10, జులై 2013, బుధవారం

నరరూప రాక్షసుల నెత్తుటి దాహం

నరరూప రాక్షసుల నెత్తుటి దాహం


భాగ్యనగరం దద్దరిల్లింది. నిలువెల్లా గాయమై వణికింది. ముష్కర చర్యకు మూగసాక్షిగా నిలిచింది. ఐదేళ్ల కిందటి అమానుష నెత్తుటి క్రీడకు మరోసారి వేదికైంది. ఆనాటి గోకుల్ ఛాట్. లుంబినీ పార్కు పేలుళ్లు ఇంకా కళ్లల్లో కదలాడుతుండగానే ముష్కర మూకలు దిల్ సుఖ్ నగర్ రద్దీ కూడలిలో జంట బాంబులు పేల్చి మరోసారి రక్తదాహాన్ని తీర్చుకున్నాయి. పదుల సంఖ్యలో సామాన్యులను క్షతగాత్రులుగా మార్చారు. ఎంతోమందిని అంగవికలురుగా మార్చేశారు. మొత్తానికి మానవత్వం తల్లడిల్లేలా అమానుష కాండకు తెగబడ్డారు. 

2013 ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి 7 గంటల ఒక్క నిమిషం. నిత్యం మాదిరిగానే జనం ఎవరి హడావిడిలో వాళ్లున్నారు. కొందరు ఆఫీసుల్లో పనులు ముగించుకొని ఇళ్లకు తిరుగు పయనంలో ఉన్నారు. యువకులు కోచింగ్ క్లాసుల నుంచి హాస్టళ్లకు, రూములకు బయలు దేరారు. వాళ్లలో కొందరు అనారోగ్యంతో ఆస్పత్రి పనుల మీద వస్తే, మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్లే పనిలో ఉన్నారు. ఇంకొందరు అయితే అలా దారిలో వెళ్తున్నారు. వీళ్లెవరికీ మత విద్వేషాలు లేవు. ఎవరికీ ఎవరిమీదా పగ, ద్వేషం లేదు. ఉగ్రవాదులంటే ఎవరో కూడా చాలామందికి తెలియదు. అందరూ అమాయకులే. వాళ్లలో చాలామంది ఇక్కడే పుట్టిపెరిగిన వాళ్లు కాదు. ఏదో రాష్ట్ర రాజధాని కదా, అవకాశాలు, అవసరాల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్లు. వాళ్లకు తెలిసి ఏ పాపం చేసి ఉండరు. కానీ! ఆ క్షణంలో ఆ పరిసరాల్లో ఉండటమే వాళ్లు చేసిన పాపం. ఒక్కసారిగా చెవులు చిల్లులు పడేలా శబ్దం. చుట్టుపక్కల కొద్ది దూరం వరకూ భారీ శబ్దం. ఏం జరిగిందో తెలియదు. కానీ ఏదో జరిగింది. అంతలోనే ఆర్తనాదాలు. అరుపులు కేకలు. నెత్తుటి ముద్దలై చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు. అంత భయానక పరిస్థితుల్లోనూ సమీపంలో ఉన్న వాళ్లంఆ బాంబు పేలిన శబ్దం వచ్చిన వైపు పరుగులు తీశారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే, ఆ సమీపంలోనే మరో భారీ శబ్దం. పేలిన మరో బాంబు. అక్కడున్న కొద్దిమందిలో తప్ప చాలామందిలో వణుకుగానీ, జణుకుగానీ లేదు. చనిపోయిన వాళ్లు కళ్లముందే కనిపిస్తున్నారు. బీతావహ దృశ్యాలు కలచివేస్తున్నాయి. అయినా బాధతో అరుస్తున్న వాళ్లను రక్షించే యత్నం. దగ్గర ఏ వాహనం కనబడితే ఆ వాహనంలో క్షతగాత్రులను తీసుకొచ్చి పడేస్తున్నారు. మరోవైపు 108 వాహనాల్లోనూ ఇంకొందరు క్షతగాత్రుల తరలింపు. అంతా ఓ రకంగా సినీ ఫక్కీలో జరిగిపోయింది.

2007లో జరిగిన పేలుళ్ల సమయంలోనే దిల్ సుఖ్ నగర్ ను ఓ లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు, గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో బాంబులు పేల్చిన తరువాత అదే తరహా బాంబును దిల్ సుఖ్ నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇప్పుడు అమర్చినట్లే ఓ సైకిల్ కు బాంబును తగిలించారు టెర్రరిస్టులు. అయితే ఆ సమయంలో ఆ కూడలిలో ఉన్న వాళ్లెందరికో భూమిమీద నూకలు ఉండబట్టి ముందే పసికట్టారు. బాంబు నిర్వీర్య బృందం అక్కడ పెట్టిన బాంబును పేలకుండా చేయడంలో సఫలీకృతమైంది. నరరూప రాక్షసుల ఆ నెత్తుటి దాహం ఇప్పుడు ఇలా తీరింది. దిల్ సుఖ్ నగర్ లక్ష్యం పూర్తి అయింది.

ఈ బాంబు పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. జాతీయ భద్రతా దళాలు దర్యాప్తు రంగంలోకి దిగాయి. ఘటన జరిగిన కాసేపటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. ఇంకోవైపు ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హైదరాబాద్ కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అయితే.. ఇవన్నీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారయ్యాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేలుళ్లకు అవకాశాలున్నట్లు తాము ముందే హెచ్చరించామని కేంద్రం చెబితే, అవి నిత్యం వచ్చే సాదారణ హెచ్చరికలుగా భావించామని రాష్ట్రం చెబుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదనే విషయం ఇలా అనేక సందర్భాలలో ఋజువయ్యింది. ఇప్పుడు కూడా అదే కనబడుతోంది. ఉగ్రవాద నిర్మూలన వంటి అతి భయంకర జాతీయ సమస్యపై కూడ ఇలా పొంతన లేనితనంతో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాలను ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- హంసినీ సహస్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి