10, జులై 2013, బుధవారం

పాక్-బంగ్లాలలో అనిశ్చిత స్థితిలో ప్రజాస్వామ్యం


అఖండ భారతదేశం నుండి విడిపోయిన రెండు ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో జరుగుతున్న పరిణామాలు మనకు ఆందోళన కలిగిస్తునాయి. ఈ దేశాల్లో తరచూ తలెత్తుతోన్న అంతర్గత సంక్షోభాలు మనదేశంపై కూడా ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా మనకు సంబంధం లేకున్నా భవిష్యత్ పరిణామాల దృష్ట్యా వాటి గురించి చర్చించుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది.  

అటు పాకిస్తాన్ లోనూ, ఇటు బంగ్లాదేశ్ లోనూ ప్రజాస్వామ్యం అంతగా పరిడవిల్లిన  దాఖలాలు చాలా తక్కువ. ఈ రెండు దేశాల్లోనూ పౌరపాలన కన్నా సైన్యందే పైచేయి. ఆ సైన్యంలోనూ జీహాదీ వంటి మతోన్మాద శక్తులదే పైచేయిగా ఉంటోంది. బంగ్లాదేశ్ లో పౌర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడింది ఓ ప్రముఖ మతోన్మాద సంస్థతో సంబంధం ఉన్న సైనికాధికారులే. ఆ సైనికాధికారుల్లోని విభేదాలతో అదే సైన్యం ఈ కుట్రను బట్టబయలు చేసింది.

1999లో జరిగిన కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకులు సైనిక పాలకులే. అంతకుముందు పౌర ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కిన సైన్యం కార్గిల్ చొరబాట్లకు పాల్పడింది. వీటన్నింటి వెనుకా ఇస్లామిక్ తీవ్రవాదుల కుయుక్తులున్నాయనడం బహిరంగ రహస్యమే. ఎందుకంటే ఐ.ఎస్.ఐ. అనేది పాకిస్తాన్ సైన్యంలోని ఒక విభాగం. 

పాక్ సైన్యం జిహాదీ ఉగ్రవాదులతో చేయి కలిపిందన్నది బహిరంగ రహస్యమే. గతేడాది అమెరికా సైన్యం తుదముట్టించిన లాడెన్ స్థావరం పాక్ సైనిక స్థావరానికి అతి సమీపంలో ఉండడమే దీన్ని బలపరుస్తోంది. ఈ పరిణామంతో పాక్ సైన్యం పరిస్థితి కాలుగాలిన పిల్లిలా తయారైంది. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కన్నా మతోన్మాదమే బలంగా పని చేస్తోందన్న దానికి ఉదాహరణలు కోకొల్లలు. దేశ పాలకులనే ఆదేశించే స్థాయిలో పాక్ సైన్యం ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అక్కడ పౌర ప్రభుత్వాలను దెబ్బతీసే ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

పాకిస్తాన్ సైనిక పాలనలో మ్రగ్గిన కాలఖండం : 

1958లో మొదటిసారి పాకిస్తాన్ లో సైన్యం తిరుగుబాటు చేసి పాలన చేజిక్కించుకుంది.
  • 1958-71 - మొదట అయూబ్ ఖాన్, ఆ తదుపరి ఆయాఖాన్ పాలన కొనసాగించారు.
  • 1978-88 - జియా-ఉల్-హక్ పాలించాడు.
  • 1999-2002 - పర్వేజ్ ముషారఫ్ అధికారం చెలాయించాడు.
  • 2012లో మరోసారి సైనిక పాలన దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తున్నది. 
తాజాగా ఆపరేషన్ లాడెన్ కు ప్రస్తుత పౌర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని పాక్ సైన్యం దానిపై ఆగ్రహంతో ఉంది. అందుకే తమ ప్రాతినిధ్యాన్ని కాపాడుకొనేందుకు మరోసారి సైనిక పాలన కోసం ప్రయత్నిస్తోంది.
ఈ పరిస్థితులు మనదేశంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఇస్లామిక్ తీవ్రవాదుల టార్గెట్ భారత్. ఆ శక్తులకు అండదండలు అందిస్తున్నవారు పాక్, బంగ్లాదేశ్ సైన్యాధికారులు. వారి వల్లనే అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ లో పాలకుల, సైనికాధికారుల బలం భారత్ ను వ్యతిరేకించడంలో ఉంది. భారత్ లోని రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి రావాలంటే మైనార్టీ వర్గాలను సంతృప్తి పరచటం, వారిని తమ వైపు ఉంచుకోవాలనే భ్రమలో ఉన్నారు. అటు పాక్ పాలకులు, ఇతి భారత్ పాలకుల వ్యవహారంతో భారత్ భద్రతకు ఎప్పుడూ సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. 
- హంసిని 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి