అప్పుడు...
రక్తాన్ని చెమటగా మారుస్తున్నప్పుడు
నీ శరీరం కృషించిపోయినా
రసాయనాలూ, యంత్రాలూ నీ ఆరోగ్యాన్ని తినేసినా
నువ్వు అధికారం నిర్లక్ష్యం కాళ్లకింద నలిగిపోయావు
మనుగడ కోసం పరితపిస్తూ...
నమ్ముకున్న కర్మాగారాన్ని తల్లిలా భావిస్తూ....
నీవు దోచబడుతూ కూడా...
అన్నదాత దోపిడీ పాలవకుండా చూశావు
నీ కష్టానికి ఫలితం దక్కకపోయినా
వచ్చిన దాంతో సంతృప్తి చెందుతూ
ముందున్న అగథాన్ని తెలుసుకోలేక పోయావు
ఇప్పుడు...
ఆపద రానే వచ్చింది
మూసివేత వేటు బతుకు మీద పోటెత్తింది
గతాన్ని నెమరు వేసుకుంటున్న క్షణం...
గడచిన అనుభవాలు
అనుభవాల మధ్య ఇంకేదో మూల.. కొడిగడుతున్న ఆశ
చివరికేం మిగిలింది..?
కమ్ముకున్న కన్నీటి పరవళ్లు తప్ప
అవసరానికి ముందు దోపిడీ
అవసరం తీరిన తర్వాత పీడన
ఇదే కదా వ్యవస్థ మనస్తత్వం
వాళ్లంతా అక్కర తీర్చుకొని
ఈ నీడను తలొదిక్కుకి తన్నేసి పోతారు
నువ్వొక్కడివే దీన్ని నమ్ముకున్నందుకు
ఏ దిక్కూ లేక ఈ చక్రాలకి.. పెళ్లాం పిల్లలతొ
బల్లిపాతర్లా పట్టుకొని వేలాడుతూంటావు
అవసరం ఊన్నప్పుడూ మొదటగా నువ్వే కావలసి వచ్చావు
అవసరం తీరిన తర్వాత కూడా మొదటగా నువ్వే..
తరిమివేయబడుతున్నావు
ఇంకా...
ఎవరొస్తారని ఆ ఎదురు చూపులు
ఇప్పటికైనా ప్రశ్నించు..
వాళ్లు ఒరగబెట్టిందేంటని..?
వాళ్లు నీకు చేసిన ద్రోహానికీ...
తడిగుడ్డ మెడచుట్టూ బిగించిన కుట్రకూ...
జవాబేంటని..
నిలదీయ్.. నిగ్గదీయ్ !
ఈ ప్రశ్న వాళ్ల వెన్నులో గునపంలా దిగెయ్
ఈ ప్రశ్న వ్యవస్థ గుండెల్లో గుబులెత్తించేలా దిగెయ్
(మూసివేసిన కర్మాగారాల్లోని అసంఘటిత కార్మికుల గురించి)
- 26.01.2000.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి