేల మంది ఎన్యుమరేటర్లు అవసరమవుతున్నారు. నల్గొండ జిల్లాలోని  10.42 లక్షల కుటుంబాల నమోదుకు 35వేల మంది ఎన్యుమరేటర్లు, రంగారెడ్డి జిల్లాలోని 7.89లక్షల  కుటుంబాలకు సంబంధించిన సమాచారం క్రోడీకరించేందుకు 28వేల మంది ఎన్యుమరేటర్లు, ఖమ్మం జిల్లాలోని 8.77  లక్షల కుటుంబాల వివరాల నమోదుకు 29వేల మంది ఎన్యుమరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌  పరిధిలో 20లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు 75వేల మంది ఎన్యుమరేటర్లను నియమించారు. సమగ్ర సర్వేలో  హైదరాబాద్ పోలీసులు కూడా భాగస్వాములు అవుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు వేల మంది పోలీసులు  ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహించనున్నారు.

    సకల జన సర్వే సందర్భంగా తెలంగాణలో సర్వం బంద్‌ కానున్నాయి. గుళ్లు, బళ్లు, బస్సులు,  సినిమా హాళ్లు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు, రైతు బజార్లు సహా  కోర్టుల దాకా అన్నింటికీ బంద్‌ ప్రకటించారు. నిత్యావసరాలైన  గ్యాస్‌, రేషన్‌ దుకాణాలూ మూత పడుతున్నాయి. అయితే.. ఆర్టీసీ బస్సులు నడుస్తాయా, లేదా అన్నవిషయంలో  మాత్రం సందిగ్ధం నెలకొంది. కార్మికులు తాము సర్వేలో పాల్గొనేందుకు స్వస్థలాలకు వెళ్లాలని, సెలవు ప్రకటించాలని  కోరినా.. పై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు కరువయ్యాయి. హైదరాబాద్‌లో మాత్రం ఉదయం 5నుంచి  10గంటల వరకు, సాయంత్రం బస్సులు నడవనున్నాయి.

    సర్వే పూర్తికాగానే రికార్డులన్నీ రాత్రికి రాత్రే  సీజ్‌ చేసి, భద్రపరుస్తారు.  సర్వే  పూర్తికాగానే... డేటా  ఎంట్రీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 6వ తేదీలోగా గ్రామాల వారీగా చిట్టా  తీయనున్నారు. ఈ డేటా  ఆధారంగా సెప్టెంబర్‌లో పథకాలపై వ్యూహ రచన చేస్తారు.

    మరోవైపు.. రాష్ట్ర విభజనలో ఆంధ్రావైపు వెళ్లిన ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాల్లో  సమగ్ర  కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఖమ్మం జిల్లా యంత్రాంగం ముంపు మండలాల్లో సర్వే  నిర్వహించేందుకు  సమగ్ర ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్‌  చింతూరు, కూనవరం,  వరరామచంద్రాపురం, వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం పట్టణం మినహా మండలం,  బూర్గంపాడు  మండలంలోని ఆరు గ్రామపంచాయతీల్లో సర్వేను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

10, ఆగస్టు 2014, ఆదివారం

రాఖీ పండుగ అంటే రక్షా బంధనం.. అనుబంధాల ఆలింగనం







    సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి అసలైన నిర్వచనం రక్షాబంధనం. రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్‌, రాఖీల పండుగ ఎలా పిలిచినా.. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధం మరింత ధృడంగా మార్చే పర్వదినం. చిన్న వయసులో ఒకే ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల చెంతన ఒకే గూటి పక్షులుగా.. కలిసి మెలిసి, ఆడుతూ, పాడుతూ పెరిగిన అక్కలు, చెల్లెండ్లు, అన్నలు, తమ్ముళ్లు.. ఆ తర్వాత తలో దిక్కుకు వెళ్లడం అనివార్యమవుతుంది. పెద్దయ్యాక ఎవరి జీవితాలు వారివిగా మారతాయి. కుటుంబాలు మారిపోతాయి. అన్నా తమ్ముళ్లు పుట్టింట్లోనే ఉంటే.. అక్కా చెల్లెళ్లు మెట్టినింటికి పంపించబడతారు. దాదాపు 20యేళ్లు ఒక్కచోట, ఒక్కింట్లో, తల్లిదండ్రుల చెంతన బతికిన వాళ్లు.. ఆ జ్ఞాపకాలను నెమరేసుకోవడం, పండుగలు, శుభకార్యాలకు గానీ కలవక పోవడం సర్వసాధారణమవుతుంది. ఎవరి జీవితాలు వాళ్లవి, ఎవరి బరువు బాధ్యతలు వాళ్లవి, ఎవరి కుటుంబం వాళ్లకు వేర్వేరవుతాయి. అయితే.. సోదర సోదరీమణుల మధుర జ్ఞాపకాలను నెమరేసుకునే అద్భుత సందర్భం రాఖీ పండుగ. చిన్నప్పుడు అల్లరిగా, బాధ్యతలు తెలియని సమయంలో చేసిన సహవాసం.. పెద్దయ్యాక బరువు బాధ్యతలు తెలిశాక కలిగే ఆప్యాయత మాటల్లో చెప్పలేం. ఆ అనుభూతులను వర్ణించలేం. ఆ మధుర క్షణాలను స్వయంగా అనుభవించాల్సిందే...

    రాఖీ పౌర్ణమి ప్రాశస్త్యంపై అనేక కథనాలు నానుడిలో ఉన్నా వాటి అంతిమ లక్ష్యం మాత్రం సోదరీ సోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతలే. నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష అంటూ సోదరీమణులు రాఖీలు కడతారని, సోదరికి ఎల్లవేళలా సోదరులు రక్షగా ఉండాలన్నది ఇందులోని పరమార్థం అని చెబుతారు. ప్రత్యేకంగా రాఖీ పండుగ ప్రాముఖ్యతపై చారిత్రక కథనాలు, రాజుల కాలం నాటి కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఎనీ హౌ.. రాఖీ పండుగ శుభాకాంక్షలు.

    ఇక.. ఇవాళ రాఖీ పండుగ అనగానే చిన్నారులు హంసిని, సహస్ర ఉత్సాహంగా నిద్ర లేచారు. నిన్న రాత్రి తెచ్చిన డోరేమాన్‌ రాఖీలు చూపించా. మరి.. చోటా భీమ్‌ రాఖీలెందుకు తేలేదన్న వాళ్ల ప్రశ్నలకు ఖంగు తినడం నావంతైంది. ఎందుకంటే.. వాళ్లు డోరేమాన్‌ కన్నా.. చోటాభీమ్‌ ప్రోగ్రామ్స్‌లోనే నిత్యం మునిగి తేలతారు. డోరేమాన్‌ ప్రోగ్రామ్స్‌ చూడటం అంతంతమాత్రమే. అయినా.. నా అంచనా పిల్లల ఆలోచనలకు కాస్త దగ్గరగానే ఉన్నందుకు సంతోషం అనిపించింది. ఎందుకంటే.. ఆఫీసునుంచి ఇంటికెళ్లే సమయంలో రాత్రి 11 గంటలకూ.. మార్కెట్లో చాలా రకాల రాఖీలున్నా... సంప్రదాయ రాఖీలను కాదని డోరేమాన్‌ రాఖీలు కనిపించగానే తీసుకెళ్లా... పిల్లలు సంబరపడతారని.  కానీ.. చోటాభీమ్‌ రాఖీలకోసం ప్రశ్నిస్తారని మాత్రం ఊహించలేకపోయా...