సమగ్ర కుటుంబ సర్వే. తెలంగాణలోని పల్లెపల్లెనా.. ఇంటింటా ఇదే ముచ్చట! ఏ నలుగురు కలిసినా.. ఇదే మాట! తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్వేకు సర్వం సిద్ధమైంది. పల్లె లోగిళ్లు కొత్త కళ సంతరించుకున్నాయి. సుమారు కోటి కుటుంబాలను సర్వే చేసేందుకు 4లక్షల మంది ఎన్యుమరేటర్లు సిద్ధమయ్యారు. సర్వేకోసం రాష్ట్రంలో, దేశంలో ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణవాసులంతా అష్టకష్టాలు పడి మరీ సొంత ఊళ్లకు చేరుకున్నారు. రైళ్లు, బస్సులు సర్వే జనంతో కిటకిటలాడాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 747 లక్షల కుటుంబాల సర్వేకు 30వేల మంది ఎన్యుమరేటర్లు పనిచేస్తున్నారు. మెదక్ జిల్లాలో 7.56లక్షల కుటుంబాల వివరాలు నమోదు చేసేందుకు 30వేల మంది ఎన్యుమరేటర్లను నియమించారు. వరంగల్ జిల్లాలోని 10.15లక్షల కుటుంబాల సర్వేకోసం 43వేల మంది ఎన్యుమరేటర్లు, కరీంనగర్ జిల్లాలోని 9.86 లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు 34వేల మంది ఎన్యుమరేటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో 9.74 లక్షల కుటుంబాల నమోదుకు 39వేల మంది ఎన్యుమరేటర్లు, నిజామాబాద్ జిల్లాలోని 7.5లక్షల కుటుంబాల సమాచార సేకరణకు 28వేల మంది ఎన్యుమరేటర్లు అవసరమవుతున్నారు. నల్గొండ జిల్లాలోని 10.42 లక్షల కుటుంబాల నమోదుకు 35వేల మంది ఎన్యుమరేటర్లు, రంగారెడ్డి జిల్లాలోని 7.89లక్షల కుటుంబాలకు సంబంధించిన సమాచారం క్రోడీకరించేందుకు 28వేల మంది ఎన్యుమరేటర్లు, ఖమ్మం జిల్లాలోని 8.77 లక్షల కుటుంబాల వివరాల నమోదుకు 29వేల మంది ఎన్యుమరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు 75వేల మంది ఎన్యుమరేటర్లను నియమించారు. సమగ్ర సర్వేలో హైదరాబాద్ పోలీసులు కూడా భాగస్వాములు అవుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు వేల మంది పోలీసులు ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహించనున్నారు.
సకల జన సర్వే సందర్భంగా తెలంగాణలో సర్వం బంద్ కానున్నాయి. గుళ్లు, బళ్లు, బస్సులు, సినిమా హాళ్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు, రైతు బజార్లు సహా కోర్టుల దాకా అన్నింటికీ బంద్ ప్రకటించారు. నిత్యావసరాలైన గ్యాస్, రేషన్ దుకాణాలూ మూత పడుతున్నాయి. అయితే.. ఆర్టీసీ బస్సులు నడుస్తాయా, లేదా అన్నవిషయంలో మాత్రం సందిగ్ధం నెలకొంది. కార్మికులు తాము సర్వేలో పాల్గొనేందుకు స్వస్థలాలకు వెళ్లాలని, సెలవు ప్రకటించాలని కోరినా.. పై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు కరువయ్యాయి. హైదరాబాద్‌లో మాత్రం ఉదయం 5నుంచి 10గంటల వరకు, సాయంత్రం బస్సులు నడవనున్నాయి.
సర్వే పూర్తికాగానే రికార్డులన్నీ రాత్రికి రాత్రే సీజ్ చేసి, భద్రపరుస్తారు. సర్వే పూర్తికాగానే... డేటా ఎంట్రీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 6వ తేదీలోగా గ్రామాల వారీగా చిట్టా తీయనున్నారు. ఈ డేటా ఆధారంగా సెప్టెంబర్‌లో పథకాలపై వ్యూహ రచన చేస్తారు.
మరోవైపు.. రాష్ట్ర విభజనలో ఆంధ్రావైపు వెళ్లిన ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాల్లో సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఖమ్మం జిల్లా యంత్రాంగం ముంపు మండలాల్లో సర్వే నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం పట్టణం మినహా మండలం, బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామపంచాయతీల్లో సర్వేను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి