17, నవంబర్ 2017, శుక్రవారం

నేటి చదువుల లక్ష్యమేమిటి ? మన చిన్నారుల పయనమెటు ?



పోటీ ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక పోతున్నారా..? ఉన్నత చదువులను తట్టుకోలేక పోతున్నారా..? ఒత్తిళ్లను జయించలేకపోతున్నారా..? విద్యార్థుల అదశ్యాలు, ఆత్యహత్యలు ఏం చెబుతున్నాయి..? ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు కారణమవుతున్నాయి..? తప్పు విద్యార్థులదా..? చదువు చెప్పే ఉపాధ్యాయులదా..? లేదంటే.. ఓరకమైన వాతావరణం ఆవరించిన కార్పొరేట్‌ కాలేజీలదా..? కొన్నేళ్లుగా ఈ చర్చ సాగుతున్నా.. గడిచిన నెలరోజులుగా మాత్రం తీవ్రమైంది. ఆందోళనకరస్థాయిలో విద్యార్థుల ఆత్మహత్యలు, అద శ్యాలు కొనసాగు తున్నాయి. అటు.. పేరెంట్స్‌ను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. 

ఏం జరుగుతోంది ?
గడిచిన నెలరోజుల్లోనే చదువు ఒత్తిడి భరించలేక ఏడెనిమిది మంది విద్యార్థులు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా చదువు చట్రంలో నుంచి బయటపడేందుకు ఇళ్ల నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు. అందరూ కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుతున్న వాళ్లే. లక్షలు పోసి చదివిస్తున్న తల్లి దండ్రులు.. పిల్లలు ఇలా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. వాళ్ల భవిష్యత్తు ఏమైపోతోందన్న భయంలో పడిపోతున్నారు. 
అదశ్యమే కాదు.. ఆత్మహత్యలు కూడా...
ఇళ్లలోనుంచి అదశ్యమవడం ఒక్కటే కాదు.. లోకంపోకడ కూడా తెలియని వయసులోనే బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు విద్యార్థులు. కొందరు ఇళ్లల్లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరైతే కాలేజీల్లో, కాలేజీ హాస్టళ్లలోనే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్న వాళ్లకు కడుపుకోత మిగిలిస్తున్నారు. అప్పటికప్పుడు అలజడి చెలరేగడం, పేరెంట్స్‌, బంధువులు నిలదీయడం, దేనికైనా రెడీ అనుకునే కాలేజీలు సెటిల్‌మెంట్స్‌ చేసుకోవడం గుట్టుగా జరిగిపోతు న్నాయి. పేరున్న, పెద్ద కార్పొరేట్‌ విద్యాసంస్థల్లోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగు తుండటంతో.. ఈవార్తలు మీడియాలోకూడా రావడం లేదు. ఎందుకంటే లక్షల రూపాయల వ్యాపార ప్రకటనలు ఈ వాస్తవాలను కమ్మేస్తున్నా యన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.

ఏది చదువు..? 
చదువంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలి. చదువంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి. చదువంటే.. ఆ మనిషి వ్యక్తిత్వానికి పరిపూర్ణతను తీసుకురావాలి. మొత్తానికి వాళ్ల జీవితానికి ఓ అర్థంగా మారాల్సింది చదువు. కానీ.. ఇప్పుడు ఈ పరిస్థితులు లేవు. వీటికి అర్థమేంటో కూడా ఇప్పటి విద్యార్థులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. 
ఇప్పుడెలా ఉన్నాయి..? 
ఇప్పుడు.. చదువంటే పాఠ్యపుస్తకాలు, చదువంటే పరీక్షల్లో వస్తాయనుకున్న ప్రశ్నలకు జవాబులను మాత్రమే బట్టీ పట్టడం, చదువంటే రోజులో 18 గంటలు కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం, చదువంటే పరీక్షలయ్యేదాకా ఓ భవనంలో బందీగా మారడం, చదువంటే బయటి ప్రపంచాన్నే కాదు.. కనీసం సూర్యుడి వెలుగు కూడా చూడకపోవడం, చదువంటే విద్యార్థి చదివే విద్యాసంస్థ కబంధ హస్తాల్లో నలిగిపోవడం, మొత్తానికి చదువంటే పరమార్థం ర్యాంకులు... ఇదీ ఇప్పుడున్న విద్యావిధానం. 
బాధ్యులెవరు..?
పోటీ ప్రపంచమే లోకంగా వ్యాపార సామ్రాజ్యంలో మనుగడ సాగిస్తున్న కార్పొరేట్‌ సంస్థలు ర్యాంకులు మినహా ఏమీ పట్టించుకోవడం లేదు. విద్యార్థులను కనీసం కంటినిండా నిద్ర కూడా పోనివ్వడం లేదు. హాస్టళ్లలో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఇవ్వడం లేదు. నిద్ర లేచింది మొదలు తిరిగి రాత్రి పడుకునే దాకా.. చదువు.. చదువు.. చదువు.. తప్ప ఇంకే అంశానికీ చోటివ్వడం లేదు. మార్కులు, ర్యాంకులు అంటూ చిన్నారులపై తమ లక్ష్యాలను రుద్దుతున్నారు. విద్యార్థుల పరిస్థితి, పరిజ్ఞానం గుర్తించకుండా ర్యాంకులకోసం వేధింపులవల్లే.. ఇలాంటి సంఘట నలు జరుగుతున్నాయన్నది కాదనలేని నిజం. 
తిలాపాపం.. తలా పిడికెడు..!
ఇదే సమయంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా చర్చనీయాంశంగా మారుతోంది. కేవలం సంస్థల పేరు ప్రఖ్యాతులు చూడటం, ఎంత ఎక్కువ ఫీజు వసూలు చేస్తే.. అక్కడ అంత బాగా చదువు చెబుతారన్న ఓ తప్పుడు ఆలోచనల్లో మునిగిపోవడం చిన్నారులకు గండంగా మారుతోంది. మొత్తానికి ఇలాంటి సంఘటనలు తీవ్ర కలకలం                సష్టిస్తున్నాయి. కళాశాలల్లో వ్యవహారశైలి, ఇళ్లల్లో పేరెంట్స్‌ బాధ్యతపై చర్చను లేవనెత్తుతున్నాయి. 
- హంసిని సహస్ర సాత్విక
లోకహితం నవంబర్‌ నెల సంచికలో ప్రచురితం 
http://www.lokahitham.net/2017/11/blog-post_35.html

21, అక్టోబర్ 2017, శనివారం

సిపాయిల తిరుగుబాటులో వీరనారీలు లక్ష్మీబాయి, ఝల్కారీబాయి (స్ఫూర్తి మాసపత్రిక నవంబర్‌ 2017)

సిపాయిల తిరుగుబాటులో వీరనారీలు
లక్ష్మీబాయి, ఝల్కారీబాయి
--------------------------------------------

                            - సప్తగిరి M.Phil (Journalistm)
                            సీనియర్‌ జర్నలిస్టు
                            శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి

    భారతమాత స్వేచ్ఛావాయువుల కోసం పరితపించిన చరితార్థుల గురించి స్ఫూర్తిలో చెప్పుకుంటున్నాం. ఆ దారిలో ఇది మూడో అడుగు. నవంబర్‌ నెల రాగానే.. చాచా నెహ్రూ గుర్తొస్తారు. బాలల దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. దేశానికి దాస్యశృంఖలాలు తొలగిపోయిన తర్వాత తొలి ప్రధానిగా పనిచేసిన జవహర్‌లాల్‌నెహ్రూ గురించి ప్రతియేటా చెప్పుకుంటున్నాం. అయితే.. అందుకు భిన్నంగా ఈసారి ఇద్దరు మహిళా మణిమకుటాల గురించి తెలుసుకుందాం. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఆమె సైన్యంలోని 'దుర్గావాహిని' మహిళా సాయుధ దళానికి నేతృత్వం వహించిన ఝల్కారీ బాయి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే.. ఈ ఇద్దరు పుణ్య మాతలు జన్మించింది నవంబర్‌ నెలలోనే...

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి :
-------------------------
    మరాఠా యోధుల పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ అనే రాజ్యానికి రాణి లక్ష్మీబాయి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం తొట్టతొలిగా వినిపించే పేరు లక్ష్మీబాయి.

    ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరములో మహారాష్ట్ర కు చెందిన ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో జన్మించింది. పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835వ సంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం.  మణికర్ణిక నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే తల్లి కన్ను మూసింది. తండ్రి సంరక్షణలో కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యల్లో ఆరితేరింది.

    లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్‌తో వివాహం జరిగింది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. 1857లో లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇచ్చింది. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.  ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారే. జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. రాణి లక్ష్మీబాయి 1858, జూన్ 17వ తేదీన గ్వాలియర్ యుద్ధంలో మరణించింది. ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.

ఝల్కారీబాయి :
------------------
    ఇక..  ఇప్పటిదాకా మనం వినని ఝల్కారీబాయి గురించి తెలుసుకుందాం... ఝల్కారీబాయి భారతీయ మహిళా సైనికురాలు. 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఝాన్సీ యుద్ధంలో ప్రముఖపాత్ర పోషించింది. ఈమె ఝాన్సీ లక్ష్మీబాయికి అత్యంత ప్రీతిపాత్రమైన 'దుర్గావాహిని' మహిళాసాయుధ దళ నాయకురాలు.

    భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, 'ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం'గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాం తంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో ఇప్పటికీ గుర్తుచేసుకోవడం విశేషం.

    ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలీలైన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు 1830 నవంబర్ 22న జన్మించింది ఝల్కారిబాయి. వీరనారిగా ఎదిగి, నేడు ఆ ప్రాంతంలో దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న ఝల్కారిపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను వివాహం చేసుకుంది ఝల్కారిబాయి.

    1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్‌రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది.

                            - సప్తగిరి M.Phil (Journalistm)
                            సీనియర్‌ జర్నలిస్టు
                            శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి
 

దేశమాత విముక్తి కోసం.. మత విశ్వాసాలనే త్యజించిన భగత్‌సింగ్‌ (స్ఫూర్తి మాసపత్రిక అక్టోబర్‌ 2017)


దేశమాత విముక్తి కోసం..  మత విశ్వాసాలనే త్యజించిన భగత్‌సింగ్‌

- సప్తగిరి, ఎం.ఫిల్‌ (జర్నలిజం)

    మానవులు పుడతారు.. చనిపోతారు. కొంతమంది మాత్రమే తమ కుటుంబం కంటే సమాజం కోసం ఎక్కువగా శ్రమిస్తారు. కొందరు తమ జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి చిరస్థాయిగా నిలిచిపోతారు. వాళ్లను 'మహానుభావులు' అంటాం. వందల కోట్ల మందిలో పదుల సంఖ్యలో మాత్రమే ఇలాంటివాళ్లు ఉంటారు.

    1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది మన భారతదేశం. భారతావనికి స్వేచ్ఛా వాయువులు అందించేందుకు వందల సంవత్సరాలు పోరాటం జరిగింది. లక్షల మంది మహనీయులు ఈ పవిత్ర కార్యంలో సమిధలయ్యారు. ప్రధానంగా బ్రిటిష్‌ పాలన సమయంలో భారతీయులు స్వాతంత్ర్యం కోసం ఎక్కడికక్కడ చేసిన పోరాటాలు మహోన్నతమైనవి. వాటిని కొనియాడకుండా ఉండలేం. వారిలో కొందరైతే చిన్న వయసులోనే స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు.

    ఈ నెల స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్‌ భగత్‌సింగ్‌ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భారత స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో భగత్‌సింగ్‌ ఒకరు. ఈ కారణంగానే ఆయనను షహీద్ భగత్‌సింగ్ అని గర్వంగా పిలుచుకుంటున్నాం. భగత్ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు  1907 సెప్టెంబరు 28వ తేదీన జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించారు.

    భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల పాటు నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా భగత్‌సింగ్‌ అన్నివర్గాల నుంచి విస్తృతంగా మద్దతును కూడగట్టుకున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు భగత్‌సింగ్‌ను బ్రిటిష్‌ పాలకులు ఉరితీశారు. ఈ పరిణామాలు భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించాయి.

    విద్యార్థి దశలో స్కూల్లో చదువుతో పాటు.. ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవాడు భగత్‌సింగ్‌. అందరితో కలివిడిగా ఉండేవాడు. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. పాలుగారని ఆ పసి వయసులోనే భగత్‌సింగ్‌ అవగాహన, వ్యక్తిత్వం అందరినీ ముగ్ధులను చేసేవి.

     13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి భగత్‌సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన భగత్.. ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్‌ లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెందిన భగత్‌సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.

    భగత్‌సింగ్‌కు మొదటినుంచీ అధ్యయనమంటే చాలా ఇష్టం. రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. అంతేకాదు.. తనకు ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాత.. అంతకు ముందు జైల్లోనూ భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ.. స్వాతంత్ర్యోద్యమ గీతాలు పాడేవాడు.

    భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం పోరాడిన భగత్‌సింగ్‌.. ఓ బ్రిటిష్‌ పోలీసు అధికారిని కాల్చి చంపాడు. ఆ తర్వాత లాహోర్‌ పారిపోయి.. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు స్వాతంత్ర్య సమరంలో భాగంగా తన మత విశ్వాసాలను కూడా త్యజించిన త్యాగజీవి భగత్‌సింగ్‌. గడ్డాన్ని గీసుకోవడం, వెంట్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు పాల్పడి.. నిజమైన దేశభక్తుడిగా పేరు తెచ్చుకున్నాడు.

    23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే షహీద్ అంటే.. అమరవీరుడుగా ప్రకటించారు. సాధారణంగా ఉరిశిక్షను ఉదయం 8 గంటలకు అమలు చేసేవారు. అయితే.. ఏం జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. జనం నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్‌ జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయానికి అది సంకేతమయింది. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద భగత్‌సింగ్‌‌ను దహనం చేశారు. భగత్ సింగ్ స్మారకచిహ్నం నేడు భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెస్తుంది.

- సప్తగిరి,
ఎం.ఫిల్‌ (జర్నలిజం)
శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి

మహోజ్వల చరితం - భవితకదే దిశా నిర్దేశం (స్ఫూర్తి మాసపత్రిక ఆగస్టు 2017)

మహోజ్వల చరితం  - భవితకదే దిశా నిర్దేశం
                                                                  - సప్తగిరి, ఎం.ఫిల్‌ (జర్నలిజం)
    భారత దేశానికి స్వాతంత్ర్యం లభించి సరిగ్గా ఏడు దశాబ్దాలు. రెండు వందల యేళ్ల పరాయి పాలనకు చరమగీతం పాడి.. 70 సంవత్సరాలు నిండింది. అయినా సమాజంలో అసమానతలు తొలగిపోలేదు. ఆనాటి పెద్దల నిస్వార్థ స్వభావాలు నానాటికీ కనుమరుగవుతున్నాయి. సమాజం అంతా స్వార్థం చుట్టూరా తిరుగుతోంది. దేశం నాకేమి ఇస్తోందని ప్రశ్నిస్తున్న వాళ్లు.. నేను దేశానికి ఏమివ్వగలుగుతానని ప్రశ్నించుకోవడం మానేశారు. ఫలితంగా భారత సమాజం అస్తవ్యస్థంగా తయారైంది. వందశాతం పూర్తిగా ఇదే పరిస్థితి లేకున్నా.. పరిణామాలు మాత్రం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

    స్వాతంత్ర్య సమరయోధులే కాదు.. మన పూర్వీకులు మన ముందు తరాల వాళ్లలోనూ భక్తిభావన, నిస్వార్థ ఆలోచన, ఎదుటివాళ్లకు హానికలిగితే తాము ఎదురొడ్డి నిలిచే మనస్తత్వం మిక్కిలిగా ఉండేది. కానీ.. ఇప్పుడు అలాంటి భావనలు తరిగిపోతున్నాయి. అంటే ఇది చదువుతున్న వాళ్లకు నిరాశావాదం నూరిపోయడం కాదు గానీ.. భావి భారత నిర్మాతలైన విద్యార్థులపైనే ఈ పరిస్థితులను రూపుమాపాల్సిన బాధ్యత ఉంది.

    స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లోనే దేశభక్తి అందరిలోనూ ఉప్పొంగుతుంది. ప్రసంగాలు ధారాళంగా సాగుతాయి. మహానుభావుల చరిత్రలు నెమరేయడం జరుగుతుంది. కానీ..  స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో ప్రజల స్థితిగతులు ఎంత దిగజారి ఉన్నా, వాటిని ఎదుర్కొని మరీ.. స్వార్థాన్ని విడనాడి పరోపకారం కోసం జీవితాలనే ధారపోసిన ఉత్తమోత్తములు ఎందరో.. ఎందరెందరో.. చరిత్రలో చదువుకున్నవాళ్లే కాదు.. జీవితాలను దేశం కోసం ధారపోసినా.. కనీసం రికార్డులకు కూడా ఎక్కని వాళ్ల జాబితా అంతా రూపొందిస్తేనే చాంతాడంత లిస్టవుతుంది. 

    ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయ్‌ గురించి తెలుసుకున్నాం... పుస్తకాల్లో చదువుకున్నాం.. అదే సమయంలో బ్రిటిష్‌ వాళ్లకు చెమటలు పట్టించిన భారత సిపాయి మంగళ్‌ పాండే. ఈస్ట్ ఇండియా కంపెనీలోని 34వ బెంగాల్ రెజిమెంట్‌లో సిపాయిగా పనిచేసేవాడు. కోల్‌కతా దగ్గర బారక్ పూర్ వద్ద 1857వ సంవత్సరం మార్చి 29వ తేదీ మధ్యాహ్నం బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు మంగళ్‌పాండే. బ్రిటిషు వాళ్లు.. తమ సిపాయిలకు అందించే తుపాకులకు, ఆవు కొవ్వు,  పంది కొవ్వును పూసి తయారు చేసిన తూటాలు ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. దీన్ని తట్టుకోలేని మంగళ్‌పాండే బ్రిటిష్‌ అధికారిని చంపేశాడు. బ్రిటిష్‌ వాళ్ల సైన్యంలో ఇక్కడివాళ్లే సిపాయిలుగా పనిచేసినా.. వాళ్ల అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించేవాళ్లు. కానీ.. భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే.. అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

    ఇక.. చిన్నతనం నుంచే నరనరానా దేశభక్తిని పునికి పుచ్చుకున్న మరో యోధుని గురించి చెప్పుకుందాం... చంద్రశేఖర్‌ ఆజాద్‌ పేరు వినగానే మీసం మెలివేస్తున్న నవ యువకుడి ఫోటో అందరి మదిలో మెదులుతుంది. ఆయన అసలు పేరు చంద్రశేఖర్‌ సీతారాం తివారీ. అయితే.. స్వాతంత్ర్యోద్యమ కాలంలో పసివయసులోనే ఆ బాలుడి తెగింపు చూసి అందరూ పెట్టిన పేరు ఆజాద్‌. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు.. చంద్రశేఖర్ అజాద్. భగత్ సింగ్‌కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేతికి చిక్కకుండా.. తనను తానే ఆత్మాహుతి చేసుకున్న అమరవీరుడిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచాడు చంద్రశేఖర్‌ ఆజాద్‌. పేదరికంలో పుట్టినా విద్యార్థి దశనుంచే అత్యంత ధైర్యసాహసాలు కనబరిచాడు ఆజాద్. వందేమాతర ఉద్యమంలో పాల్గొన్న సమయంలో చిన్నతనంలోనే ఉద్యమ కారులను బ్రిటిష్‌ పోలీసులు చితకబాదడం సహించలేక.. రాళ్లతో పోలీసులను కొట్టి పారిపోయాడు. బ్రిటిష్ పాఠశాలలో చదువు కోవడం ఇష్టంలేని అజాద్.. కాశీలో సంస్కృత విద్యాలయంలో చేరాడు. ఓ కేసు విచారణలో అతిపిన్న వయసులోనే  కోర్టుకు హాజరైన చంద్రశేఖర్‌.. న్యాయమూర్తి ముందే అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దీంతో.. బాలుడని కూడా చూడకుండా ఆ బ్రిటిష్‌ న్యాయమూర్తి.. 16 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. కొరడా దెబ్బలు తగులుతున్నకొద్దీ చంద్రశేఖర్‌.. అంతటి నిర్బంధ పరిస్థితుల్లోనూ వందేమాతరం, భారత్‌ మాతాకీ జై అని నినదించాడు.

    బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా స్థాపించిన అనేక సంస్థల కార్యకలాపాల్లో పాల్గొన్నాడు చంద్రశేఖర్‌ ఆజాద్. దాదాపు తనకు అందుబాటులో ఉన్న అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాడు. పలు కేసుల్లో ఆజాద్‌ను నిందితుడిగా  చేర్చిన బ్రిటిష్‌ పోలీసులు అతన్ని పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. 1931 ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో సుఖదేవ్‌రాజ్‌తో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరుపుతున్న ఆజాద్‌ గురించి బ్రిటిష్‌వాళ్లకు ఉప్పందింది. దీంతో.. భారీ సంఖ్యలో పోలీసులు ఆజాద్‌ ఉన్న పార్కును చుట్టుముట్టారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఆజాద్‌ను ప్రాణాలతో పట్టుకొని.. స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలనుకున్న బ్రిటిష్‌ సేనలు.. అతని తొడ, కుడి చెయ్యిపై కాల్చాయి. కానీ.. అప్పటిదాకా బ్రిటిష్‌వాళ్లతో పోరాడిన ఆజాద్‌.. ఇక తాను వాళ్లకు చిక్కడం ఖాయమనుకొని.. తన చేతిలోని తుపాకీలో ఉన్న ఆఖరి తూటాతో తనను తానే బలిదానం చేసుకున్నాడు.

    ఇవి కేవలం ఇద్దరి జీవితాలే. తమ కుటుంబాన్ని వదిలిపెట్టి.. స్వార్థం విడనాడి దేశం కోసమే తమ సర్వస్వాన్ని అర్పించారు. చివరి శ్వాస వరకూ భారతమాత సంకెళ్లను తెంచడమే లక్ష్యంగా పోరాడారు. దేశం బాగుంటే చాలు.. తాము, తమ కుటుంబం బాగున్నట్లే అని భావించారు. ఇలాంటి వేలాదిమంది సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యం. ఈ స్వేచ్ఛను మనం అవసరానికి మించి అనుభవిస్తున్నాం. పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఈ మాటల్లోని ఆంతర్యం బోధపడుతుంది. అయితే.. శిశుమందిరాల్లో బోధనా శైలి, సదాచారముతో భవిష్యత్తుకు గట్టి పునాదులు వేస్తున్న తీరు ఇక్కడ ప్రస్తావనార్హం. స్వార్థం పూర్తిగా వీడకున్నా.. పరోపకారం ఆవశ్యకతను గుర్తుచేస్తూ.. దేశభక్తి పరుల జీవితాలు, మహోన్నతుల శక్తి యుక్తుల గురించి ప్రత్యేకంగా విశదీకరించే సదాచారము.. మన జీవితాలకు మంచి దిశానిర్దేశం చేస్తుందనడంలో అనుమానం లేదు.

- సప్తగిరి,
ఎం.ఫిల్‌ (జర్నలిజం)
శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి

దేవాలయాలు హిందూ సంస్కృతికి పట్టుగొమ్మలు (జాగృతి నవంబర్‌ 2016 సంచిక)

 దేవాలయాలు హిందూ సంస్కృతికి పట్టుగొమ్మలు
                                 - జాతీయ భావాలు పెంపొందించే వాహకాలు

                                 - గోపగోని సప్తగిరి
                                      98850 86126

    హిందూ సంస్కృతికి పట్టుగొమ్మలు దేవాలయాలు. హిందూధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికతతో పాటు.. జాతీయ భావాలను కూడా పెంపొందించే వాహకాలు ఆలయాలు. ఒకప్పడు ఆలయాల్లో ఉండే పరిస్థితులు, సాగే కార్యకలాపాలు, జరిగే చర్చలే ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు. కాలక్రమంలో ఆధునికత ముసుగులో నాగరికపు ఆలోచనలు మనసులను కమ్మేశాయి. ప్రతీదీ అధునాతనమని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో చాలావరకు ఆలయాల్లో సంప్రదాయ కార్యకలాపాలకు కాలం చెల్లిందనే చెప్పొచ్చు. చాలామందికి దేవాలయాలకు వెళ్లడం కూడా ఏదో మొక్కుబడి తంతుగా సాగుతోంది. ఫలితంగా అనాదిగా వస్తున్న సంప్రదాయాలు, మహోన్నతమైన చర్చలు, ముఖాముఖిలకు వేదికలుగా పరిఢవిల్లే ఆలయ ప్రాంగణాలు సహజత్వాన్ని కోల్పోతున్నాయని చెప్పడం బాధాకరమే. మొత్తం కాకున్నా.. నూటికి తొంభైశాతం కృత్రిమ రూపును సంతరించుకున్నాయనడం ఎవరూ కాదనలేని వాస్తవం.

ఆ అనుభూతి అమూల్యం :
    దేవాలయం అంటే పవిత్రమైన ప్రదేశం. దేవాలయానికి వెళ్తే మనసుకు ఉల్లాసం. ఆలయంలో కాసేపు గడిపితే చాలు.. మానసిక ఉత్తేజం సొంతమవుతుంది. మనలోని నిగూఢ శక్తి నిద్రలేస్తుంది. ఆలయ ప్రాంగణాల్లో ఉండే ఆ వాతావరణమే ఓ సరికొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. ఆలోచనాశక్తిని పెంపొందిస్తుంది. మనలను మనం సమీక్షించుకునే పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మంచి ఏదో.. చెడు ఏదో గ్రహించగలిగే శక్తి సామర్థ్యాలను ఇస్తుంది. నిత్యం ఆలయాలకు వెళ్లేవాళ్లకు ఈ అనుభవాలు కాదనలేని సత్యం. అయితే.. ఏదో మమ అనుకున్నట్లు వెళ్లడం కాకుండా.. మదినిండా భక్తిభావంతో, కల్మషం లేని మనసుతో.. దేవుడిపైనే శ్రద్ధ పెడితే ఆ కాసేపటి కాలం.. మనకు ఎంతో విజ్ఞానాన్ని కలుగజేస్తుంది. వేదాలు, శాస్త్రాల అధ్యయనం, ప్రార్థనలు, ఆధ్యాత్మిక గీతాల మననం మరింత పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతుంది.

ప్రతీ అంశం వెనుకా పరమార్థం :
    భగవత్సాక్షాత్కారం కోసం ప్రతి హిందువు తపన పడతాడు.. ప్రయత్నిస్తాడు. దేవాలయంలో పూజలు చేస్తాడు. ఆలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు, గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం, ప్రాకారపు గోడలు కాళ్ళూ, గోపురం పాదాలు. ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవాలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నాము. దేవాలయం భౌతిక శరీరం, మానసిక శరీరం, తైజసిక శరీరాలను ప్రతిబింబించే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక లింక్‌ అని విజ్ఞుల  అభిప్రాయం. 

    దేవాలయం పరమపవిత్రమైన స్థలం. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం దేవాలయానికి వెళ్ళి భగవంతున్ని దర్శించుకోవాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆత్మకు దేహం ఆలయమైనట్లే, ఇంటికి పూజామందిరం, ఊరికి దేవాలయం అటువంటిది. కాబట్టి పూజ చేయని ఇంటిలో అడుగు పెట్టరాదు. దేవాలయం లేని ఊరి దారిలో పయనించరాదని శాస్త్రాలు చెబుతున్నాయంటే ఆలయాలకు, భగవత్‌ ఆరాధనకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.    

నిగూఢమైన అంశాలు :
    ఆగమ సంప్రదాయాలను అనుసరించి ఆలయాలు నిర్మించబడతాయి. దానిలో ఒక భగవద్విగ్రహాన్ని మంత్ర యంత్ర తంత్రాదులతో సంస్కరించి ప్రతిష్ఠ చేస్తారు. అర్చకుని తపశ్శక్తిని, భక్తి, శ్రద్ధా విశ్వాసాలను బట్టి అభిషేక పూజాదులను బట్టి దోషం లేని విగ్రహాన్ని బట్టి భగవచ్ఛక్తి ఆ విగ్రహంలో అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ఇటువంటి ధార్మిక విషయాలను గుర్తించే వివేకవంతులు, త్యాగులు, భక్తులు పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో దేవాలయాలు కట్టించి నిత్యపూజా కైంకర్యాలకు ఏర్పాట్లు చేసారు. దేవాలయాల్లో మూల విరాట్ కు యంత్రం అమరుస్తారు. ఆ యంత్రం బలంగా పనిచేయడానికి నిత్యం అభిషేకాలు, క్రతువులూ జరుగుతూంటాయి. ఈ యంత్రాల వల్ల తీవ్రమైన, ఉగ్రమైన ప్రభావం ఆ గ్రామానిపై,  భక్తులపై పడకుండా దాన్ని శాంతింప చేయడానికి, యంత్రాలు సవ్యమైన మార్గంలో భక్తులను అనుగ్రహించడానికి ధ్వజస్తంభం ఉపయోగపడుతుంది. దేవాలయంలోని మూల విరాట్ కు సరిగ్గా ఎదురుగా ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. సశాస్త్రీయంగా యంత్రం కలిగిన దేవాలయంలో ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాల్సిందే. పైన యంత్రం, కింద విమానం ఈ రెండింటి మధ్యన ఉంటూ, వాటిని కాపాడేది ధ్వజస్తంభం. యంత్రాలు లేని దేవాలయాలకు ధ్వజస్తంభాలుండవు.

మహోన్నత చరిత్ర :
     వాస్తు శాస్త్ర బద్దంగా, శిల్పకళామయంగా నిర్మించిన దేవాలయం సర్వారిష్టహారం, సర్వమంగళప్రదం. సనాతన కాలంనుంచి దేవాలయాలు ఉన్నాయి. అశోకుని కాలానికి ముందే ఆలయాలు నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. నగరాల్లో, పల్లెటూళ్ళల్లో శివకేశవ శక్తి గణేశాది దేవతలకు ఆలయాలు నిర్మించి తీరాలని కౌటిల్యుని అర్థశాస్త్రంలో కనబడుతోంది. చంద్రగుప్తుని కాలంలో ఆలయ నిర్మాణం వ్యాప్తి చెందింది. శుంగుల కాలంలో దేవాలయలు ఎక్కువగా నిర్మించబడినట్లు చరిత్ర చెబుతోంది. వారిని ఆదర్శంగా తీసుకొని బౌద్దులు చిహ్న శిఖరాలుండే బ్రాహ్మణ మందిరాలను నిర్మించారు. శాతవాహనులు, గుప్తులు కూడా దేవాలయాలను కట్టించినవారే. కాలక్రమంగా ఆలయాలు విశ్వవ్యాప్తమయ్యాయి. ఆయా ప్రాంతాలలో భిన్న భిన్న సంప్రదాయాలను బట్టి ఆలయ నిర్మాణం జరుగుతూ వచ్చింది.

ఆలయాలు ఐదు రకాలు :
    ఆలయాలను ఐదు రకాలుగా పెద్దలు పేర్కొన్నారు. భగవంతుడే స్వయంగా అవతరించినవి స్వయంవ్యక్త స్థలములు. దేవతలచే ప్రతిష్టించబడినవి దివ్య స్థలములు. మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించినవి సిద్ధ స్థలములు. పురాణాలలో చెప్పబడిన ప్రసిద్ధిగాంచినవి పౌరాణ స్థలములు. రాజులు, భక్తుల చేత ప్రతిష్టించబడినవి మానుష స్థలములుగా చెబుతారు.

మనకు తెలియకుండానే మహోన్నత వ్యక్తిత్వం :
    దేవతలకు నిలయమైన దేవాలయానికి వెళ్ళేముందు శుచి శుభ్రత ప్రధానం. మొదట స్నానం చేసి.. శుభ్రమైన దుస్తులు ధరించి సంప్రదాయానుసారం నొసట బొట్టు పెట్టుకొని నిర్మలమైన మనస్సుతో ఆలయంలోకి ప్రవేశించాలి. హిందూ దేవాలయాలలో ఉండే భాగాలు, దేవాలయ సందర్శన సమయంలో భక్తులు పాటించే ఆచారాలను పెద్దలు ప్రత్యేకంగా పేర్కొన్నారు. దేవాలయంలో అర్చకులు, భక్తులు వ్యవహరించకూడనివి కూడా ఆగమ శాస్త్రములో ఉన్నాయి. ఆలయం లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు. మొదట ప్రదక్షిణము చేసిన తర్వాతే ఆలయము లోనికి ప్రవేశించాలి. తలపాగా ధరించిగాని, చేతిలో ఆయుధము పట్టుకొనిగాని ఆలయం లోనికి ప్రవేశించరాదు.ఆలయములోకి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తింటూగాని ప్రవేశించరాదు. ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు. ఆలయ ప్రాంగణంలో కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు, నిద్రపోకూడదు. ఆలయంలో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఎటువంటి హింసనూ చేయరాదు. ఆలయంలో వివాదాలకు స్థానం లేదు. ఆలయ ప్రాంగణంలో అహంకారంతో, గర్వంతో, అధికార దర్పంతో వ్యవహరించకూడదు. ఆలయంలో దేవుని ఎదుట పరస్తుతిని, పరనిందను కూడా చేయరాదు.  అధికార గర్వంతో అకాలంలో ఆలయంలోకి ప్రవేశించి అకాల సేవలు చేయరాదు. ఒక చేతితో ప్రణామము చేయరాదు. 

    ఆలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు భగవంతునికి కొబ్బరికాయ సమర్పించుకుంటాడు. టెంకాయలోని డొప్ప, పీచు, టెంక శరీరత్రయాన్ని సూచిస్తాయి. పగులకొట్టడం అంటే వాటిని విడవడం. కొబ్బరికాయలోని పీచు చంచలమైన మనస్సును సూచిస్తుంది. కాబట్టి అది లయమైన తరువాత నిర్మలమైన, శుద్ధమైన పరమాత్మ స్వరూపాన్ని చూడటం జరుగుతుంది. కాబట్టి చివరివరకు కొబ్బరికాయకు జుట్టు ఉండి తీరాలి. ఆ శిఖ అఖండ జ్ఞానాన్ని సూచిస్తుంది. కొబ్బరికాయలోని కండ్లు మూడు కాలాలకు ప్రతినిధులు. కర్పూర హారతిని ఇవ్వడం వల్ల వాసనాశేషాన్ని రూపుమాపడమే అవుతుంది. పసుపు కుంకుమలు మంగళప్రదాలు. విభూతి సమస్త ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

    గర్భగృహంలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారాణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదికి దృష్టిని కేంద్రికరింపచేస్తుంది. ఈ లోకాన్ని  మరచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. తనకు తెలీయనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవదాకర్షణ, సంపర్కం, ఆశీస్సులు ఇక్కడే లభిస్తాయి. భక్తుడు తనలో దైవాన్ని, సత్యాన్ని చూస్తాడు. తనను తాను సమీక్షించుకుంటాడు.

    ఆలయాలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు, దేవాలయ ప్రాంగణాల్లోని వాతావరణం ఓ విధంగా మనిషిలోని స్వార్థాన్ని పారదోలి, విశాలమైన దృక్ఫథాన్ని కలిగి ఉండాల్సిన అవసరాన్ని మనకు తెలియకుండానే నేర్పుతాయి. మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం, పురాణం మొదలైన వాటి సంగమ స్థానం హిందూ దేవాలయం. ప్రాచీన కాలంనుంచీ శిల్పకళకు, చిత్రకళకు, వాస్తుకళకు ఇలా మన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు కూడా ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. ఎన్నో దేవాలయాలు పరమత ద్వేషం వల్ల మట్టిపాలైన వాస్తవాలను చరిత్రలో చదువుకున్నాం. వాటికి సంబంధించిన ఆనవాళ్లను నేటికీ చూడొచ్చు. నేడున్న దేవాలయాలను దర్శించి  మనంతా గర్వపడాలి. వీటి సందర్శనం పూర్వ జన్మ సుకృతమనే చెప్పాలి. అదొక మహాభాగ్యం. తీర్థ యాత్రలవల్ల ఆయాప్రాంతాలతో పాటు.. ఆ ప్రాంతాల ప్రజలతో పరిచయం ఏర్పడుతుంది. అక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి  అవగతమవుతుంది. తద్వారా భావ సమైక్యత, దేశ సమైక్యత ఏర్పడుతుంది. జాతీయ భావాలు పెంపొందుతాయి.

ఆనాటి వైభవం :
    ఒకప్పుడు సాయంకాలం అయ్యిందంటే చాలు.. ఆలయాల్లో పూజలు, మంత్రాల ప్రతిధ్వనులు వినిపించేవి. భజనలతో మారుమోగిపోయేవి. ఊరు ఊరంతా ఆ భక్తిభావంలో, భజన గీతాల్లో ఓలలాడేది. ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయంలో అయితే.. తెల్లవార్లూ సాగే భజనామృతాలు ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేసేవి. డోలక్‌ల వాయిద్యాలు, క్రమ పద్ధతిలో సాగే తాళాల పదనిసలు ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావాన్ని పెంపొందించేవి. కానీ.. ఇప్పుడు ఆలయాల్లో ఆ భజనల పదనిసలు దాదాపు కనుమరుగయ్యాయి. కొన్ని దేవాలయాల్లో మాత్రం వారానికోసారో, సందర్భానుసారమో భజనలు కొనసాగుతుండటం ఓ విధంగా సనాతన సంప్రదాయం కనుమరుగు కాకుండా జరుగుతున్న చర్యల్లో భాగమని చెప్పవచ్చు. అయితే.. ఈ పరిస్థితి కూడా మరింత ఉధృతంగా సాగాల్సిన అవసరం ఉంది. నాటి దేవాలయ వైభవం మళ్లీ కళ్లముందు కదలాడాల్సిన ఆవశ్యకత ఉంది.

- గోపగోని సప్తగిరి
98850 86126

కృష్ణవేణి తరంగాలు.. జీవ జల వాహకాలు (జాగృతి కృష్ణా పుష్కర సంచిక 2016)

కృష్ణవేణి తరంగాలు.. జీవ జల వాహకాలు

                        - గోపగోని సప్తగిరి, 98850 86126.

    కృష్ణానది. తెలుగు రాష్ట్రాల పాలిట జీవజల వారధి. 'కృష్ణవేణీ పావనోదక.. ధార పరితృప్తాంధ్రభూతల సస్యశ్యామల సార సంయుత.. సకలక్షామ నివారిణీ...' అని గొప్పగా పాడుకునే చరిత్ర ఈ నదీమ తల్లిది. భారత దేశంలో మూడో అతిపెద్ద నదిగా భాసిల్లుతోన్న కృష్ణానది.. దక్షిణ భారత దేశంలో రెండో అతిపెద్ద జీవనది. వీటిలో ఒకటి గోదావరి నది కాగా.. రెండోది కృష్ణానది. జీవనది అంటే ఎల్లప్పుడూ నీటితో కళకళలాడుతూ ప్రవహించే నది అని అర్థం. అయితే.. ఈరెండు అతిపెద్ద జీవనదులూ తెలుగు రాష్ట్రాల గుండా ఉరుకులు, పరుగులు పెట్టడం ఓ రకంగా మన అదృష్టంగా చెప్పాలి. ఓవైపు.. గోదావరి నది, మరోవైపు.. కృష్ణానది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను సస్యశ్యామలం చేస‌్తున్నాయి. అందుకే గోదావరి నదిని ఇక్కడ అందరూ ముద్దుగా దక్షిణ గంగ అని పిలుచుకుంటారు అలాగే.. కృష్ణా నదిని గర్వంగా కృష్ణవేణి అని చెప్పుకుంటారు.

    తెలుగు రాష్ట్రాల ఎనగర్రల్లో ఒకటైన కృష్ణానది.. పడమటి కనుమలలో పుట్టింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ పర్వత శ్రేణిలో సముద్రమట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించి మెల్లమెల్లగా ముందుకు కదులుతుంది. అలా ముందుకు సాగుతున్న క్రమంలో అనేక ఉపనదులను తనలో కలుపుకుంటుంది. తన ప్రయాణంలో ఎన్నో నగరాలను, పట్టణాలను, ఆధ్యాత్మిక ప్రదేశాలను, పుణ్య స్థలాలను తాకూతూ వెళుతుంది. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పరీవాహక ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలా వెయ్యి కిలోమీటర్లకు పైగా సాగే ప్రస్థానం.. దివిసీమలోని హంసలదీవి దగ్గర ముగుస్తుంది. అక్కడ బంగాళాఖాతంలో కలిసే సమయంలో కృష్ణానది ఉగ్రరూపాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

    భారత ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణానది.. 29 ఉపనదులను తనలో ఇముడ్చుకుంటుంది. మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో మొదటగా కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణ, పంచగంగ, దూధ్‌గంగ ఉపనదులు కృష్ణవేణిలో కలుస్తాయి. మహారాష్ట్రలో 306 కిలోమీటర్ల దూరం ప్రవహించిన తర్వాత కృష్ణానది.. బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ. ప్రయాణించాక కర్ణాటకలో ఘటప్రభ, మాలప్రభ నదులు కృష్ణానదిలో కలుస్తాయి. తెలంగాణ లోకి ప్రవేశించే ముందు, భీమ నది కృష్ణలో ఇమిడిపోతుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇదే జిల్లాలోని ఆలంపూర్ ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది కృష్ణవేణి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించడమే తరువాయి.. దట్టమైన నల్లమల అడవుల్లోని లోయల్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన కృష్ణా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల గుండా ప్రవహించి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుంది.  తెలుగు రాష్ట్రాల్లో ప్రవాహం కొనసాగినంత దూరం.. దిండి, మూసి, పాలేరు, మున్నేరు మొదలైన ఉపనదులు  కృష్ణలో కలుస్తాయి. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు సమీపంలో తుంగభద్ర కలుస్తుంది. ఇదే కృష్ణానది యొక్క అతిపెద్ద ఉపనది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది. ఉపనదులు అన్నిటితో కలిపి కృష్ణా నదీ మొత్తం పరీవాహక ప్రాంతం 2,56,000 చ.కి.మీటర్లు ఉంటుంది.

    జీవనది అయిన కృష్ణపై బహుళార్థ సాధక ప్రాజెక్టులతో పాటు పలు ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా నిర్మించబడ్డాయి. మహారాష్ట్ర మొదలు కొని ఆంధ్రప్రదేశ్‌ దాకా నాలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మించారు. మరికొన్ని నిర్మాణదశలో, ఇంకొన్ని ప్రతిపాదన దశలోనూ ఉన్నాయి. కర్ణాటకలో ప్రధానంగా చెప్పుకోదగినవి అలమట్టి ప్రాజెక్టు, నారాయణపూర్ ప్రాజెక్టు.. ఈ రెండింటినీ కలిపి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు అని పిలుస్తారు. కృష్ణానదిపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ప్రకాశం బ్యారేజీ. తెలంగాణ నుంచి కృష్ణానది ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించగానే.. నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి కృష్ణానది డెల్టా ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఇవి కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ప్రియదర్శిని జూరాల, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, పులిచింతల తదితర ప్రాజెక్టులు నదీ పరీవాహక ప్రాంతంలోని సాగుభూమిని సస్యశ్యామలం చేస్తున్నాయి.

    సహజంగానే మన జీవితంలో భాగమైన, మన ఎదుగుదలకు దోహదపడే, నిత్యజీవితంలో సాయపడే ప్రకృతిని ఆరాధించడం హిందువుల సంస్కృతి. అందులో భాగంగానే జీవనదులనూ ఇలవేల్పులుగా కొలవడం మొదటినుంచీ ఉంది. ఆ క‌్రమంలోనే నదీమతల్లి కృష్ణవేణిని కొలవడం కూడా జరుగుతున్నది. అందుకే కృష్ణా నది తీరప్రాంతంలో నది ఒడ్డున వెలసిన, కొలువై ఉన్న ఆలయాలకు లెక్కేలేదు. ఇక.. పన్నెండేళ్లకోసారి కృష్ణమ్మకు పుష్కరాలు నిర్వహించడం సనాతనంగా వస్తోన్న సంస్కృతి.

                        - గోపగోని సప్తగిరి, 98850 86126.

వయోవృద్ధులు కాదు.. మన బతుకు నిర్దేశకులు (జాగృతి అక్టోబర్‌ 2016 సంచిక)

వయోవృద్ధులు కాదు.. మన బతుకు నిర్దేశకులు
                        - గోపగోని సప్తగిరి

    వాళ్లు సంపూర్ణ జీవితానికి నిలువెత్తు నిదర్శనాలు. కుటుంబ వ్యవస్థకు ఆయువు పట్లు. నేటి తరానికి మార్గదర్శకులు. కానీ నేటి ఆధునిక సమాజంలో వాళ్ల కేరాఫ్‌ అనాధాశ్రమాలు. వృద్ధాశ్రమాలు. మరీ కిందిస్థాయి వాళ్లయితే ఫుట్‌పాత్‌లు.

నాగరిక సమాజంలో అనాగరికం :
    నాగరికమని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో పెద్దల పట్ల అనాగరిక చర్యలకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి పరిస్థితులు. అందరూ కాకున్నా.. మెజార్టీ పెద్దోళ్లు.. ఒంటరి జీవితాలు అనుభవిస్తున్నారు. తమ ఇళ్లల్లోనే పరాయి వాళ్లలాగా బతుకులు వెల్లదీస్తున్నారు. కొడుకులు, కోడండ్లు, కూతుళ్లు, అల్లుళ్లు ఎవరైతేనేమి.. మనుమలు, మనుమరాళ్ల ముందు చీత్కారాలకు గురవుతున్నారు. నూటికి తొంభైమంది పరిస్థితి ఇదే అంటే కాదనేవాళ్లెవరూ ఉండరు. ఎందుకంటే ఇది సత్యం. మనకళ్లముందు కనిపిస్తున్న వాస్తవం. ఎవరూ కాదనలేని పెద్దల జీవితం. ఈ రోజుల్లో వృద్ధులకు ఎవ్వరూ అంత ప్రాధాన్యం ఇవ్వట్లేదు. అది కోడలైనా, అల్లుడైనా, ఏం సొంత కూతురైనా, కొడుకైనా.. తాము ఓ స్థాయికి ఎదిగాక ఎక్కివచ్చిన నిచ్చెనను కాలితో తోసేస్తున్నారు. వృద్ధావ్యంలో కుటుంబ సభ్యులే వృద్ధుల పాలిట శత్రువులుగా మారుతున్నారు. దూషణలకు పాల్పడటమే కాకుండా కొందరు శారీరక హింసకూ పాల్పడుతుండటం పతనమవుతున్న మానవతా విలువలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. డబ్బు సంపాదనపై పడి కడుపున పుట్టిన బిడ్డలనే క్రీచ్‌ల్లో చేర్చే ఈ రోజుల్లో వృద్ధులను సైతం ఓల్డేజ్‌ హోమ్‌ల్లో చేర్చేస్తున్నారు. ఆప్యాయతగా మాట్లాడే వారు లేకుండా పోవడంతో వృద్ధుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతోంది. దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తులవారు 60 సంవత్సరాల తర్వాత శరీర సత్తువ తగ్గి సంపాదించుకోలేక పోతున్నారు. వీళ్లకు మరే విధమైన ఆర్థిక వనరులు లేకపోవడం వలన ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతో కష్టపడి కాయకష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని పైసా పైసా కూడబెట్టి తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదని ముందుచూపుతో పిల్లలకు చదువు చె ప్పించి ప్రయోజకుల్ని చేస్తే వాళ్ల చేతనే ఈ వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలలో, ఇతర దేశాలలో స్థిరపడి తమ తమ తల్లిదండ్రులను ఆదుకోనివారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోవడం, భార్యాపిల్లలను పోషించుకోవడంలో ఉన్న శ్రద్ధ తల్లిదండ్రులపై ఉండటం లేదు. సాధారణంగా 60 ఏళ్ళ పైబడిన వాళ్లకు రోగాలు మొదలవుతుంటాయి. దీర్ఘకాల రోగాల బారినపడి ఖరీదైన వైద్యం చేయించలేక ఎంతోమంది శేష జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. 

    పల్లె పట్నం తేడా లేదు, ధనిక, బీద భేదం లేదు. అందరివీ ఇవే బాధలు, కన్నీటి కథలు! నైతిక విలువలు కనుమరుగయ్యాయి. మానవ సంబంధాలు అవసరానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఉమ్మడి కుటుంబం కనుమ రుగయ్యింది. చిన్న కుటుంబాలు విస్తరించాయి. కంటికి రెప్పలా కాపాడి, పెంచి ప్రయోజకున్ని చేసిన తల్లిదండ్రుల్ని విడిచి రెక్కలొచ్చాక పిల్లలు ఎగిరిపోతున్నారు. కంప్యూటర్‌ చదువులు, సుదూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉద్యోగాలు, ప్రేమ పెళ్ళిళ్ళు ఉపిరాడని బిజీ జీవితాలు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేవారు కొందరు, అదీ చేయలేనివారు ఇంకొందరు. కడదాకా తోడుండి కాటికి పంపాల్సిన సంతానం కనుమరుగవుతున్నారు. సమాజంలో అనాదిగా ఎంతో ఆదరణ పొంది తమ మాటే మంత్రంగా, కుంటుబంలో వెలుగు వెలిగిన వెలుగులిచ్చిన వృద్ధులు జీవిత చరమాంకంలో విపరీత హింసను ఎదుర్కొంటున్నారు.

దినోత్సవం ఆవశ్యకత :
    వృద్ధులకోసం ఓ దినోత్సవాన్ని నిర్వహించడమంటేనే.. మనం ఎంతటి పాతాళానికి దిగజారిపోయామో అర్థం చేసుకోవచ్చు. పెద్దల పట్ల నేటి తరం వ్యవహారశైలి ఏంటో మననం చేసుకోవచ్చు. మన మూలాలను మనం ఎంతగా పరిగణనలోకి తీసుకుంటున్నామో లెక్కేసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి మరీ.. ఓ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. 1984లో వియన్నాలో మొట్టమొదటి సారిగా వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు జరిగింది. అక్కడే సీనియర్‌ సిటిజన్‌ అనే పదం పుట్టింది. ఈ సదస్సు జరిగిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 1990 డిసెంబర్‌ 14న ఐక్యరాజ్య సమితి చొరవతో వృద్ధుల కోసం ఒక ప్రణాళికను రూపొందించి ప్రపంచ దేశాలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. 2004లో స్పెయిన్‌ దేశంలో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించారు. మొదటిసాగారి 1 అక్టోబర్ 1991 న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు.

ఆనాటి అనుభవం :
    చిన్నప్పుడు ఆరుబయట పడుకొని చుక్కలు చూస్తూ తాతయ్య, బామ్మ, మామ్మలు చెప్పే కథలు వినేవాళ్లు. ఇప్పుడు అసలు తాతయ్య, బామ్మ అనేవాళ్లే పిల్లలకు కనిపించడం లేదు. ఆ బంధాలు కూడా పిల్లలకు దూరమవుతున్నాయి. వరుసలు, బంధుత్వాలు కూడా తెలియకుండా పోతున్నాయి. కానీ.. గత చరిత్ర ను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకోవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. వాళ్లతో చర్చించడం వల్ల సంస్కారం అలవడుతుంది. మన సంస్కృతి ఏంటో ద్యోతకమవుతుంది.

ఇతర రాష్ట్రాల్లో చర్యలు :
    ఒడిశాలో అరవై యేళ్లు దాటిన వృద్ధుల కోసం అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. రోజూ ఉదయాన్నే వృద్ధులు అక్కడికి చేరుకుంటారు. పప్పు భోజనం చేసి తిరిగెళ్తారు. వయోవృద్ధుల ఆకలి బాధ తీర్చడానికి ఒక్కో వృద్ధుడికి 200 గ్రాముల అన్నం, 50 గ్రాముల వవ్పు నిత్యం అందజేస్తున్నారు. హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో 60 ఏళ్లు దాటిన మహిళలకు రోడ్డు రవాణాసంస్థ బస్సుల్లో 50శాతం రాయితీ ఇస్తున్నారు. వ్రతీ డివిజన్‌లో ఆశ్రమం, సీనియర్‌ సిటిజన్‌ క్లబ్బుల ఏర్పాటు, ఉచిత పైద్యసేవలు అందుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వృద్ధుల సంక్షేమంకోసం వ్రత్యేక శాఖలు వనిచేస్తున్నాయి. మనరాష్ట్రంలో స్త్రీశిశు సంక్షేమశాఖలో ఇదో భాగంగా ఉంది.  2003లో రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కార్యాచరణ పథకం బస్సుల్లో సీనియర్‌ సిటిజన్లకు చార్జీలు రాయితీ ఇస్తామని ప్రకటించింది. మహారాష్ట్రలో 75 శాతం, రాజస్థాన్‌లో 25 శాతం, పంజాబ్‌, ఢిల్లీ, చండీగఢ్‌, గోవాలలో 50 శాతం కర్ణాటకలో 25 శాతం తమిళనాడు, కేరళలో 30 శాతం రాయితీ ఇస్తున్నారు.

    మన దేశంలో 60 ఏళ్ళకు మించిన వృద్ధులు దాదాపు 11 కోట్ల మంది ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. మరో 20 ఏళ్ళలో ఈ సంఖ్య రెట్టింపు కాగలదని అంచనా. అనగా మనిషి జీవన పరిమాణం పెరుగుతుంది. ఇది మంచి పరిణామమే. నీ.. దేశంలో నెలకొన్న వరిస్థితులవల్ల సామాన్యులకు నానాటికీ బతుకుభారమవుతోంది. అదేక్రమము లో వృద్ధులవట్ల నిరాదరణ కూడా అంతకంతకు ఎక్కువైపోతోంది. దేశాన్ని పాలిస్తోంది వ్రధానంగా వృద్ధనేతలే అయినవ్పటికీ వయోవృద్ధుల సమస్యలకు వరిష్కారం కనబడకపోవడం అసలైన విషాదం.

వయోజనులకు అండ :
    వృద్ధుల శ్రేయస్సు దిశగా అనేక దేశాలు చట్టాలు చేసిన యాభై ఏళ్ల తరువాతగానీ భారతదేశం మేలుకోలేదు. ఎట్టకేలకు 2007లో 'తల్లిదండ్రులు-పెద్దల పోషణ, సంక్షేమ చట్టం' అమలులోకి వచ్చింది. అయినా, చట్ట నిబంధనలు కాగితాలకే వరిమితం కావడంతో వృద్ధుల సమస్యలు తీరనేలేదు. అనేక రాష్ట్రాల్లో కనీస మాత్రంగానైనా చట్టం అమలవుతున్న దాఖలాలు కనబడటం లేదు. తల్లిదండ్రుల్ని వట్టించుకోనివారికి మూడు నెలల వరకు జైలు, అయిదు పేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అధికారాన్ని ట్రిబ్యునళ్లకు ఈ చట్టం కల్పించింది. భరణాన్ని ఎగ్గొట్టినవారికి నెలరోజుల వరకు జైలుశిక్ష వడుతుంది. వృద్ధులకు అండగా నిలిచే ఇలాంటి నిబంధనలు ఎన్నో చట్టంలో ఉన్నాయి. చట్ట వ్రకారం వృద్ధులు తమ సమస్యలను నేరుగా ఆర్డీవో స్థాయి అధికారులకు పిర్యాదు చేసుకోవచ్చు. కానీ, సరైన అవగాహన లేకపోవడంతో అధికశాతం వృద్ధులైన తల్లిదండ్రులు నేరుగా పోలీసులు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వృద్ధులకు రైలు వ్రయాణంలో రాయితీ సౌలభ్యం ఉన్నా, అందుకు అనుగుణంగా సీట్లు ఉండవు. ఒంటరిగా జీవించే వృద్ధులకు ఇళ్లవద్ద భద్రత కొరవడుతోంది. వ్రభుత్వ కార్యాలయాలకు పెళ్లినా, వారికి ప్రాధాన్యం దక్కడం లేదు. బ్యాంకులు, పింఛను కార్యాలయాల వద్ద నిత్యం చాంతాడంత వరసల్లో ఈసురోమంటూ నిలబడక తవ్పడం లేదు.

    మెయింటైనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అఫ్‌ పేరెంట్స్‌ ఎండ్‌ సీనియర్‌ సిటిజెన్‌ యాక్ట్‌- 2007 చట్టం, నేషనల్‌ పాలసీ ఫర్‌ ఓల్డర్‌ పర్సన్స్‌ -1999, నేషనల్‌ ఓల్డ్‌ ఏజ్‌ పెన్షన్‌ స్కీము -1994, అంత్యోదయ పథకం, బీమా కంపెనీలనుంచి వివిధ సీనియర్‌ సిటిజన్‌ పథకాలు, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఓల్డర్‌ పర్సన్స్‌, ఇంటిగ్రెటేడ్‌ ప్రొగ్రాం ఫర్‌ ఓల్డర్‌ పర్సన్స్‌, రైల్వే, రవాణా, విమానయానాలలో వృద్ధులకు రాయితీలు జాతీయ స్థాయిలో ఉండగా, అంతర్జాతీయ స్థాయిలోకూడా వివిధ సంస్థలు వృద్ధులకు చేయూతనిస్తున్నాయి. సీడా ఒప్పందం, డిక్లరేషన్‌ ఆన్‌ సొషల్‌ ప్రోగ్రెస్‌ అండ్‌ డెవెలప్‌ మెంట్‌ -1969 ( సెక్షన్‌ 11)  మొదలైనవి వీరి హక్కులకు బాసటగా నిలుస్తు న్నాయి.

    పాశ్చాత్య దేశాలు వృద్ధుల సంరక్షణకు పలు చట్టాలు రూపొందించాయి. బతికినంతకాలం వృద్ధులను కుటుంబ సభ్యులు ఆదరణతో చూసుకునేవిధంగా పటిష్ఠ నిబంధనలు చట్టంలో పొందుపరచారు. ఆర్థిక భద్రత సైతం వారికి లభిస్తుంది. ఎవరూ లేనివారికోసం వ్రత్యేక సంరక్షణ కేంద్రాలనూ అనేక దేశాలు ఏర్పాటు చేశాయి. మరీ ముఖ్యంగా వృద్ధుల్లో వయసురీత్యా వచ్చే ఆత్మన్యూనత భావనలను పోగొట్టడానికి కౌన్సెలింగ్‌ కేంద్రాలూ సేవలందజేస్తున్నాయి. వృద్ధుల భద్రతకోసం కొన్ని దేశాల్లో వ్రత్యేక పోలీసుల సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

    ప్రత్యేకంగా వృద్ధులకోసమే పలు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నాయి. ఆర్టీసీ బస్సులలో రాయితీ, రైల్వేలలో ఇస్తున్న 40 శాతం రాయితీకి తోడు ఇంకో 20 శాతం పెంచాలి. అంతేకాకుండా రిజర్వేషన్‌లో కూడా ప్రాముఖ్యం కల్పించాలి. ప్రతి బ్యాంకులో క్యూ తో నిమిత్తం లేకుండా సీనియర్‌ సిటిజన్లకు లావాదేవీలు జరిపే సదుపాయం కల్పించాలి. కార్పొరేట్‌ ఆస్పత్రులలో 25 శాతం రాయితీ కల్పించి ఆ విషయాన్ని ఆసుపత్రి బోర్డులపై ప్రచురించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఒక మంత్రిని నియమించాలి. సీనియర్‌ సిటిజన్లు ఎదర్కొంటున్న సామాజిక బాధలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలి. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు ఉచిత వైద్య సహాయం అందచేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, పోలీస్‌ స్టేషన్‌లో వృద్ధులను గౌరవించడం మన బాధ్యత అనే బోర్డులను ఏర్పాటు చేయాలి. మన తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షన్‌ మంజూరు చేస్తున్నారు. ఈ విషయంలో వృద్ధులు కొంతవరకు సంతోషపడాలి. తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట మొదలగు రద్దీ ఉండే పుణ్య క్షేత్రాలలో వృద్ధులకు క్యూ నిమిత్తం లేకుండా డైరెక్టుగా దర్శన ఏర్పాట్లు కల్పించాలి.  వృద్ధులు కూడా అవస్థలు పడకుండా అలమటించి పోకుండా చూసే బాధ్యత యువతకు, ప్రభుత్వానికి వుంది.

పెద్దల మాట చద్దిమూట :
    బాల్యం- 20 ఏళ్ళయితే, కౌమార, యువన దశలు 40సంవత్సరాలు. ఇలా మనిషి జీవిత ప్రయాణంలో 3దశలు పూర్తిచేసి 60ఏళ్ళుచేరుకుంటే షష్టిపూర్తి. కాలచక్రంలో 60ఏళ్ళు పూర్తయిన వ్యక్తికి షష్టిపూర్తి చేస్తారు. వ్యక్తి దీన్నే సంప్రదాయ బాషలో ఉగ్రరథ శాంతి అంటారు. డెబ్బై వసంతాల వ్యక్తికీ భీమరధి శాంతి చేస్తారు. 83 సంవత్సరాలు దాటితే సహస్ర చంద్రదర్శనం..  వెయ్యిపున్నములు సందర్శనోత్సవములు జరుపుతారు. వృద్దులు రెట్టించిన ఉత్సాహంతో జీవించేటట్టు చేసేందుకు ఈ ఉత్సవాలు. మన పెద్దలు దీవించే టప్పుడు శతాయుష్మాన్‌భవం అని దీవిస్తారు.అ నూరు సంవత్సరాల జీవితాన్ని నాలుగు దశలుగా 25ఏళ్ళు బ్రహ్మచర్యం, 25 ఏళ్ళు గార్హస్థ్యం, 25ఏళ్ళు వానప్రస్థం. 25ఏళ్ళు సన్యాసం అని మనపెద్దలు నిర్ణయించారు. ఇవి మానవుని సర్వతోముఖాభివృద్ధికి, ఆధ్యాత్మికతోన్నతికి, తద్వారా సమాజ వికాసానికి, దేశ కళ్యాణానికి తోడ్పడతాయని వారి విశ్వాసం. వీటినే ఆశ్రయ ధర్మాలు అంటారు. ఈ కాలంలో ఆశ్రయ ధర్మాల సంగతటుంచి వృద్ధాశ్రమాల్లో చేర్పించి ఏ శ్రమాలేకుండా చేతులు దులుపుకుంటున్నారు.

మన కర్తవ్యం :
    మనం బతకబోయే బతుకు వాళ్లు. మనం నడవబోయే దారి వాళ్లు. ఇప్పటి సమాజాన్ని మనకంటే ముందు స్వప్నించినవాళ్లు. దీని నిర్మాణానికి మనకంటే ముందు రాళ్లెత్తిన వాళ్లు. చరిత్రకు ప్రత్యక్ష సాక్షులు వాళ్లు. వాళ్లు... మనవాళ్లు. మన పెద్దలు. వయోవృద్ధులు. ప్రతి అంశంలోనూ వాళ్లకు ఒక అనుభవం ఉంటుంది. ఆలోచన ఉంటుంది. తమదైన దృష్టికోణం ఉంటుంది. గతాన్ని భవిష్యత్తుతో ముడివేస్తూ వర్తమానంతో జరిపే సంభాషణ వాళ్ల జీవితసారం.

    ఇంట్లో పరిస్థితులన్నీ పెద్దలతో చర్చించాలి. వాళ్లూ మనలో ఒకరిగా గుర్తించి ప్రతి విషయాన్ని పంచుకోవాలి. పిల్లలముందు కించపరచకుండా వాళ్ల ప్రాధాన్యతను పిల్లలు తెలుసుకునేలా చేయాలి. లేకుంటే రేపు.. మన పిల్లలు కూడా.. మనల్ని ఇంకా ఘోరాతిఘోరంగా చూడాల్సి రావొచ్చు. జీవిత చరమారకంలో కుటుంబంలోని వృద్ధులు వ్రశాంతం గా కాలం గడవడానికి అవసరమైన  చేయూత అందజేయడం కుటుంబసభ్యులందరి కనీస బాధ్యత. వృద్ధాప్యంలో ఉన్న వారితో ప్రతిరోజూ కాసేపైనా గడపాలి. వారి అభిప్రాయాలను గౌరవించి కుటుంబంలో ఓ గుర్తింపు ఉన్నదన్న విశ్వాసాన్ని కలిగించాలి. కుటుంబమే బాల్యానికి నాంది. సమాజ నిర్మాణానికి అదే పునాది, ఉమ్మడి కుటంబ వ్యవస్థ క్రమంగా తెరమరుగై చిన్న చిన్న కుటుంబాలు తెరమీదకు వచ్చాయి. ఏకసంతానంతో కుటుంబం ఇంకా చిన్నదైపోయింది.

    ఈ యేడాది అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం థీమ్‌.. 'Take a Stand Against Ageism' అందుకే వృద్ధులకు అండగా ఉందాం.. వాళ్లతో ఆలోచనలు పంచుకుందాం... ఎందుకంటే మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పక వృద్ధులవుతాం కదా...

- గోపగోని సప్తగిరి
===============

ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం (జాగృతి కృష్ణా పుష్కర సంచిక)

ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం
                        - గోపగోని సప్తగిరి, 98850 86126.

    భారత దేశంలోని ఇతర నదుల మాదిరిగానే.. దక్షిణాదిన అతిపెద్ద రెండో జీవనది అయిన కృష్ణా నదికి కూడా మహోన్నత పౌరాణిక ప్రశస్తి ఉన్నది. నది ప్రవాహం సాగిన పొడవునా ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిసాయి. మన ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలుస‌్తున్నాయి. హిందువుల పవిత్ర నదిగా గర్వంగా చెప్పుకునే.. కృష్ణా నది తీరాన ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రాలలో ప్రధానమైనది శ్రీశైలం. ఆ తర్వాతే మిగతా క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. కృష్ణా నది కి ప్రధాన ఆకర్షణ ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి జరిగే పుష్కరాలు. ఆ సమయంలో కృష్ణా నది తీరం అంతా భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తుంది.

మహారాష్ట్రలోని ప్రముఖ క్షేత్రాలు :

మహబలేశ్వర్ :
    మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ ఒక హిల్‌ స్టేషన్‌. పశ్చిమ కనుమలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ కనుమలే.. కృష్ణానది తో పాటు మరో నాలుగు నదులకు జన్మస్థలం. ఈ ప్రదేశంలో చూడటానికి ముప్పై కి పైగా ఆకర్షణలు ఉన్నాయి. అందమైన లోయలు, అడవులు, నదులు, జలపాతాలు ఇక్కడి పశ్చిమ కనుమల అందాల్ని మరింతగా పెంచుతుంటాయి.

సాంగ్లీ  :
     సాంగ్లీ మహారాష్ట్రలోని ప్రసిద్ధ పట్టణం. ఈ పట్టణాన్ని డ్రామాల పుట్టినిల్లు అనేవారు. ఇక్కడ తప్పక చూడవలసినవి ఆలయాలు, జంతు ప్రదర్శనశాలలు. ఇక్కడి ఆలయాల్లో గణపతి ఆలయం, సంగమేశ్వరుని ఆలయం బాగా ప్రశస్తి చెందినవి. అంతేకాక ఈ ప్రాంతంలోనే రామలింగ, దత్తదేవ ఆలయాలు కూడా ఉన్నాయి.

కర్నాటకలోని ప్రముఖ క్షేత్రాలు :

బెల్గాం :
     కర్నాటక రాష్ట్రంలోని బెల్గాం పురాతనమైన పట్టణం. అందమైన సాహ్యాద్రి కొండలు, అరేబియా సముద్రం, జలపాతాలు, పచ్చిక బయళ్లతో పాటు.. ఆలయాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ చెప్పుకోదగ్గ రెండు ఆలయాలు చిక్క బాసడి, కమల్ బాసడి.

కుదల సంగమ :
    కర్నాటకలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో కుదలసంగమ ఒకటి. ఇది పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసినది. ఇక్కడి  ఆలయాలలో సంగమనాథ ఆలయం, బాసవేశ్వరుని ఐక్య లింగ ఆలయం ప్రధానమైనవి. సంగమనాథ ఆలయం చాళుక్యుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.

జలదుర్గ  :
    జలదుర్గ కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ కృష్ణా నది పరవళ్ళు తొక్కుతూ పై నుండి జలపాతంలా కిందకు పడుతుంది. దీనికి గల మరో పేరు జలదుర్గ జలపాతం. ఇక్కడ చూడవలసినది జలదుర్గ కోట. ఇది సముద్రమట్టానికి కొన్ని వందల అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ కొండ మీద నుండి లోయలో ప్రవహించే కృష్ణా నదిని తనివితీరా చూడవచ్చు.

తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు :

తంగడి, మహబూబ్ నగర్ :
    తంగడి.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో గల ఒక గ్రామం. ఇక్కడే కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. దక్షిణ భారత దేశంలో రాక్షస తంగడి యుద్ధం ఇక్కడే జరిగిందని కొందరి అభిప్రాయం.

కురుపురం, మహబూబ్ నగర్ :
    మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది తీరాన ఉన్న కురుపురం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడికి భక్తులు వారాంతంలో తరచూ వస్తుంటారు. శని, ఆది వారాల సమయంలో, పండుగ సమయాల్లో యాత్రికులు ఇక్కడికి వచ్చి వనభోజనాలు సైతం చేస్తుంటారు. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటూ యాత్రికులను ఆకర్షిస్తున్నది.

గద్వాల, మహబూబ్ నగర్:
    మహబూబ్ నగర్ జిల్లాలో గల గద్వాల ఒక ప్రముఖ పట్టణం. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది గద్వాల కోట మరియు అందులోని చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం. గద్వాల కోట పూర్తిగా మట్టితో నిర్మించినారు. దీనితో పాటు ఇక్కడ చూడవలసిన మరో ఆకర్షణ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్.

బీచ్ పల్లి, మహబూబ్ నగర్ :
    బీచ్ పల్లి మహబూబ్ జిల్లా కు చెందిన గ్రామం. ఇది బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్నది.  కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో సీతారామాలయం, ప్రాచీన ఆంజనేయస్వామి ఆలయం ఉన్నాయి. 

ఆలంపూర్, మహబూబ్ నగర్ :
    అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఆలయం ఆలంపూర్‌లో ఉంది. ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. ఇక్కడ జోగులాంబ, బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధికెక్కినాయి. ఆలంపూర్ ఆలయాలు చాళుక్యుల ఆలయ శిల్ప నిర్మాణానికి అద్దం పడతాయి. జాతీయ రహదారికి సమీపంలో ఉండే ఆలంపూర్.. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మండలమైనప్పటికీ.. దక్షిణాన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుతో గట్టి సంబంధం కలిగి ఉన్నది.  కృష్ణా నది యొక్క ఉపనదుల్లో కెల్లా పెద్దదైన తుంగభద్ర నది ఈ ప్రదేశంలోనే కలుస్తుంది.

సోమశిల, మహబూబ్‌నగర్:
    మహబూబ్‌నగర్ జిల్లా లోని కొల్లాపూర్ కి 8 కి. మీ. దూరంలో కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తున్న కృష్ణా నది, చుట్టూ పచ్చని ప్రకృతి, నదీ తీరంలో నిర్మించిన 14 ఆలయాల సముదాయం సోమశిల. ఇక్కడి ప్రధాన దైవం సోమేశ్వర స్వామి . ఇక్కడ ఉన్న ఆలయాలు అన్నింటికీ కలిపి ఒకే గోడ ఉంది. ఇక్కడున్న సుందర దృశ్యాలు, కృష్ణా నది సందర్శకులకు కనులవిందు చేస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రముఖ క్షేత్రాలు :

సంగమేశ్వరం, కర్నూలు జిల్లా :
    సంగమేశ్వరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న పుణ్య క్షేత్రం. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రదేశం ఈ సంగమేశ్వరం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశంలో ఉన్న ఈ క్షేత్రం ఏడెనిమిది మాసాలు నదిలో మునిగి కేవలం మూడు నాలుగు నెలలు మాత్రమే బయటపడుతుంది. ఇక్కడి ప్రధాన దైవం శివలింగం.

శ్రీశైలం, కర్నూలు జిల్లా :
    శ్రీశైలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో విస్తరించిన నల్లమల అడవుల్లో ఉన్నది. ఇది ప్రముఖ శైవ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయం. ఇక్కడ దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న పుణ్య క్షేత్రాలలో ప్రధానమైనది ఇదే...

కేతవరం, కర్నూలు జిల్లా :
    కేతవరం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహించే కృష్ణా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి. ఆలయ దర్శనం చేసుకోవడానికి భక్తులు కష్టపడక తప్పదు. ఇక్కడి కొండమీద ఉన్న ఆలయ దర్శనానికి వెళ్ళాలంటే 650 మెట్లు ఎక్కి, ఉదయాన్నే 9 గంటలకల్లా కొండమీదికి చేరుకోవాలి.

అమరావతి, గుంటూరు జిల్లా :
    ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధానిగా ఎంపిక చేయబడిన అమరావతి.. కృష్ణా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ పంచరామాలలో ఒకటైన ఈ క్షేత్రాన్ని అమరారామంగా కూడా పిలుస్తారు. ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామి గా పూజలందుకుంటాడు. బౌద్ధుల ఆరామాలకు కూడా ఇది ప్రసిద్ధి.

కనక దుర్గ ఆలయం, శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం, కృష్ణా జిల్లా :
    ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత తాత్కాలిక రాజధాని విజయవాడ లో ఉన్న కనకదుర్గ ఆలయం దేశంలో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం ఇంద్రకీలాద్రి కొండ మీద వెలసింది. కృష్ణా నది ఒడ్డున ఉండే ఈ ఆలయం గురించి క్షేత్ర పురాణంలో పేర్కొనటం జరిగింది.

అవనిగడ్డ, కృష్ణా జిల్లా :
    అవని గడ్డ  ప్రాంతాన్నే దీవిసీమ అని అంటారు. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు లంకమ్మ అమ్మవారి దేవాలయం, కోదండరాముని ఆలయం.

నాగాయలంక, కృష్ణా జిల్లా :
    నాగాయలంకలో గంగానమ్మ తల్లి దేవాలయం, గణపతి దేవాలయం, పోతురాజుస్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, రాముని ఆలయం, దుర్గామాత ఆలయం ఉన్నాయి.

కోడూరు, కృష్ణా జిల్లా :
    కోడూరులో ప్రధాన ఆకర్షణలు భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, పార్వతీ సమేత స్వామి వారి ఆలయం, గంగా భవానీ ఆలయాలు ప్రముఖమైనవి.

మోపిదేవి, కృష్ణా జిల్లా :
    మోపిదేవి క్షేత్రం నాగ పూజలకు ప్రసిద్ధి.

                            - గోపగోని సప్తగిరి, 98850 86126.


12, సెప్టెంబర్ 2017, మంగళవారం

http://www.lokahitham.net/2017/09/blog-post_25.html

ఇంకెన్నాళ్లకు అధికారిక ఉత్సవం? (లోకహితం - సెప్టెంబర్‌ 2017 సంచిక)


సరిగ్గా 69యేళ్లక్రితం...స్వతంత్య్ర భారతావనిలో హైదరాబాద్‌ సంస్థానం విలీనమైన రోజు. రజాకార్ల అరాచకాలు, నిజాం నవాబు చెర నుంచి విముక్తైన రోజు. 1947 ఆగస్టు 15వ తేదీన భారతావనికి స్వాతంత్య్రమని ప్రపంచానికి తెలుసు. కానీ..హైదరాబాద్‌ సంస్థానం విలీనం తర్వాతే 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన దేశానికి పూర్తి విముక్తి లభించింది. 
స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌ నాయకత్వానికి బ్రిటిష్‌ వాళ్లు పగ్గాలు అప్పగించా రు. అదే సమయంలో... 543 సంస్థానాలు కూడా దేశంలో విలీనమయ్యాయి. కానీ నిజాం పాలన లోని హైదరాబాద్‌ సంస్థానం మాత్రం ససేమిరా అంది. అప్పటివరకూ బ్రిటిష్‌ వాళ్లకు సామంతు డిగా కొనసాగిన హైదరాబాద్‌ నవాబు.. ఆసఫ్‌ జాహీ వంశస్థుడైన ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తనది స్వతంత్య్ర రాజ్యమని ప్రకటించు కున్నాడు.
దీంతో అప్పటి హైదరాబాద్‌ రాజ్యంలోని హైదరాబాద్‌తో పాటు.. ఔరంగాబాద్‌, నాందేడ్‌, బీదర్‌, ఉస్మానాబాద్‌, రాయచూర్‌ తదితర ప్రాంతాల్లో నిజాం నిరంకుశ పాలన కొనసాగింది. రజాకార్లు చెలరేగిపోయారు. హిందువులు కనిపిస్తే చాలు.. నరికి చంపేశారు. హిందూ మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. నిజాం నవాబు స్వతంత్య్ర రాజ్యంలో హిందువుల ఊచకోత కొనసాగింది. స్వతంత్య్ర భారతదేశంలో కూడా మరో ఏడాదికి పైగా ఇక్కడి జనం అరాచకాల మధ్య నలిగిపోయారు.
ఈ క్రమంలోనే ఇక్కడి ప్రజలు భారతదేశంలో విలీనమైతే తప్ప తమకు భద్రత లేదని భావించారు. మరోవైపు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోన్న భారత ప్రభుత్వం 'ఆపరేషన్‌ పోలో' చేపట్టింది. హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆదేశాల మేరకు మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరి నేత త్వంలోని భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానాన్ని నలువైపుల నుంచి చుట్టుముట్టింది.
అదే సమయంలో భారత సైన్యాన్ని ఎదిరించి ఢిల్లీ ఎర్రకోటపైనే ఆసఫ్‌జాహీ పతాకాన్ని ఎగురవేస్తామని అప్పటి రజాకార్ల నాయకుడు కాశీంరజ్వీ ప్రకటించా డు. అటు రజాకార్లు గానీ.. ఇటు నిజాం సైన్యం గానీ.. అదే సమయంలో భారత సైన్యాన్ని ఎదిరించేందుకు పాకిస్తాన్‌ సాయం కోరుతూ వర్తమానం పంపాడు నిజాం నవాబు. అటు.. ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేశాడు. దీంతో.. నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న లక్ష్యంతో సెప్టెంబర్‌ 13వ తేదీన భారత ప్రభుత్వం 'ఆపరేషన్‌ పోలో' మొదలుపెట్టింది. నాలుగు రోజుల్లోనే నిజాంను దారికి తెచ్చింది.
భారత ఆర్మీ ముందు నిలువలేక పోయాయి. ఓవైపు యుద్ధం సాగుతున్న సమయంలో హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రజలు ఎక్కడికక్కడ భారత సైన్యానికి సహకరించి నిజాం మూకలను అంతమొందించేందు కు సహకరించారు. ఫలితంగా భారత సైన్యం హైదరాబాద్‌లో అడుగుపెట్టకముందే నిజాం నవాబు తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు లొంగుబాటు ప్రకటించాడు.
కాలక్రమంలో రాష్ట్రాల విభజన తర్వాత హైదరాబాద్‌ సంస్థానంలోని మెజారిటీ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చాయి. కొన్ని జిల్లాలు మహా రాష్ట్రలోకి, కర్నాటకలో అంతర్భాగమయ్యాయి. అయితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మినహా.. మిగతా రాష్ట్రాల్లోని అప్పటి హైదరాబాద్‌ సంస్థానంలో ఉన్న ప్రాంతాల్లో సెప్టెంబర్‌ 17వ తేదీన అధికారికంగా 'విమోచన దినోత్సవ వేడుకలు' నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి హైదరాబాద్‌ సంస్థానాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలంటూ తెలంగాణ ఉద్యమం అరవయ్యో దశకంలోనే మొదలైంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా.. కాంగ్రెస్‌ కుటిల నీతితో ఉద్యమాన్ని అణచివేసింది. ఇక మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 'హైదరాబాద్‌ విమోచన దినోత్సవం' అధికారికంగా నిర్వాహిస్తామని అనేకసార్లు ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లు గడిచినా ఆ మాటే మరిచారు. కేవలం హైదరాబాద్‌లోని రజాకార్ల వారసుల పార్టీ అయిన ఎంఐఎంను నొప్పించకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదన్న వాదనలున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ప్రతియేటా నిరసన యాత్రలు చేపడుతూనే ఉంది. అధికారికంగా సెప్టెంబర్‌ 17న విమోచన ఉత్సవాలు జరపాలని డిమాండ్‌ చేస్తోంది. మరి ఈ ఎదురుచూపులు ఇంకెన్నాళ్లో?
(-హంసిని సహస్ర సాత్విక)

11, ఏప్రిల్ 2017, మంగళవారం

గిల్గిత్‌లో గిల్లికజ్జాలు (లోకహితం ఏప్రిల్‌-2017 సంచిక)

- ఆర్థిక కారిడార్‌ పేరిట పాక్‌, చైనా కుట్రలు

మొదటి నుంచీ గిల్లికజ్జాలు పెట్టుకునే దాయాది దేశం పాకిస్తాన్కు ఇప్పుడు పొరుగుదేశం చైనా జత కలిసింది. భారత్‌ను ఎప్పుడూ దొంగదెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉండే పాకిస్తాన్‌కు చైనా స్నేహం తోడయ్యింది. నేరుగా భారత్‌ను ఎదుర్కొనే సాహసం చేయలేని చైనా.. ఈ క్రమంలోనే అటునుంచి నరుక్కువస్తోంది. ఫలితంగా రెండు దేశాలు కలిసి కొత్త కుట్రకు తెర తీశాయి. 

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిత్‌కు ఇప్పటిదాకా ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని కాదని, రాష్ట్ర హోదా కల్పిస్తూ పూర్తిగా పాకిస్తాన్‌ ఆధిపత్యంలోకి వెళ్లేలా.. ఈ తర్వాత క్రమంగా చైనా పెత్తనం సాగించేలా దుర్మార్గమైన ఆలోచన చేశాయి.
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌
భారతదేశానికి స్వాతంత్య్రం లభించడం, దేశ విభజన తర్వాత.. 1947 అక్టోబరు 22న పాకిస్తానీ మూకలు కాశ్మీర్‌ ఆక్రమణకు కుట్ర చేశాయి. కాశ్మీర్‌ మహారాజు తమ రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వానికి లేఖ పంపగానే.. అక్టోబర్‌ 27వ తేదీ భారత వైమానిక దళాలు కాశ్మీర్‌ చేరుకున్నాయి. భారత సైన్యం శత్రు సైన్యాలను తరిమికొట్టాయి. అప్పటికే జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో మూడవ వంతు భూ భాగం పాకిస్తాన్‌ వశమైంది. 35 వేల చదరపు మైళ్ళు వున్న ఈ భూభాగంలో విలువైన అడవులు, ఖనిజ సంపద వున్నది. బాల్టిస్టాన్‌, గిల్గిత్‌, ముజఫరా బాద్‌ జిల్లాలలో పాకిస్తాన్‌ మూకలు వచ్చి చేరాయి. దీనికి పాకిస్తాన్‌ ఆజాద్‌ కాశ్మీర్‌ అని పేరు పెట్టింది.
సీపీఈసీ - చాపకింద నీరులా చైనా కుట్ర
భారత్‌ను దెబ్బతీసే కుట్రలో భాగంగా.. చైనా, పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)కు ఇరు దేశాలు కలిసి ప్లాన్‌ చేశాయి. ప్రధానంగా చైనా.. ఈ విషయంలో దూకుడుగా వెళ్తోంది. రూ.2.85 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతున్న సీపీఈసీ.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా వెళ్తుండటంతో.. భవిష్యత్‌లో భారత్‌తో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, తన చేతికి మట్టి అంటకుండా పాకిస్తాన్‌తో పావులు కదిపిస్తోంది చైనా. అందులో భాగంగానే.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ పూర్తిగా పాకిస్తాన్‌ అధీనంలోకి తెచ్చుకునేందుకు వీలుగా.. గిల్గిత్‌కు రాష్ట్ర హోదా కల్పించేందుకు నిర్ణయిం చింది. ఇప్పటికే పాకిస్తాన్‌లో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఐదో రాష్ట్రంగా గిల్గిత్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని పేర్కొంటోంది. గిల్గిత్‌- బాల్టిస్తాన్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారైన సర్తార్‌ అజీజ్‌ నేతత్వంలోని కమిటీ సిఫార్సు చేసినట్లు పాక్‌ మంత్రి రియాజ్‌ హుస్సేన్‌ పీర్జాదా మీడియాకు చెప్పారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ కూడా చేయనున్నట్లు ఆయన చెప్పారు. అదే జరిగితే.. ఇక ఆ ప్రాంతాన్ని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ అని కాకుండా పాకిస్తాన్‌తో అంతర్భాగంగా పేర్కొనాల్సి ఉంటుంది. అప్పడు చైనా పని కూడా సులువవుతుంది. అంతేకాదు.. భారత్‌ గుట్టుమట్లు తెలుసుకునేందుకు కూడా చైనాకు వీలవుతుంది. ఈ క్రమంలోనే 2014లో పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పాకిస్తాన్‌ వెళితే సొంత తమ్ముడి ఇంటికి వెళ్లినట్లు ఉంటుందంటూ పాక్‌ నేతలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ భారత్‌లో అంతర్బాగమన్న బ్రిటన్‌
1947లో పాకిస్తాన్‌ కుట్రపూరితంగా ఆక్రమించుకున్న గిల్గిత్‌, బాల్టిస్తాన్‌ ప్రాంతాలు భారత్‌లో అంతర్బాగమని బ్రిటన్‌ పార్లమెంట్‌ చారిత్రక తీర్మానం చేసింది. 200యేళ్ల పాలన తర్వాత భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చిన ఆంగ్లేయులే ఈ తీర్మానం చేయడం భారత్‌కు అత్యంత పదునైన ఆయుధమని చెప్పవచ్చు. ఈ తీర్మానాన్ని కన్జర్వేటివ్‌ పార్టీ నేత బాబ్‌ బ్లాక్‌ మాన్‌ మార్చి 23న సభలో ప్రవేశపెట్టారు. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పాక్‌ తమ భూభాగంగా ప్రకటించుకోవడం సరికాదని ఈ తీర్మానం స్పష్టం చేసింది.

- హంసిని సహస్ర సాత్విక