10, జులై 2013, బుధవారం

అధికార పార్టీ వత్తిడులకు తలొగ్గుతున్న మీడియా ?

నేటి సమాచార విప్లవంలో మీడియా అత్యుత్సాహంతో పాటు అచేతన స్థితిని కూడా ప్రస్తావించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అనవసర అంశాలు, ప్రాధాన్యత లేని విషయాలపై చెవులు ఊదర గొట్టేలా అత్యుత్సాహం ప్రదర్శించడం ఒకప్రక్క, మరోప్రక్క కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకూ సంబంధించిన అంశాలపై నాన్చుడు ధోరణి ప్రదర్శించడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. 
2జి కేసులో మీడియా ప్రశంసనార్హమైన పాత్రనే పోషించినా.. దాని వెనుక జనతా పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్య స్వామి చొరవ ఎంత ఉందో కనీస జ్ఞానం ఉన్నవారెవరైనా చెప్పేస్తారు. అనివార్యంగా మీడియాలో ఈ కేసు గురించి ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే అందులోనూ కేంద్ర మంత్రి రాజా వెనకున్న పెద్దల గురించి మీడియా పట్టించుకున్న పాపాన పోలేదు.
అలాగే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యవహారం ఎంత తీవ్రమైనదో తెలిసికూడా మీడియా నోరు మెదపలేదంటే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. అభిషేక్ సింఘ్వీ ఒక మహిళతో శృంగారంలో పార్గొన్న వీడియో ఇంటర్ నెట్ లో షికార్లు చేసినా ప్రభుత్వం గానీ, సంబంధిత అధికారులు గానీ పోలీసులు గానీ కనీసం స్పందించలేదు. అధికార పార్టీలో ప్రముఖ హోదాలో కొనసాగుతూ ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టడం దేశ ప్రతిష్టను దిగజార్చడమే అన్నది నిర్వివాదాంశం. అయినా దానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత మీడియా ఇవ్వక పోవడం వెనుక కారణాలేమై ఉంటాయో ఎవరికీ వారే ప్రశ్నించుకోవడం తప్ప మరోమార్గం లేదు. మరో రెండు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయనగా  ఈ తతంగం బట్టబయలు కావడంతో యుపిఎ హడావిడిగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సింఘ్వీచే అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేయించి, ఈ అంశాన్ని కప్పి పుచ్చేందుకు శత విధాలా ప్రయత్నించి ఫలితం సాధించింది.
ఇక బిజెపి నేత బంగారు లక్ష్మణ్ అంశానికి వస్తే మీడియా మరోసారి జూలు విదిల్చింది. పదేళ్ళ క్రితమే ఈ ఘటనపై ఊదరగొట్టిన మీడియా ఇప్పుడు మళ్ళీ కోర్టు తీర్పు వెలువడగానే కొత్తగా ఈ ఘటన బయట పడినంత హడావిడి చేసింది. అనవసర ప్రాధాన్యత నిచ్చింది.
ఈ పరిణామాల వెనుక ప్రభుత్వ పెద్దల, మీడియా పెద్దల హస్తం దాగున్నదని నిపుణుల మాట. మనకు తెలియకుండానే ఓ వర్గంపై, మెజార్టీ జనం ఆకాంక్షలపై రహస్య దాడులు జరుగుతున్న సూచనలు గోచరిస్తున్నాయి.
- హంసినీ సహస్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి